YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ గూటికి గోరంట్ల అనుచరులు

వైసీపీ గూటికి గోరంట్ల అనుచరులు

వైసీపీ గూటికి గోరంట్ల అనుచరులు
రాజమండ్రి, ఆగస్టు 23,
రాజమండ్రి లో టిడిపి అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్ప మరో పేరు వినపడేది కాదు. గోరంట్ల అంటే తెలుగుదేశం అనే అంతా భావించే స్థాయికి ఆయన ఎదిగారు. దాదాపు తన 39 ఏళ్ళ రాజకీయ జీవితంలో రాజమండ్రిని టిడిపి కి కంచుకోటగా మార్చిన ఘనత నిస్సందేహంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి దే అని చెప్పాలి. క్షేత్ర స్థాయిలో పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఒకప్పుడు గోరంట్ల గ్రాస్ రూట్ లో ఏర్పాటు చేసిందే.అలాంటి టాప్ లీడర్ కు గత ఏడేళ్ళు గా సొంత ఇలాఖాలో మాట చెల్లుబాట కావడం లేదు. దీనికి కారణం మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ ఆధిపత్యం, వారికి అధిష్టానం ముఖ్యంగా లోకేష్ చల్లని ఆశీస్సులే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భగ్గుమనడానికి దారితీశాయి. అందుకే ఆయనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అసంతృప్తి తలెత్తింది. రాజకీయాల నుంచే శాశ్వతంగా వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చారు.ఒకటి రెండు సార్లు కాదు రాజమండ్రి కార్పొరేషన్ లో మూడు సార్లు తన వ్యూహంతో తెలుగుదేశం పార్టీకి మేయర్ స్థానం దక్కేలా చేయగలిగారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయితే కొంత కాలంగా పార్టీలో తనను కాదని ఆదిరెడ్డి వర్గానికి పెరిగిన ప్రాధాన్యతతో బుచ్చయ్య వర్గానికి చెందిన వారు వరుసగా వైసిపి కండువా కప్పేసుకోవడం మొదలు పెట్టారు. వీరిలో గోరంట్ల కు ప్రధాన అనుచరులుగా ఉండే మాజీ కార్పొరేటర్ లు పాలిక శ్రీనివాస్, బెజవాడ రాజ్ కుమార్ జై జగన్ అంటే మరో మాజీ కార్పొరేటర్ కురగంటి సతీష్ జై బిజెపి అని వెళ్ళి పోవడం గమనార్హం.మరికొందరు మాజీ కార్పొరేటర్ లు కూడా వైసిపి లో సీటు ఒకే అంటే వెళ్ళెందుకు సై అనేలాగే ఉన్నారు. ఇంకొందరు మాజీ కార్పొరేటర్ లు క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవన్నీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికు పార్టీలో ప్రయారిటీ తగ్గడం ఒక కారణం అయితే ఆదిరెడ్డి అప్పారావు వర్గం తో ప్రయాణం చేయలేక జరుగుతున్న పరిణామాలు గా పసుపు పార్టీలో టాక్.
ఆదిరెడ్డి మౌనం
రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన జర్క్ ఆ పార్టీలో ఇప్పట్లో తగ్గేది అయితే కాదు. పార్టీకి రాం రాం చెప్పేస్తా అన్న చిన్నన్న నిర్ణయం పై తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు ఏపీ అంతా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పార్టీలో కానీ అధికారపార్టీలో కానీ ఏమి జరిగినా స్పందించే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పూర్తిగా కొంతకాలంగా స్తబ్దుగానే ఉంటూ వస్తున్నారు. తూర్పు రాజకీయాలకు టిడిపి లో పెద్ద దిక్కుల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ఆయన కూడా నారా లోకేష్ స్పీడ్ అందుకున్నాక అన్ని విషయాల్లో అంటి ముట్టనట్లే వ్యవహారాలను నెట్టుకొస్తున్నారు.యనమల రామకృష్ణుడుతో సమానంగా జగ్గంపేట మాజీ ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు గతంలో స్పీడ్ గా ఉండేవారు. అయితే ఆయన వైసిపి లోకి వెళ్ళి తిరిగి టిడిపి లోకి వచ్చాకా కేవలం ఆయన నియోజకవర్గం వరకే పరిమితం అయ్యారు. ఇటీవల అనారోగ్యం కూడా ఆయన్ను జిల్లా రాజకీయాల్లో చురుగ్గా లేకుండా చేస్తుంది. ఇక గోరంట్ల వంటి సీనియర్ నేతతో సమానమైన నాయకుడు తూర్పులో మరొకరు లేకపోవడం కూడా ఈ వ్యవహారంలో తలదూర్చే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. ఒక్క నిమ్మకాయల చినరాజప్ప మాత్రమే జిల్లాలో ఏమి జరిగినా చంద్రబాబు దూతగా అక్కడ ప్రత్యక్షం అవుతూ పార్టీని గాడిన పెట్టేందుకు నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుస్సా కు ప్రధాన కారణమైన మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం తాజా పరిణామాలపై మౌనం దాల్చింది. అధినేతే అన్ని చూసుకుంటారు అనే ధీమాలో ఆ వర్గం వేచి చూస్తుంది. అదీగాక ఇటీవల పార్టీ పదవుల పందేరంలో ఆదిరెడ్డి కుటుంబం వెంట ఉన్న వారికి పదవులు బాగానే దక్కాయి. దాంతో గోరంట్ల వేడి మీద ఉన్నప్పుడు గొంతు పెంచితే మంచిది కాదని అధిష్టానం నుంచి అందిన సమాచారంతో ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియా ముందు ఈ అంశాలపై చర్చించేందుకు ఆసక్తి చూపడం లేదు.

Related Posts