YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇక వేగంగా రేషన్ కార్డులు

ఇక వేగంగా రేషన్ కార్డులు

నిజామాబాద్, జూలై 20, 
కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి సీఎం కేసీఆర్‌ పచ్చజెండా ఊపారు. ఈ నెల 26 నుంచి పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని, అర్హత పొందిన వారికి కార్డులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. దీంతో జిల్లాలో కొత్తగా దాదాపు రెండు లక్షల  పైగా కొత్త రేషన్‌కార్డులు అందనున్నాయి. ఇప్పటికే 12.14 లక్షల కార్డులు ఉండగా, కొత్త వాటితో కలిపి వీటి సంఖ్య 14.20 లక్షలకు చేరుకోనుంది. ఆగస్టు నుంచి బియ్యం సరఫరా చేయాలని, ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విధిగా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా రేషన్‌ కార్డుల పెండింగ్‌ దరఖాస్తులన్నింటినీ పూర్తి చేసి కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ నెల 26 నుంచి పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించేలా సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 12,14,236 కార్డులు ఉన్నాయి. వీటివల్ల సుమారు16.40 లక్షల మంది లబ్ధిదారులకు ఆకలితీరుతున్నది. కొత్త కార్డులు ఇవ్వాలన్న నిర్ణయంతో జిల్లాలో తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య సుమారు 14,20,879 కు పెరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డుదారులకు ఉచితంగా రేషన్‌ బియ్యం అందిస్తున్నాయి. అయితే కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో కొంతమందికి ఉచిత బియ్యం లభించలేదు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వీరు కూడా ఉచిత రేషన్‌ బియ్యం అందుకోనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నూతన రేషన్‌ కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా దరఖాస్తుదారుల పరిశీలన కొలిక్కి వచ్చింది. కార్డుల జారీపై పౌరసరఫరాల సంస్థ అధికారులు సమీక్ష నిర్వహించి, జారీకి తీసుకోవాల్సి చర్యలపై చర్చించారు.జిల్లాలో 1423 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ప్ర స్తుతం 12,14,236 కార్డులు ఉన్నాయి. ఇందులో 6,98,649 ఆహార భద్రత కార్డులు, 1,15 ,417 అంత్యోదయ, 1170 అన్నపూర్ణ కార్డులు ఉన్నా యి. కార్డుల కోసం ప్రధాన కార్యాలయం నుంచి మొత్తం 128,589 దరఖాస్తులు వెరిఫికేషన్‌ కోసం వచ్చాయి. ఎమ్వార్వో లాగిన్‌లో కార్డులు, డీసీఎస్‌వో లాగిన్‌లో 8,543 వచ్చాయి. విచారణలో 1900 కార్డులను వివిధ కారణాలతో తిరస్కరించారు.వేరిఫికేషన్‌ పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. సంబంధిత ఉత్తర్వులు రాగానే ప్రక్రియ పూర్తిచేస్తామని, 26 నుంచి కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని పౌరసరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వచ్చిన కార్డుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని, దీంతో అర్హులైన పేదలకు లబ్ధిచేకూరుతుందని ఆయన వివరించారు.

Related Posts