YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యదేఛ్చ‌గా ఫార్మాలిన్ చేప‌

యదేఛ్చ‌గా ఫార్మాలిన్ చేప‌

మ‌హ‌బూబ్ న‌గ‌ర్, సెప్టెంబ‌ర్ 3, 
మార్కెట్‌లో అమ్ముతున్న చేపల్లో క్యాన్సర్‌ కారక, విషపూరిత ఫార్మాలిన్‌ రసాయనం ఆనవాళ్లు ఉన్నాయనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి సిద్దిపేట జిల్లాకు దిగుమతి అవుతున్న చేపల్లో ఫార్మాలిన్‌ ఉన్నట్టు పలువురు ఆందోళన చెందుతున్నారు. సరైన వర్షాలు లేక జిల్లాలోని చెరువు కుంటల్లో నీళ్లు లేవు. దీంతో తాజా చేపలు ఎక్కడా దొరకడంలేదు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, చేర్యాలలో చేపల మార్కెట్లు ఉండగా, దుబ్బాకలో నిర్మాణంలో ఉంది. హుస్నాబాద్‌లో స్థలం లేక మార్కెట్‌ను నిర్మించడంలేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో దుబ్బాక, హుస్నాబాద్‌ ప్రాంతాల్లో రోడ్లపైనే చేపలు పెట్టుకొని అమ్ముతున్నారు. జిల్లాలో అమ్ముతున్న చేపలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి చేపలు చాలా రోజుల వరకు తాజాగా ఉండేందుకు ఫార్మాలిన్‌ వాడుతున్నారని పలువురు అనుమానిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎగుమతి అయిన చేపల్లో ఫార్మాలిన్‌ ఉన్నట్టు తేలడంతో అస్సాం ప్రభుత్వం ఆ చేపలపై నిషేధం విధించింది. దీంతో ఇక్కడి చేపల్లో కూడా ఫార్మాలిన్‌ ఉండవచ్చేమోననే పలువురి ఆందోళనకు బలం చేకూరుతోంది. ఈ పరిణామాలతో చేపలు తినాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఫార్మాలిన్‌ కలగలిసిన చేపలను తింటే క్యాన్సర్‌ వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా మత్స్య శాఖ అధికారులు గానీ, ఆహారభద్రతా అధికారులుగానీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.చేపల్లో ఫార్మాలిన్‌ ఉన్నట్టు ఎలా గుర్తిస్తున్నారు?సాధారణంగా ఫార్మాలిన్‌ కలిపిన చేపల వాసనలో తేడా కనిపిస్తుందని పలువురు చెబుతున్నారు. ఆ చేపలను చేతితో తాకినప్పుడు కాస్త గరుకుగా ఉంటే ఫార్మాలిన్‌ కలిపినట్టు ఒక అంచనాకు రావచ్చని, అయితే కచ్చితంగా చెప్పలేమని చేపలను కొని, ఫార్మాలిన్‌ ఉన్నట్టు అనుమానించిన ఒకరు 'నవతెలంగాణ'కు తెలిపారు. ల్యాబ్‌లో పరీక్షిస్తే కచ్చితంగా ఏదో రసాయనం కలిపినట్టు తేలుతుందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆయన నిక్కచ్చిగా చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం తగదని ఆవేదన చెందారు. చేపల్లో ఫార్మాలిన్‌ ఆనవాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న 'సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ' పరిశోధకులు ఓ కిట్‌ తయారు చేశారు. చేపకు ఫార్మాలిన్‌ రసాయనం పూశారా.. లేదా అన్నది ఆ కిట్‌ సాయంతో 5 నిమిషాల్లోనే గుర్తించవచ్చని ముంబయిలో ఉంటున్న తెలంగాణ వాసి ఒకరు తెలిపారు. ఆ కిట్‌లోని లిట్మస్‌ పేపర్‌ ముక్కతో చేపను రుద్దాలని, తర్వాత ఆ చేప మీద అదే కిట్‌లో ఉండే రసాయనం(కెమికల్‌) చుక్కలు వేయాలని, అప్పుడు ఫార్మాలిన్‌ ఉన్న చేప ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుందని ఆయన వివరించారు. అయితే ఈ కిట్‌ను 2017 డిసెంబర్‌లోనే కేంద్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ ఆవిష్కరించినా.. అది ఇంకా బహిరంగ మార్కెట్‌లోకి రాలేదు.అత్యంత ప్రమాదకర వాయువుల్లో వర్ణరహిత ఫార్మాల్డిహైడ్‌(జన2ఉ) ఒకటి. ఆ వాయువును నీటితో కలిపితే ద్రవరూపంలోకి మారుతుంది. ఆ ద్రావణాన్నే ఫార్మాలిన్‌ అంటారు. ఇందులో 37 నుంచి 40 శాతం ఫార్మాల్డిహైడ్‌ ఉంటుంది. మార్చురీల్లో శవాలు కుళ్లిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఎంబాల్మింగ్‌లో ఈ రసాయనం వినియోగిస్తారు. ఇది ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది. మ్యూజియంలలో కళేబరాలను నిల్వ చేసేందుకు కూడా వాడతారు. చైనాలో కూరగాయలు, పండ్లు, చేపలు తాజాగా ఉండేందుకు కొందరు వ్యాపారులు ఈ ప్రమాదకర రసాయనం చల్లుతున్నారన్న విషయం 2012లో బయటపడింది.ఫార్మాల్డిహైడ్‌కి, క్యాన్సర్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని 1987లో అమెరికా ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజేన్సీ(ఈపీఏ)కి చెందిన పరిశోధకులు గుర్తించారు. 2011లో దీన్ని క్యాన్సర్‌ కారకాల జాబితాలో చేర్చారు. శరీరంలోకి ఫార్మాలిన్‌ వెళ్తే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అస్థిర కర్బన సమ్మేళనాలతో ఫార్మాల్డిహైడ్‌ వాయువు ఏర్పడుతుంది. ఆ వాయువుతో ఏర్పడే ఫార్మాలిన్‌ రసాయనం చాలా ప్రమాదకరమైంది. దాన్ని లోపలికి పీల్చితే తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దాని ప్రభావం కాలేయంపై తీవ్రంగా ఉంటుంది. ఆస్తమా బాధితులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బ్లడ్‌ కేన్సర్‌, గాల్‌ బ్లాడర్‌ కేన్సర్‌కు దారి తీయవచ్చు. చర్మానికి తాకితే దురద పెడుతుంది. శ్వాస, జీర్ణాశయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాసన పీల్చితే ఆయాసం, దగ్గు, వాంతులు, తలనొప్పి వస్తాయి. మెదడులోనూ సమస్యలు వస్తాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేపలను పరీక్షించి, ప్రజల్లో ఉన్న ఫార్మాలిన్‌ బెడదను తొలగించాల్సిన అవసరముంది.

Related Posts