YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటెల మిత్రుడి చర్చ

ఈటెల మిత్రుడి చర్చ

కరీంనగర్, మే 19, 
మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల వెనకున్న మర్మంపై తర్జన భర్జన సాగుతోంది. మంగళవారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఈటల… గంగులపై పరోక్ష విమర్శలు చేశారు. అలాగే 2023లో రాష్ట్ర ప్రభుత్వం మారుతుందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జీగా నా మిత్రునికే బాధ్యతలు అప్పగించారని తెలిసింది అని ఈటల అన్నారు. అయితే ఆయన మిత్రుడెవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ అధిష్టానం రెండు రోజుల క్రితం హుజురాబాద్ నియోజకవర్గంలో వివిధ మండలాలకు ఇంఛార్జీలను నియమించింది. నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పార్టీకి అనుకూలంగా కేడర్‌ను ఉంచే బాధ్యతలను జిల్లా మంత్రిగా గంగుల కమలాకర్‌కు అప్పగించింది. అయితే ఈ వ్యవహారాలను మానిటరింగ్ చేసేందుకు మంత్రి హరీష్ రావు, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు  హైకమాండ్  బాధ్యతలు అప్పగించింది. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో నా మిత్రునికే బాధ్యతలు అప్పగించారని అనడంతో హరీష్, వినోద్ లో ఎవరు ఈటలకు సన్నిహితులన్నదే ప్రధాన చర్చగా సాగుతోంది. అయితే ఈటల మాత్రం కేవలం గంగుల కమలాకర్ ను మాత్రమే టార్గెట్ చేశారు తప్ప హరీష్ రావు, వినోద్ కుమార్ లను మాత్రం ఏమీ అనలేదు. కానీ గత ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్‌లోని ఏడు సెగ్మెంట్ల కన్నా హుజురాబాద్‌లో 54 వేల మెజార్టీ తీసుకొచ్చానన్నారు. దీంతో బోయినపల్లి వినోద్ కుమార్ ఈటల తన మిత్రునిగా భావిస్తున్నారా లేక హరీష్ రావునా అన్నదే క్లారిటీగా లేకుండా పోయింది.అటు హరీష్, ఇటు వినోద్ ఇద్దరూ కూడా నియోజకవర్గంపై ఆపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావించింది. అయితే ఈటలనే ఇబ్బందులకు గురి చేయాలని పార్టీ నాయకత్వం పకడ్బందీగా ముందుకు సాగుతుంటే ఈటల నా మిత్రున్నే ఇంచార్జిగా నియమించారన్న వ్యాఖ్యలు చేసి హరీష్, వినోద్ కుమార్ లను ఈటల ఇరికించినట్టయింది. దీంతో ఈటలకు తాము సన్నిహితులం కాదని అధిష్టానం ముందు నిరూపించుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇదే సమయంలో పార్టీ అధిష్టానాన్ని కూడా ఈటల డైలమాలో పడాతారని చెప్పకతప్పదు.

Related Posts