YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కృష్ణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యమేనా..

కృష్ణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యమేనా..

మహబూబ్ నగర్, జూన్ 25, 
పాత ప్రాజెక్టులను పక్కన పడేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కడ్తామని గొప్పలకు పోతోంది. కృష్ణా నదిపై రెండు లిఫ్టులతో పాటు ఒక బ్యారేజీ నిర్మిస్తామని ఇటీవల రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం దక్షిణ తెలంగాణ రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే కృష్ణాపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు  రూ. వెయ్యి కోట్లు ఇవ్వడం లేదు గానీ.. రూ. 20 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులెట్ల కడ్తారంటూ అక్కడి ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కృష్ణా ప్రాజెక్టుల కోసం రూ. 30 వేల కోట్లలోపే ఖర్చు చేశారు. ఇప్పుడు కొత్తగా శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌లో  3.82 కి.మీ.ల పొడవైన భారీ బ్యారేజీ, సర్జ్‌‌పూల్‌‌, పంపుహౌస్‌‌, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌‌  వరకు సుమారు 30 కి.మీ.ల పైపులైన్‌‌  వేసేందుకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కల్వకుర్తి రిజర్వాయర్లకు 2016లోనే రూ.5 వేల కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఇప్పుడు వీటి వ్యయం రూ.6 వేల కోట్లకుపైగా పెరుగనుంది. మిగతా ప్రాజెక్టులు, కాల్వలు, ఇతర పనులు, భూసేకరణకు ఇంకో రూ. 8 వేల  కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం కలిపి రూ. 20 వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆన్‌‌గోయింగ్‌‌ ప్రాజెక్టులకే నిధులివ్వని ప్రభుత్వం, ఈ ప్రాజెక్టుల కోసం అంత భారీ మొత్తం ఎక్కడి నుంచి తీసుకువస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయిభీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, భూసేకరణకు రూ. వెయ్యి కోట్లు విడుదల చేస్తే  దాదాపు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందుతుంది. ఈ అంశంపై అక్కడి రైతులు పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కనీసం పెండింగ్ బిల్లులను కూడా రిలీజ్ చేయడం లేదు. మరోవైపు రాష్ట్ర ఖజానాలో ఉన్న నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లించింది. ఇప్పుడు ఉన్నఫళంగా కృష్ణా నీళ్లు గుర్తుకు వచ్చినట్లు.. కొత్త ప్రాజెక్టులు కడ్తామని చెప్పడం సందేహాలకు తెరలేపింది. పాత ప్రాజెక్టుల పనులకు రూ. వెయ్యి కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులెలా కడుతుంది..? ఎక్కడి నుంచి నిధులను మళ్లిస్తుంది..?  పాత ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయకుండా ఎందుకు వదిలేసినట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టులపై ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యం చూపుతోంది. పాలమూరు ప్రాజెక్టును రీ డిజైన్‌‌ పేరుతో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చింది. ప్రాజెక్టులోనూ మార్పులు చేసింది. 2018లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నా, నిధులు ఇవ్వకపోవడంతో నిర్మాణ వ్యయం రూ. 35 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు పెరిగింది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయాల్సిన ఈ ప్రాజెక్టును తర్వాత ఒక టీఎంసీకే పరిమితం చేసింది. ప్రాజెక్టు ఫస్ట్ పంపుహౌస్‌‌ (ఎల్లూరు)ను  మొదట ఓపెన్‌‌  కట్‌‌గా ప్రతిపాదించి తర్వాత అండర్‌‌  గ్రౌండ్‌‌కు మార్చారు. అండర్‌‌ గ్రౌండ్‌‌ పంపుహౌస్‌‌ కోసం చేసిన బ్లాస్టింగ్స్‌‌తో కల్వకుర్తి పంపుహౌస్‌‌ మునిగిపోయింది. నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌ సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు తగ్గించినా నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేశారు. డిండి ప్రాజెక్టుకు  ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలనే దానిపై సర్వేల పేరుతోనే కోట్లు వృథా చేశారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల కోసం రూ. 1.17 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఇందులో కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టుల ఖర్చు రూ. 30 వేల కోట్లలోపే ఉంది. ఇందులో పాలమూరు ప్రాజెక్టుకు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. మిగతా ఆన్‌‌గోయింగ్‌‌, పెండింగ్‌‌ ప్రాజెక్టులకు మిగతా మొత్తం వెచ్చించారు. ఇందులో రూ. 5 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌‌లో ఉండటంతో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు  రెడీగా లేరు. బడ్జెట్‌‌ కేటాయింపుల్లోనూ కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. వేల కోట్ల పనులు చేయాల్సిన చోట వంద కోట్ల లోపే బడ్జెట్‌‌ కేటాయింపులు చేసింది. అందులోనూ సగం నిధులు కూడా ఖర్చు చేయలేదు.కృష్ణా ప్రాజెక్టులకు నిధులివ్వకపోవడంతో పనులు పూర్తికాక లక్షల ఎకరాలు బీడుగానే ఉంటున్నాయి. కల్వకుర్తి కాల్వల కెపాసిటీ చుక్క కూడా పెంచలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా..  రూ.1,653 కోట్ల బిల్లులు పెండింగ్లో  ఉన్నాయి. దీనికింద ఇంకో 1.17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా పనులు పూర్తి కాక నీళ్లు అందటం లేదు.  జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఏర్పాటు చేసిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌  లిఫ్టుల ప్రధాన కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులు పెండింగ్‌‌లో పెట్టారు. ఫలితంగా భీమా కింద 45 వేల ఎకరాలు, నెట్టెంపాడు కింద 50 వేల ఎకరాలు, కోయిల్‌‌ సాగర్‌‌ కింద 12 వేల ఎకరాలకు నీళ్లు అందడం లేదు. ఈ 4 ప్రాజెక్టులకు కలిపి భూసేకరణ, ఆర్‌‌  అండ్‌‌  ఆర్‌‌, ఇతర పనులకు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా, రాష్ట్ర సర్కారు రూపాయి కూడా ఇవ్వలేదు. నల్గొండ జిల్లాలో  లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ఉదయసముద్రం లిఫ్ట్‌‌ పనులు ఏండ్లుగా సాగుతూనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లు అందట్లేదు. ఏఎమ్మార్‌‌ ఎస్‌‌ఎల్బీసీ ఎత్తిపోతల పనులు పెండింగ్‌‌లో ఉండటంతో 30 వేల ఎకరాలకు నీళ్లు అందట్లేదు.

Related Posts