YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో షష్టిపూర్తి బ్యాచ్ కు రామ్..రామ్..

టీడీపీలో షష్టిపూర్తి బ్యాచ్ కు రామ్..రామ్..

గుంటూరు, మే 17,
తెలుగుదేశం పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దానికి కారణం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వీడియో కామెంట్స్ అని తెలుస్తోంది. అచ్చెన్నాయుడు తిరుపతి హొటలో లోకేష్ మీద చేసిన కామెంట్స్ టీడీపీలో అగ్గి పుట్టించాయి. ఒక విధంగా అది అచ్చెన్నాయుడు గొంతు మాత్రమే కాదు పార్టీలో మొత్తం సీనియర్ల భావన అలా ఉంది అంటున్నారు. దాంతో చంద్రబాబు తొందరలోనే కఠిన చర్యల దిశగా సాగుతారని అంటున్నారు. టీడీపీలో ఎన్నడూ చూడని సంచలన నిర్ణయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.పార్టీలో ఎన్టీయార్ టైమ్ లో చేరి ఇప్పటికీ సీటు వదలకుండా రాజకీయాల్లో కొనసాగుతున్న సీనియర్లే లోకేష్ ని పక్కా జూనియర్ గా చూస్తున్నారు అన్నది టీడీపీ అధినాయకత్వం భావన. వారు పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయినా పార్టీలో ఉంటూ పెద్ద మర్యాదను కోరుకుంటున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. సీనియర్లకు లోకేష్ ఎపుడూ కళ్ల ముందు చిన్న వాడిగానే కనిపిస్తాడు అన్న మాట కూడా ఉంది. దాంతో ఆయన ఇపుడు పార్టీని లీడ్ చేస్తున్నా కూడా వారు అసలు ఖాతరు చేయడంలేదని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏకంగా సీనియర్లనే పార్టీకి దూరంగా పెడితే మొత్తం వ్యవహారం కొలిక్కి వస్తుంది అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు.జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యనే టీడీపీ కూడా ఇపుడు ఎదుర్కొంటోంది. రాహుల్ గాంధీ వృద్ధ నాయకులను వద్దు అనుకుంటున్నారు. కానీ వారు సోనియా గాంధీ చుట్టూ చేరి పార్టీని తమకు తోచిన విధంగా మూస పద్ధతిలో నడపాలని అనుకుంటున్నారు. దాంతో పాటు రాహుల్ గాంధీని ఏ పనీ చేయనీయకుండా సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తున్నారు అని కూడా చెబుతారు. ఈ నేపధ్యంలో యంగ్ బ్లడ్ తో పార్టీని నింపాలని చాలా కాలంగా రాహుల్ ప్రయత్నం చేస్తున్న సంగతి విధితమే. ఇపుడు అదే తీరున కొత్త వారిని యువతరాన్ని పార్టీలో కీలకమైన స్థానాలలో పెడితే ఆటోమెటిక్ గా లోకేష్ కి పూర్తి ఆధిపత్యం వస్తుంది అని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.ఇక్కడ జగన్ ఫార్ములాను కూడా చంద్రబాబు అనుసరిస్తారు అంటున్నారు. ఊరూ పేరు లేని వారిని, కొత్త వారినీ తెచ్చి కీలకమైన పదవులు ఇస్తే వారు విధేయతతో పాటు పట్టుదలతో కసితో పనిచేస్తారని, పార్టీ పటిష్టం కావడానికి అది బాగా ఉపయోగపడుతుంది అని కూడా లెక్కలు వేస్తున్నారుట. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని చంద్రబాబు టోటల్ టీడీపీలో కొత్త నెత్తురు ఎక్కించే ప్రయత్నం చేస్తారని టాక్. మొత్తానికి అచ్చెన్న నోరు జారిన ఫలితంగా టీడీపీకి షష్టి పూర్తి బ్యాచ్ తమ్ముళ్ళు పూర్తిగా తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుందని పసుపు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
