YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ కోలుకోనేది ఎలా

కాంగ్రెస్ కోలుకోనేది ఎలా

విజయవాడ, జూన్ 15, 
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ కు సానుకూలత వాతావరణం ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ఆ ఛాయలు కన్పించడం లేదు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గత పదేళ్ల నుంచి ఏపీ శాసనసభలో ప్రాతినిధ్యం దక్కలేదు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది. ఇటువంటి సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు మరోసారి పరాభావం తప్పదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శైలజానాధ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కూడా జరిగింది. అయితే ఏ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ను ఇప్పటికీ ఏపీ ప్రజలు దరి చేర్చుకోవడానికి ఇష్టపడటంలేదు. బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అది వైసీపీ, టీడీపీ వైపులకు మళ్లుతుందే తప్ప కాంగ్రెస్ వైపు టర్న్ కావడం లేదు.వచ్చే ఎన్నికల్లోనైనా కనీసం శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతలకు నిర్దేశించింది. అయితే ఒంటరిగా పోటీ చేస్తే అది సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారు. టీడీపీతో కలసి వెళితే బాగుంటుందన్న సూచనలు కూడా అందుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బీజేపీ నేతలు టీడీపీతో కలసి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో చంద్రబాబు పంచన చేరాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచనగా ఉంది.
2018 ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఏపీ ఎన్నికలకు వచ్చే సరికి పార్టీని దూరంగా పెట్టారు. అయితే తమకు బలమైన ఓటు బ్యాంకు ఇప్పటికీ ఉందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును బీజేపీ ఎటూ దూరం పెడుతుందని, అప్పుడు ఆయన కమ్యునిస్టులు, కాంగ్రెస్ వైపు చూడక తప్పదన్న ఆశతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నేతల ఆశలన్నీ చంద్రబాబుపై ఉన్నాయన్నది వాస్తవం. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

Related Posts