YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సారీ కరోనా ఈ సారి పాత వేతనాలే

సారీ కరోనా ఈ సారి పాత వేతనాలే

హైదరాబాద్, మే 19, 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందుకునే అదృష్టం ఈ నెలలో కూడా లేనట్టే. పీఆర్సీ అమలు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నా ప్రకటనలకే పరిమితమవుతోంది. ఇప్పుడూ.. అప్పుడూ.. అంటూ ఎదురుచూపుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త పీఆర్సీపై జీవోలు జారీ కాకపోవడంతో కొత్త వేతనాలు అందుకునే అదృష్టం కనిపించడం లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్యోగుల ఆప్షన్లు తీసుకునే ప్రక్రియ కనీసం 20 రోజులైనా పడుతోంది. దీంతో ఈ నెల కూడా పెరిగిన వేతనాలపై ఆశలు వదులుకుంటున్నారు.తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపుపై గ్రహణం ఇంకా వీడడం లేదు. మే నెలలోనే పెరిగిన జీతం అందుకుంటామన్న ఆశతో ఉన్న ఉద్యోగులకు ఈ నెల కూడా మళ్లీ నిరాశే మిగలనుంది. సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో గత నెల ఫైల్ పెండింగ్ పడింది. సీఎం వరకూ వెళ్లిన ఫైల్ అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు. దాదాపు 23 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సీఎం ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. దీంతో పీఆర్సీ ఫైల్‌పై సంతకం పెట్టలేదు. మే నెలలో పెరిగిన వేతనాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో జూన్ నెలపై ఆశలు పెట్టుకున్నారు.ఏరియర్స్‌తో కలిపి జూన్‌లో ఖాతాల్లో జమ అవుతాయని ఎదురుచూశారు. కానీ ఈసారి కూడా అంతే. మార్చిలో జరిగిన బడ్జెట్సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి 30 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం ప్రకటనతో అధికారులు పెరిగిన స్కేళ్లకు అనుగుణంగా ఫైల్ తయారు చేశారు. ఆమోదం కోసం ఆ ఫైల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ లోగా సీఎం కరోనా బారినపడడంతో ఫైల్ పెండింగ్పడింది. వాస్తవానికి ప్రతీనెల 22లోగా బిల్లులు తయారు చేసి ఆర్థిక శాఖకు పంపిస్తేనే 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు అందుతాయి. దీనికి కొంత ముందు నుంచే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటోంది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు తర్వాత 22(ఏ), 22(బీ) ఫార్మాట్‌లో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతీ శాఖలోని ప్రతి ఉద్యోగి నుంచి తీసుకోవాలి. అంటే పీఆర్సీ అమలుపై ఎప్పటి నుంచి వర్తింప చేసుకోవాలి, పదోన్నతుల తర్వాత వచ్చే ఇంక్రిమెంట్‌పై ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ చిన్న డిపార్ట్‌మెంట్‌లో త్వరగా పూర్తి అయినా.. 100కుపైగా ఉద్యోగులు ఉండే వింగ్‌ల్లో మాత్రం దాదాపు 20 రోజులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఇప్పటికిప్పుడు కొత్త పీఆర్సీపై జీవోలు జారీ చేసినా ఆప్షన్లు తీసుకోవడం అనివార్యం కావడంతో వచ్చేనెల కూడా పాత వేతనాలనే అందుకోనున్నారు. మరోవైపు వేతనాల బిల్లులు, చెల్లింపులు.. కొన్ని శాఖల నుంచి మొదలయ్యాయి. ఎక్కువ సిబ్బంది ఉండే శాఖల్లో బిల్లులు త్వరగానే ఫైనాన్స్‌కు పంపిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 18వ తేదీ కావస్తుండటంతో పాత వేతనాలతోనే బిల్లులు రానున్నాయి.మరోవైపు ఆర్థిక శాఖ నుంచి ఆయా విభాగాలకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయినట్లు ఉద్యోగ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ఇది ఓ అవకాశంగానే మారింది. ప్రస్తుతం పెరిగిన వేతనాలను ఇవ్వలేమని, పాత వేతనాల ప్రకారమే బిల్లులు రెడీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి కూడా సూచించినట్లు చెబుతున్నారు.వాస్తవంగా కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు చాలా అంశాలు ఉంటాయి. గతంలో కూడా పీఆర్సీ అమలు చేసిన నెల కాకుండా.. మరో నెల ఆలస్యంగానే వేతనాలు ఇచ్చేవారు. కానీ ఈసారి మూడు నెలల పాటు సాగుతూనే ఉంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఉద్యోగ సంఘాలు దీనిపై అడుగుదామంటే కరోనా లాక్‌డౌన్ అడ్డంకిగా మారింది. ఉన్నతాధికారులు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. అటు సీఎంను కలిసేందుకు అసలే అవకాశం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలంటే ఏరియర్స్‌తో కలుపుకుని మొత్తం రూ. 1280 కోట్లకుపైగా అవసరముంటుంది. ఇవి సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కూడా ఇప్పుడు సిద్దంగా లేదు. దీంతో సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా 9 లక్షల మంది ఉద్యోగ వర్గాలకు కొత్త వేతనాలు ఈసారి కూడా రానట్టే. మరోవైపు కొత్త వేతనాలపై ఆశలు పెట్టుకున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నిరాశే ఎదురవుతోంది.

Related Posts