YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీ కాంగ్రెస్ లో సీనీయార్టి లొల్లి

టీ కాంగ్రెస్ లో సీనీయార్టి లొల్లి

హైదరాబాద్, జూన్ 22, 
కాంగ్రెసుకు తెలంగాణ కష్టాలు ఇంకా తీరలేదు. గత రెండు సంవత్సరాలుగా పీసీసీ పీఠం దాదాపు ఖాళీగా ఉన్నట్లే లెక్క. తనను తప్పించి వేరే వాళ్లకు బాధ్యతలు ఇమ్మని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో చెప్పేశారు. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలను సాకుగా చూపించి ఇక తన వల్ల కాదని తేల్చేశారు. అప్పట్నుంచి మరింతగా అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో ఉన్న వర్గాల కుంపట్లతో పెద్దగా సాధించేదేమీ లేదని కాంగ్రెసు పెద్దలకూ అర్థమైపోయింది. అందుకే వరస పరాజయాలు ఎదురవుతున్నా సుదీర్ఘకాలం గా ఉత్తమ్ నే కొనసాగిస్తూ వచ్చారు. ఆయన దాదాపు అస్త్ర సన్యాసం చేసేశారు. తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అప్పట్నుంచే కాంగ్రెసుకు కష్టాలు పెరిగిపోయాయి. ఎంతగా ప్రయత్నించినా ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడి నియామకం గడచిన అయిదు నెలలుగా సాధ్యపడటం లేదు. మనుషులు దొరకక కాదు. ఎన్ని అపజయాలు వెక్కిరిస్తున్నా పార్టీకి నాయకుల కొరత లేదు. పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందో లేదో తెలియకపోయినా పోటీదారులు ఎక్కువైపోయారు. ఒకరికి అధ్యక్ష స్థానం కట్టబెడితే మిగిలిన వారంతా ఏకమై తొలి రోజు నుంచే అసమ్మతి కార్యకలాపాలు మొదలు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. ఈ దుస్థితే కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోలేని నిస్సహాయతను కల్పిస్తోంది.గతంలో మూడు సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన హనుమంతరావు అధిష్టానానికి చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేకపోయినా నోటితో పెత్తనం చెలాయిస్తుంటారు. స్వయంగా తానే అధ్యక్షుడిని కావాలనే కోరిక ఆయనది. కానీ పీసీసీలో ఎవరూ పట్టించుకోరు. అందుకే పీసీసీ స్థాయి నాయకులపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. తన పేరు ఎవరూ ప్రతిపాదించడం లేదనే ఆవేదన కూడా అందులో మిళితమై ఉంటుంది. అప్పుడప్పుడు అందరిపైనా విరుచుకుపడుతూనే, అధిష్టానంపై మాత్రం లాయల్టీ ప్రకటిస్తుంటారు.తాజా గందరగోళానికి ఆయన ఒక కారణమని కాంగ్రెసు వర్గాలు పేర్కొంటున్నాయి. పీసీసీ అధ్యక్ష పీఠంపై ఏఐసీసీ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. ఇక అధ్యక్షుడిని ప్రకటించబోతున్నామన్న సమాచారమూ పీసీసీకి వచ్చింది. ఈలోపుగానే నాయకత్వానికి హనుమంతరావు చేసిన పిర్యాదులు సమస్యను మొదటికి తెచ్చి పెట్టాయి. రేవంత్ రెడ్డికి దాదాపు ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ బీసీలు, ఎస్సీలు, తెలంగాణ వాదులు మొత్తం దూరమవుతారనే ఫిర్యాదుతో ఏఐసీసీని వీహెచ్ గందరగోళ పరిచారని కాంగ్రెసు కార్యకర్తలు వాపోతున్నారు. ఎవరో ఒక కొత్త అధ్యక్షుడు వస్తే కార్యకలాపాలు పుంజుకుంటాయి. నిస్తేజంగా ఉన్న పార్టీలో ఉత్సాహం వస్తుందని కాంగ్రెసునే నమ్ముకున్న కార్యకర్తలు ఆశిస్తున్నారు.కులపరమైన గణాంకాలూ పీసీసీ పీఠానికి అడ్డంకిగా మారాయి. రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది అధ్య్షక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవనర్ రెడ్డి, జగ్గారెడ్డి తాము అర్హులమని స్వయంగా ప్రకటించుకుంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ జనాభాలో బీసీలు అగ్రస్థానంలో ఉంటారు. అందువల్ల తాను రేసులో ఉన్నానంటున్నారు మాజీ ఎంపీ మధు యాష్కీ . ఆయన రాహుల్ కు బాగా సన్నిహితుడు. ఇంకోవైపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ బాబు కూడా ఆశిస్తున్నారు. తనకు అందరితో సత్సంబంధాలు ఉన్నందువల్ల మధ్యేమార్గంగా పదవి దక్కితే పనిచేస్తానంటున్నారు. కాంగ్రెసులొ ఎస్సీ వర్గానికి చెందిన వారు మాత్రం ఈ పదవిని ఆశించడం లేదు. అదొక్కటే కొంచెం పోటీని తగ్గించిందనవచ్చు. ఏపీలో ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన శైలజానాధ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అందువల్ల తమకు అవకాశాలు తక్కువని భట్టి విక్రమార్క వంటివారు మౌనం వహిస్తున్నారు. వీరందరికంటే ప్రజల్లో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు. అధిష్ఠానం సైతం అనేక విడతలుగా నాయకులు, కార్యకర్తల నుంచి సర్వేలు నిర్వహించగా ఆయనవైపే మొగ్గు కనిపించింది. అయితే పోటీలో ఉన్న నాయకులందరికంటే రేవంత్ పార్టీలో జూనియర్. పాప్యులారిటీ కంటే సీనియార్టీకే పెద్ద పీట వేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీని కష్ట కాలంలో విడిచిపెట్టకుండా ఉన్న తమను కాదని రేవంత్ కు పగ్గాలు అప్పగించడం ఎవరికీ ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి వంటి చురుకైన వ్యక్తి అయితేనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు దీటుగా నిలుస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీ చాలా వేగంగా రాష్ట్రంలో విస్తరిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం ఆకర్షించే పనిలో పడింది. బీజేపీకి చెక్ పెడుతూ టీఆర్ఎస్ పై పోరు సాగించాలంటే రేవంత్ సరైన అభ్యర్థి అని రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఆయనకున్న సంబంధాలను వెలికితీస్తున్నారు అసమ్మతి వాదులు. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే నేరుగా చంద్రబాబు నాయుడికే పట్టం గట్టినట్లవుతుందని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెసు నష్టపోయిందనే వాదన ఉంది. మళ్లీ ఆ ముద్ర వేయించుకున్నట్లవుతుందని కొందరు చెబుతున్నారు. పైపెచ్చు రేవంత్ పై దర్యాప్తు చేస్తున్న కేసు కూడా టీడీపీతో ముడిపడి ఉన్నదే. మొత్తమ్మీద పీసీసీ సమస్య ఇప్పట్లో తేలేలా లేదు. రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే అన్న నానుడి వ్యక్తులకే కాదు, పార్టీలకూ వర్తిస్తుందని కాంగ్రెసు పార్టీ నిరూపిస్తోంది.

Related Posts