YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ తెరపైకి టీటీడీ

మళ్లీ తెరపైకి టీటీడీ

తిరుమల, జూలై  19, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు బలంగా ఉన్నారు. జగన్ అన్ని రకాలుగా..అన్ని మార్గాల్లో పార్టీని పటిష్టం చేసుకుంటున్నారు. జగన్ పాలనలో అభివృద్ధి లేదని అనడం తప్ప మరేరకమైన ఆరోపణలు చేయలేని పరిస్థితి విపక్షాలది. ఇంకా మూడేళ్ల సమయంలో జగన్ ఎంతో కొంత అభివృద్ధి జరిపి చూపిస్తే అది కూడా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి కరవవుతుంది. అందుకే జగన్ ను వేరే రకంగా భ్రష్టు పట్టించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనది. వెంకన్న భక్తులు కోట్ల సంఖ్యలో ఉంటారు. తిరుమల సెంటిమెంట్ బలంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు తిరుమలను టార్గెట్ గా చేసుకుని టీడీపీ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని గతంలో ఆరోపణలు చేసినా దానికి తగిన ఆధారాలను టీడీపీ చూపలేకపోయింది. ఇప్పుడు టీటీడీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకువచ్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న దానిపై రచ్చ చేయాలని నిర్ణయించింది.జగన్ ను క్రిస్టియన్ గా జనంలోకి తీసుకెళ్లే క్రమంలో గత ఎన్నికల్లోనూ, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ విఫలమయింది. జగన్ ఆ విమర్శలు తన దరిచేరవని ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపించుకోగలిగారు. అయితే టీడీపీ, బీజేపీ మాత్రం అదే అంశంపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసి టీటీడీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శలను ఇప్పటికే టీడీపీ మొదలుపెట్టింది.గతంలో ఆలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల విధ్వంసంపైన కూడా టీడీపీ నానాయాగీ చేసింది. అయితే అవి సద్దుమణగడంతో ఇప్పుడు టీటీడీపై టీడీపీ దృష్టి పెట్టింది. ఇక జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలన్న ప్రయత్నంలో టీడీపీతో పాటు దాని అనుకూల మీడియా ఉన్నట్లు అర్థమవుతుంది. మున్ముందు మరింత ప్రచారం జగన్ కు వ్యతిరేకంగా జరిగే అవకాశాలున్నట్లు వైసీపీ అధినాయకత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగా జగన్ హిందూ దేవాలయాల పర్యటన చేసే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Related Posts