YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా వేళ కనిపించని నేతాశ్రీలు

కరోనా వేళ కనిపించని నేతాశ్రీలు

హైదరాబాద్, మే 17, 
ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరిగిన రాజకీయ నేతలు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు కరోనా సంక్షోభంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా వారిని కలవడానికి ముఖం చాటేస్తున్నారన్న అపవాదూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు ఎందుకు కనిపించడం లేదన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. కరోనా పరిస్థితుల్లో ప్రజలను కలవలేకపోతున్నామంటూ నిబంధనలను సాకుగా చూపుతున్నాయి.నిన్నగాక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి లాంటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూనే ఆ బాధ్యతను పోషించడంలో బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం విఫలమైందంటూ ప్రకటనలకే పరిమితమయ్యాయి.ప్రజలు బాధలు పడుతున్నారని, ఆస్పత్రుల్లో అడ్మిషన్లకు నోచుకోలేకపోతున్నారని, ఆక్సిజన్ ఇబ్బందులు ఉన్నాయని, రెమిడెసివిర్ మందులు దొరకడంలేదని.. ఇలా అనేక అంశాలను ఆ ప్రకటనల్లో ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అక్కడికే పరిమితమయ్యాయి. ఆ బాధలకు పరిష్కారం చూపడం, శక్తి మేరకు ఆదుకోవడం, స్థానికంగా ఉన్న కార్యకర్తల ద్వారా అవసరమైన సహాయ సహకారాలను అందించడం, కుటుంబ పెద్దను కోల్పోయి భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక వనరులు సమకూర్చడం.. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై ప్రతిపక్షాల స్పందన నామమాత్రమే.ఎన్నికల సమయంలో సర్వ శక్తులనూ ధారపోసి ప్రజల కరుణా కటాక్షాల కోసం పాకులాడే ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకున్నాయి. ప్రభుత్వంపై వత్తిడిచేసే శక్తిని, సామర్థ్యాన్ని, స్వభావాన్ని ఎన్నడో కోల్పోయిన ప్రతిపక్షాలు చిత్తశుద్ధితో కనీసం మాట సాయం కూడా చేయలేక పోతున్నాయి. ఆ పార్టీలకు చెందిన నాయకులు వారి వ్యక్తిగత స్థాయిలో బాధిత కుటుంబాలను స్వయంగా కలవడం, ఆస్పత్రులను సందర్శించి పేషెంట్లకు ఎదురవుతున్న కష్టాలను తెలుసుకోవడం లాంటివి చేస్తున్నా పార్టీ స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకోవడం, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి.కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేయగలిగిన సాయాన్ని కూడా ప్రతిపక్షాలు చేయలేకపోతున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో అభ్యర్థుల గెలుపు కోసం వైరి వర్గాలు ఏకమవుతున్నా, కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్నా ఇప్పుడు కరోనా సమయంలో మాత్రం ఆ నేతలు ముఖం చాటేసుకోవడాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు చెందిన రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత సాయంగా గాంధీ ఆస్పత్రి దగ్గర రోజుకు వెయ్యి మందికి భోజనాలను సమకూరుస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి తన ఛారిటీ సంస్థ ద్వారా అంబులెన్స్ లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. వ్యక్తుల స్థాయిలో ఇలాంటివి అక్కడక్కడా జరుగుతున్నా ప్రతిపక్ష పార్టీగా నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకున్న దాఖలాలు లేవు.కరోనా ఫస్ట్ వేవ్ సంగతి ఎలా ఉన్నా, సెకండ్ వేవ్ సమయంలో మాత్రం ప్రభుత్వంపై ప్రజలకు తీవ్రమైన అసంతృప్తే ఉంది. ఆస్పత్రుల్లో బెడ్‌ల మొదలు ఆక్సిజన్, మందుల వరకు ప్రభుత్వపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల కష్టాలను గాలికొదిలేసిందన్న కోపం ఏ స్థాయిలో ఉందో ప్రతిపక్షాలు కూడా నిర్లక్ష్యంగానూ, పట్టీపట్టనట్లుగానే ఉన్నాయనే ఆరోపణలూ చేస్తున్నారు. ఓట్లప్పుడు దండాలుపెట్టే నాయకులు ఇప్పుడు కనీసం ఫోన్‌లకు కూడా అందుబాటులో ఉండరనే కోపం వారిలో వ్యక్తమవుతోంది. కుటుంబ పెద్ద కరోనాతో చనిపోతే మొత్తం కుటుంబమే దిక్కులేనిదైనా వచ్చి పలకరించిన నేతలే లేరనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు దొందూ… దొందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Posts