YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆగని వానలు... అంతా అతలాకుతలం

ఆగని వానలు... అంతా అతలాకుతలం

హైద్రాబాద్, జూలై 24,  ఆగని వానలు... అంతా అతలాకుతలం వేలాది ఎకరాల్లో పంట నష్టం చెరువులను తలపిస్తున్న కాలనీలు
కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జలాశయాలు, చెరువులు, వాగుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నాయి. పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చొచ్చుకురావడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. నీటితో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదైంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌(జి) మండలాల్లో 23.65 సెం.మీ వర్షం కురిసింది.నిర్మల్‌ జిల్లాలో కుంభవృష్టిగా వర్షం కురవడంతో గడ్డెన్నవాగు బ్యాక్‌ వాటర్‌ ఉధృతి పెరిగింది. దీంతో గుండేగాం గ్రామం నీట ముని గింది. రాత్రి వేళ భారీ వర్షం కురవడంతో గ్రామస్తులు తెల్లారేదాకా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితితో నరకం అనుభవిస్తున్నామంటూ బాధితులు వాపోయారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్దకు బందోబస్తుకు వెళ్లిన పలువురు పోలీసులు వరదలో చిక్కుకున్నారు. నిర్మల్‌ పట్టణంలోని జీఎన్‌ఆర్‌ కాలనీలో కొన్ని నివాసాలు నీట మునిగాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించి సహాయక చర్యలు చేపట్టారు. దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌(జి) మండలాల్లో పలుచోట్ల శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. ఈ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం జాతీయ విపత్తుల నివారణ బృందాన్ని(ఎన్డీఆర్‌ఎఫ్‌) రంగంలోకి దించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 254మీ.మీ వర్షపాతం నమోదు కాగా కుమురంభీం ఆసిఫాబాద్‌ 334మీ.మీ, మంచిర్యాలలో 496మీ.మీ వర్షపాతం నమోదైంది. సుద్దవాగు ఉప్పొంగి ప్రవహించడంతో భైంసా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సిరాల ప్రాజెక్ట్‌ నుంచి భారీగా వచ్చిన వరద నీటితో ఇలేగాం, సిరాల శివారులో పంట నష్టం సంభవించింది. దేగామ నుంచి ఇలేగాం వెళ్లే మార్గంలో వాగు ఉధృతికి వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి.నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా మెండోరాలో 19.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. బినోలా, భీంగల్‌, బోధన్‌, ఎడపల్లిలోని జైతాపూర్‌లో, ముప్కాల్‌లో తదితర మండలాల్లో ఇండ్లు కూలాయి. వడ్యాట్‌, కమ్మర్‌పల్లి మధ్యలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఉప్లూర్‌-కమ్మర్‌పల్లి, దబ్బ-ఇబ్రహీంపట్నం మధ్య రోడ్డు సైతం వర్షాలకు కొట్టుకుపోయింది.ఖమ్మం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వైరాలో ప్రాజెక్టు అలుగుపడటంతో లక్ష్మీపురం-సిరిపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రఘునాధపాలెం మండలం బంజరా-పాపటపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు అలుగుపడటంతో కాకర్లపల్లి, రుద్రక్షపల్లి గ్రామాల్లో వరి నాట్లు నీట మునిగాయి. కల్లూరు పెద్ద చెరువు అలుగుపడటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి సమీపంలో పిడుగుపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వరద ఉధృతికి పర్ణశాలలో సీతమ్మ నారాచీరె ప్రదేశం నీట మునిగింది. మణుగూరు, ఇల్లందు, టేకులపల్లి, సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. చండ్రుగొండ మండల కేంద్రంలో డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపునీరు ఇండ్లల్లోకి చేరింది. జగిత్యాల - మంచిర్యాల రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి మండలం నేరెళ్ల గుట్ట వద్ద రహదారిపై నీరు నిల్వడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. రాయపట్నం నుంచి వెల్గటూర్‌ మీదుగా వాహనాలను మళ్లించారు. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్‌ ఫకీర్‌ కొండాపూర్‌ మధ్య లోలెవల్‌ వంతెనపై నుంచి వరద నీరు భారీగా పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కోరుట్ల, కథలాపూర్‌ మండలాల్లోని గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి.యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి కొత్త ఘాట్‌రోడ్‌లో ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ సందర్శకులు, ఇతరులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. మోత్కూర్‌ మండలంలో పత్తిచేను నీటమునిగింది. గుండాల మండలంలోని చెరువులు పూర్తిగా నిండాయి. మోటకొండూరు మండలంలో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అడ్డగూడుర్‌ - గోవిందాపురం గ్రామాల మధ్య కల్వర్టు లేకపోవడంతో వరద నీరు ఉధృతంగా వస్తుంది. మద్దిరాల మండలంలో నిండుకుండ మాదిరిగా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. పంటలు కూడ వర్షంనీటిలో మునిగాయి. నూతనకల్‌ మండలంలోని సింగారం వాగు పొంగిపొర్లుతుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 35 మి.మీల వర్షపాతం నమోదైంది. పత్తి, వేరుశెనగ, కంది పంటలు నీటిలో మునిగిపోయాయి. కొల్లాపూర్‌లో ఉడుముల, ముక్కిడి గుండం, పెద్దవాగు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గద్వాల మండలం గుర్రంగడ్డకు కృష్ణానది పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌ మండలంలోని ఆంకలమ్మ చెరువులోకి భారీగా నీరు చేరింది. తాండూర్‌లోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్‌నగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో మూడు గేట్లు ఎత్తారు.
ఆర్‌ఆర్‌ఆర్‌ ఇండ్లలోకి నీర సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులకు కట్టించి ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేర్యాల మండలం చిట్యాల గ్రామ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిరుదొడ్డి మండంలోని కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అల్వాల్‌ నంచి సిద్దిపేటకు వెళ్లే రహదారిని పోలీసులు నిలిపివేశారు.మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గ్రేటర్‌ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. అయితే ఎమర్జెన్సీ టీమ్‌లు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి. వర్షం పడ్డంత సేపు రోడ్లపై, కాలనీల్లో నీళ్లు నిలుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలవల్ల జనం చాలావరకు ఇండ్లల్లోనే ఉండిపోయారు. వర్షంవల్ల తలెత్తిన సమస్యలకు సంబంధించి జీహెచ్‌ఎంసీకి 274 ఫిర్యాదులు రాగా వీటిలో 239 అధికారులు పరిష్కరించారు. 35 పురోగతిలో ఉన్నాయి. రోడ్ల మరమతులు 43, నీళ్లు నిల్వడం 39, మ్యాన్‌హౌల్‌ కవర్‌ 10, డ్రయినేజీ ఓవర్‌ ఫ్లో 92, నాలా ఓవర్‌ ఫ్లో 46, చెట్లు విరగడం 27 ఫిర్యాదులు ఈ మూడురోజుల్లో అందాయి.విరామం లేకుండా కురుస్తున్న వానతో సింగరేణి ఓసీసీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని మూడు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి ఉపరితల గనుల్లోకి భారీగా వర్షం నీరు చేరింది. ప్రాజెక్టు కింద ఉన్న యంత్రాలు నీటిలో మునగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సింగరేణి డంపర్లను అధికారులు నిలిపివేశారు. రామగుండం ఓసీపీ - 1, 2, 3 ఉపరితల గనుల్లో రోజుకు సుమారు 70వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షాలతో శ్రీరాంపూర్‌, ఇందారం, మందమర్రి, కేకే, ఆర్కే ఒపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Related Posts