YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రచ్చ బండ... గుది బండ

రచ్చ బండ... గుది బండ

విజయవాడ, మే 17, 
నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు తనంతట తానే కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఒక ఎంపీ ఎలా వ్యవహరించకూడదో ఆయన గత కొన్నాళ్లుగా అలా వ్యవహరించారు. వైసీపీలో ఉన్న 22 మంది పార్లమెంటుసభ్యుల్లో రఘురామకృష్ణంరాజు ఒకరు. ఆయనకంటూ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం తొలి నుంచి తనకు ప్రయారిటీ కావాలని ఆశించారు. అదే ఆయనకు ఇబ్బందిగా మారింది.సమావేశాల్లో జగన్ ను చిన్న వయసువాడిగా చూడటం, ఏక వచనంతో సంభోదించడం వంటివి రఘురామకృష్ణంరాజుకు చేటు తెచ్చాయంటున్నారు. ఇదే జగన్ కు, ఆయనకు మధ్య గ్యాప్ పెంచింది. ఇక వరసగా వైసీపీ అధినాయకత్వం ఆదేశాలకు విరుద్ధంగా బీజేపీ పెద్దలను కలవడం కూడా రఘురామకృష్ణంరాజుకు ఇబ్బందికరంగా మారింది. అప్పటి నుంచే వైసీపీ ఆయనను కొంత దూరం పెడుతున్నట్లు అనిపించింది.అప్పటికీ రఘురామకృష్ణంరాజు గమనించలేదు. తనను తాను పెద్ద నాయకుడిగా ఫీలయిపోయారు. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు స్పీకర్ కు పిటీషన్ వేశారు. ఇక అప్పటి నుంచి రచ్చ బండ పేరుతో రఘురామకృష్ణంరాజు రోజూ యాగీ యాగీ చేస్తున్నారు. తొలినాళ్లలో జగన్ కు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ రానురాను పార్టీ అధినేతపైనే విమర్శలు ప్రారంభించారు. పార్టీ పేరుపైన కూడా ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. జగన్ తో పాటు ఆయన సామాజికవర్గంపైన కూడా దాడిని మొదలుపెట్టారు. దీనికి తోడు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్ కు ఆగ్రహం తెప్పించకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఎంపీగా, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వాడినని మర్చిపోయి రఘురామకృష్ణంరాజు దిగజారి వ్యవహరించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన రచ్చబండ కబుర్లు విన్నవారికి ఎవరికైనా ఆయన అరెస్ట్ పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.
జగన్ కు ఇబ్బందులేనా
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ జగన్ కు ఇబ్బందికరంగా మారనుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తో జగన్ తాత్కాలికంగా ఆనందం పొందవచ్చేమో కాని రానున్న కాలంలో న్యాయస్థానాల పరంగా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేయించి జగన్ తనంతట తానే ఇబ్బందులు కొని తెచ్చుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాాలని కోరుతూ పిటీషన్ వేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండటంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తన బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే తన బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ వేసిన రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ చేయడంతో న్యాయపరంగా సీబీఐ కోర్టులో జగన్ కు చిక్కులు తప్పవని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ తాత్కాలికమే. ఆయన బెయిల్ పై బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు ప్రత్యేకంగా పోయేదేమీ లేదు. బయటకు వచ్చిన తర్వాత రఘురామ కృష్ణంరాజు మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఇక రోజు వైసీపీ నేతలు ఆయనకు కౌంటర్లు ఇవ్వాల్సి ఉంది. కానీ జగన్ కు మాత్రం అలా కాదు. తాను బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ వేసినందునే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని రేపు సీబీఐ కోర్టులో రఘురామ కృష్ణంరాజు వాదించే అవకాశముంది. సాక్షులను, తన ప్రత్యర్థులను జగన్ ప్రభావితం చేయడం, బెదిరించడం వంటి వాటికి రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ఉదాహరణ అంటూ ఆయన న్యాయవాదులు వాదించవచ్చు. ఇది న్యాయపరంగా జగన్ కు ఇబ్బందులేనంటున్నారు. బెయిల్ పిటీషన్ రద్దు చేసిన వారిపైనే కేసులు నమోదు చేస్తే ఇక సాక్షులను జగన్ ఎందుకు ప్రభావం చేయరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. అందుకే న్యాయనిపుణులు మాత్రం రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ఆయన కన్నా జగన్ కు ఇబ్బందులు తెచ్చి పెడతాయంటున్నారు.

Related Posts