YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అనుకున్నదొక్కటి... అయినొదక్కటి.. పాపం..కౌశిక్ రెడ్డి

అనుకున్నదొక్కటి... అయినొదక్కటి.. పాపం..కౌశిక్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 14, 
ఆయన ఎమ్మెల్సీ అయ్యారా.. లేదా? టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయావర్గాల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. దీంతో ఆ ఫైల్‌ ఆగిందా లేక ఆపారా అన్న చర్చ జోరందుకుంది.ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కొద్దిరోజుల ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ వర్గాలైతే విస్మయం చెందాయి. ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేసింది ప్రభుత్వం. అయితే పార్టీ నేతగా కాకుండా.. ఒక క్రికెట్‌ ప్లేయర్‌గా అతని పేరును మంత్రివర్గ సమావేశంలో ఎంపిక చేశారు.కేబినెట్‌ ఎమ్మెల్సీగా సిఫారసు చేసింది సరే. ఇంతకీ కౌశిక్‌రెడ్డికి సంబంధించిన ఫైల్‌ ఎక్కడుంది? ఏమైంది? ఏ పొజిషన్‌లో ఉంది? ఇలా పదిరోజులుగా ఆరా తీస్తున్నారు. సంబంధిత విభాగాలను అడిగితే ఎవరూ తమకు తెలియదు అనే సమాధానం ఇస్తున్నారట. గతంలో బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసినప్పుడు ఇంత టైమ్‌ పట్టలేదు. కానీ.. కౌశిక్‌రెడ్డి విషయంలోనే అనేక ప్రశ్నలకు తావిస్తోందట.ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన ఫైల్‌ రాజ్‌భవన్‌లో ఆగిపోయిందా? లేక CMOలో పెండింగ్‌లో ఉందా? సెక్రటేరియట్‌కు వచ్చి ఆగిపోయిందా అన్నది ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట. పైగా ఈ అంశంపై చర్చించేందుకు అధికారులు జంకుతుండటం మరింత సందేహాలకు ఆస్కారం ఇస్తోంది. గవర్నర్‌ కూడా అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు తాత్సారం జరుగుతోందో పార్టీ వర్గాలకు కూడా తెలియడం లేదట. ఈ సందర్భంగా రకరకాల ఊహాగానాలు.. చర్చలు బయటకొస్తున్నాయి.కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న నిర్ణయంపై టీఆర్‌ఎస్‌లో ఇంటా బయటా విమర్శలు వచ్చాయి. హుజురాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ప్రత్యేకంగా ఓ నాయకుడి ఇంట్లో మీటింగ్‌ పెట్టుకుని అభ్యంతరాలు వ్యక్తం చేశారట. కౌశిక్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాలకు వెళ్లకూడదని ప్రత్యేకంగా తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. పైగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన కార్యక్రమాలపై వ్యతిరేక ప్రచారం కూడా మొదలైంది. దీంతో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన ఫైల్‌ ఎక్కడైనా ఆగిందా? లేక ఎవరైనా ఆపారా అన్న చర్చకు ఈ కథనాలను జోడించి చర్చకు పెడుతున్నారు. మరి.. ఆ ఫైల్‌ ఏమైందో ఏంటో కాలమే చెప్పాలి.

Related Posts