YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగు

 ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగు

తాను ఇకపై సినిమాలు చేయడం మాని పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తానని సినీనటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. యథాలాపమే అయినా హోదా ఇస్తే ఆ ఒక్కరితో కలవడానికి తనకు అభ్యంతరం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో పవన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు భిన్నమైన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలనే ప్రజలు బలంగానే ఉన్నారు. అందుకు నిదర్శనమే చిరంజీవి ప్రజారాజ్యానికి వచ్చిన 18 శాతం ఓట్లు. విభజన అనంతరం అధికార, విపక్షాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజలలో అటు టీడీపీ, ఇటు వైసీపీలకు చెప్పుకోదగ్గ వ్యతిరేకత ఉంది. అలా వ్యతిరేకించే వారు కచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆలోచన చేస్తారు. అయితే అందుకు ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి ప్రత్యామ్నాయం చూపగలడని విశ్వాసం కలిగించాలి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఆ అవకాశం జనసేన రూపంలో పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు.

ప్రజలు నేడు కోరుకుంటున్నది ప్రత్యామ్నాయ రాజకీయాలు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. విభజన అనంతరం రాష్ట్రం బాగా నష్టపోయింది అన్నది వాస్తవం. అలాంటి రాష్ట్రానికి కేంద్రం సహకారం అదే స్థాయిలో రాష్ట్రం బాధ్యతతో వ్యవహరించడం కీలకం. కాని అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. పోలవరం, రాజధాని ఎంపిక దాని నిర్మాణం, రాయలసీమకు ప్యాకేజీ, కడప ఉక్కు, కేంద్ర సంస్థల పూర్తి స్థాయి నిర్మాణం, ఆర్థిక లోటు లాంటి విషయాలలో కేంద్రం చిన్నచూపుపై ఎవరిని ముద్దాయిని చేయాలి అన్న దానిపై ఉన్న శ్రద్ధలో 10 వంతైనా రాష్ట్రానికి కావాల్సింది ఏమిటి? ఉన్నంతలో ఏమి చేయగలం అన్న విషయాలపై దృష్టి పెట్టకపోవడం బాధాకరం. అదే సందర్భంలో విపక్ష వైసీపీ వైఖరి కూడా సహేతుకంగా లేదు. విభజన చట్టం అమలు విషయంలో చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లుగా కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని ఒకవైపు మాట్లాడూతూనే రాష్ట్రపతి ఎన్ని కలలో ఏకపక్షంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు. చివరకు ఉప రాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్రానికి కేంద్రంలో పెద్దదిక్కుగా ఉండి కూడా ఉపయోగపడలేదని వెంకయ్యనాయుడిని విమర్శించి అదే వ్యక్తికి గాంధీ మనవడిని సైతం పక్కన పెట్టి ఓటువేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తే ఇక హోదా రాదని అందరికీ అర్థమవుతున్నది.

హోదా రాకపోయినా కనీసం రాజధాని, పోలవరం, కడప ఉక్కు, రాయలసీమకు ప్యాకేజీ, మన్నవరం, దుగ్గిరాజపట్నాన్ని పూర్తిచేయడం, ఆర్థికలోటు భర్తీ, హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తుల విభజన వంటి హక్కుగా ఉన్న విభజన చట్టాన్ని బీజేపీ అమలు చేస్తుందనే ఆశ కూడా అడుగంటిపోతోంది. బీజేపీ మనసు మార్చుకుని విభజన చట్టాన్ని అమలుచేస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడమే కాకుండా ఎంతో మేలు జరుగుతుందనడంలో అనుమానాలు అక్కరలేదు. అదే హోదా ఇచ్చి విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోతే వచ్చే ప్రయోజనం చాలా పరిమితం. కాని బీజేపీ మాత్రం హోదా చుట్టూనే రాజకీయాలు చేస్తోంది. కేంద్రం ఏపీపై చిన్నచూపు చూడడానికి బలమైన కారణం ప్రశ్నించే శక్తిమంతమైన నాయకుడు లేకపోవడమే! రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఒక పక్క ఆరోపిస్తూనే మరోపక్క వారితోనే స్నేహం చేసే అధికార పార్టీ, హోదా ఇస్తే కలవడానికి మేమూ సిద్ధమంటున్న విపక్షం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించేలా లేవని, ఏదైనా ప్రత్యామ్నాయం లభిస్తే మంచిదనే అభిప్రాయంతో ప్రజలున్నారు. టీడీపీ, వైసీపీ కాకుండా మిగిలిన పార్టీలకు ప్రస్తుత పరిస్థితులలో పెద్ద పాత్ర లేదు. ఫలితంగానే టీడీపీ, వైసీపీలకు తగిన ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తెలుగు ప్రజలలో బలమైన ప్రజాదరణ ఉన్న వ్యక్తులలో పవన్ ఒకరు. సినీరంగంలో పవన్ అభిమానులను సంపాదించుకున్నారు. 2014 ఎన్నికలలో చంద్రబాబు విజయంలో పవన్ పాత్ర కూడా కీలకమైనదే. అలా సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా తన బలం చూపించారు. 2019 ఎన్నికల నాటికి మాత్రం ప్రత్యామ్నాయమైతేనే ఆయనకు, రాష్ట్రానికి ప్రయోజనకరం. ఇప్పటి వరకు ఆయన రాజకీయాల్లో పోషించిన పాత్ర పరిమితమే. తాను ఒకరికి నష్టం చేయడానికో మరొకరికి లాభం చేకూర్చడానికో మాత్రమే ఉపయోగపడ్డారు.  తన పంథాను మార్చుకోకుండా 2019లో కూడా పరిమిత పాత్రతో సరిపెట్టుకుంటే మళ్లీకూడా మరొకరెవరికో ప్రయోజనం చేకూరుతుంది.  ఏపీలో భిన్నమైన రాజకీయాలు చేయడానికి పవన్‌కు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రజల అవసరం మేరకు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన రాజకీయాలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Related Posts