లోకేష్ కు వైస్ ప్రెసిడెంట్
మరో వైపు టీడీపీకి రెండు ఘ‌ట‌న‌లు మ‌రింత వేద‌న క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎక్కడిక‌క్కడ కేడ‌ర్ కోల్పోవ‌డం పెద్ద స‌మ‌స్య అయితే.. ఉన్న సీనియ‌ర్లు.. అంటే.. దాదాపు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నవారు.. గ‌తంలో చ‌క్రాలు తిప్పిన వారు ఇప్పుడు త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతుండ‌డం మ‌రో పెద్ద వివాదంగా మారింది. “మా స్థాయి వేరు. మేం చేసే రాజ‌కీయాలు వేరు“ అని వారు న‌ర్మగ‌ర్భంగా చెప్పుకొస్తున్నారు. అంటే.. టీడీపీలో త్వర‌లోనే కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటాయని, పార్టీ ఉపాధ్యక్ష ప‌ద‌వికి లోకేష్‌ను నామినేట్ చేసేందుకు.. చంద్రబాబు పావులు క‌దుపుతున్నార‌ని.. తెలుస్తున్న త‌రుణంలో సీనియ‌ర్లు తిరుగుబాటు బావుటా ఎగ‌రేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది.ఈ విష‌యం ఆనోటా.. ఈనోటా.. చంద్రబాబుకు చేరిపోయింది. ఆయ‌న కూడా క్షేత్రస్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించారు. ప‌లు నివేదిక‌లు తెప్పించుకున్నారు. ఇప్పుడున్న సీనియ‌ర్లలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంద‌రికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చార‌నే వారు.. కొంద‌రు మాత్రమే చంద్రబాబు వెంట ఉన్నార‌నేవారు.. ఇలా అనేక రూపాల్లో త‌మ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు నాయ‌క‌త్వాన్ని మాత్రమే వీరు కోరుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలోప్రత్యేకంగా జాతీయ‌ ఉపాధ్యక్ష కొలువు (ఇప్పటి వ‌ర‌కు లేదు) సృష్టించి.. త‌న బాధ్యతల్లో కొన్నింటిని లోకేష్‌కు అప్పగించేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నది మాత్రం వాస్తవం.దీనికిగాను వ‌చ్చే నెల‌లో నిర్వహించే.. మ‌హానాడును వేదిక‌గా చేసుకున్నార‌ని కూడా అంటున్నారు. అంటే.. ఇప్పటి వ‌ర‌కు నెంబ‌ర్ 2 లేదా 3గా ఉన్న లోకేష్‌కు అప్పుడు మెజారిటీ బాధ్యత‌లు, అధికారాలు కూడా ద‌క్కుతాయి. దీనిని సీనియ‌ర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నే త‌మ దారి తాము చూసుకుంటామ‌ని.. కుదిరితే.. కాంగ్రెస్ లేదంటే.. బీజేపీ ఎలానూ ఉంద‌ని.. వారు అనేస్తున్నారు. ఎక్కువ మంది చూపు బీజేపీవైపు ఉన్నట్టు తెలుస్తోంది.అయితే.. సీనియ‌ర్లే ఇప్పటి వ‌ర‌కు పార్టీకి అండ‌గా ఉన్నార‌ని భావిస్తున్న చంద్రబాబు వీరిని పార్టీ మార‌కుండా.. పార్టీలోనే కొన‌సాగించేలా.. అదే స‌మ‌యంలో త‌న కుమారుడి విష‌యంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమ‌లు చేసుకునేలా బుజ్జగించాల‌ని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రి మ‌హానాడు విష‌యానికి వ‌చ్చే స‌రికి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. ఈ ద‌ఫా మ‌హానాడులో లోకేష్ కీల‌కం కానున్నార‌నేది వాస్తవం అని అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాలే మీడియాకు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Related Posts