YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు వరుస కేసులు

చంద్రబాబుకు వరుస కేసులు

విజయవాడ, మే 13,
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వరుస కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఈ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో తాజాగా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రమాదకరమైన ఎన్440కె రకం వేరియంట్ వెలుగుచూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తోందని చంద్రబాబు ట్వీట్లు చేశారు. కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అలాంటి రకమేదీ లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో పలు చోట్ల కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని, ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కల్పించాయని న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది. నరసరావుపేటలోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇది కూడా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదే..! చంద్రబాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కలిసి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్నూలులో కూడా చంద్రబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే..! మరోవైపు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ స్థితిగతులపై ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, తాజా పరిణామాలపై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని అన్నారు. కరోనా బాధితులకు ఇస్తున్న సాయం, ఇతర అంశాలపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని.. ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అన్నారు.ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని..  కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు సాయం చేస్తామన్న సర్కారు, తన మాట నిలుపుకోవాలని అన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేయాలని సూచించారు.  కరోనా సంక్షోభ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు.
మైలేజ్ పెంచుతున్న వైసీపీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్నారు. పార్టీ నేతల సహకారం కొరవడటం, వరస అపజయాలు ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు వైసీపీయే ఎక్కువ మైలేజీ ఇస్తున్నట్లుంది. చంద్రబాబు వల్లనే వ్యాక్సినేషన్ కోసం ఆసుపత్రుల వద్ద బారులు తీరారని వైసీపీ నేతలు చెప్పడం ఖచ్చితంగా ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది.చంద్రబాబు వ్యాక్సినేషన్ పైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. అది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని తెలిసినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు పదే పదే వ్యాక్సినేషన్ విషయంలో వైసీపీ విఫలమయిందని విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిని పెద్దగా పట్టించుకోకుండా ఉండి ఉంటే వైసీపీకి గౌరవంగా ఉండేది. కానీ చంద్రబాబు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం ఆయనకే అనుకూలంగా మారింది.చంద్రబాబు మాటలు విని జనం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారంటే ప్రజల్లో ఆయన మాటకు విలువ ఉన్నట్లే కదా? జగన్ నుంచి మంత్రుల వరకూ వ్యాక్సిన్ తమ పరిధిలో లేదని చెబుతున్నా జనం వాటిని పట్టించుకోవడం లేదన్న మాటేగా? ఇదే ప్రస్తుతం వైసీపీలో చర్చ జరుగుతుంది. చంద్రబాబు వ్యాక్సినేషన్ విషయంలో ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని తెలిసినా ఆయన ట్రాప్ లో వైసీపీ నేతలు పడిపోయారనే అనిపిస్తుంది. చంద్రబాబు మరింతగా వ్యాక్సినేషన్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఇది కనీస పరిజ్ఞానం ఉండే వారికి ఎవరికైనా తెలుసు. కానీ చంద్రబాబు పదే పదే అదే విమర్శలు చేస్తున్నారంటే ఆయనకు తెలియక కాదు. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశ్యమే. అది వదలేసి వైసీపీ నేతలు చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనపై కేసులు నమోదు చేస్తుండటంతో వైసీపీ ఖచ్చితంగా చంద్రబాబుకు పోయిన ఇమేజ్ ను తెచ్చిపెడుతుందనే చెప్పాలి.

Related Posts