YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎదురుతిరుగుతున్న ఆర్టీసీ నిర్ణయం

ఎదురుతిరుగుతున్న ఆర్టీసీ నిర్ణయం

విజయవాడ, సెప్టెంబర్ 3, 
జగన్ యువ నాయకుడు. ఆయనలో దూకుడు పాలు ఎక్కువ. అందువల్ల ఆలోచించి చేశారా అన్న దాని కంటే మాట ఇచ్చాను చేశాను అన్నదే ఎక్కువగా ఉంటుంది. జగన్ అలా చేసిన ఒక పని వల్ల జనాలకు ఏమైనా మేలు జరిగిందా అన్నదే ఇక్కడ చర్చ. విషయానికి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాల‌ని కొన్నేళ్ళుగా ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చేస్తూ వచ్చారు. కానీ నాటి పాలకులు ఎవరూ వాటిని పట్టించుకోలేదు. ఉమ్మడి ఏపీలో ఎందరో సీఎం లుగా ఉన్నా కూడా ఈ డిమాండ్ ని మాత్రం పక్కనే పెట్టేవారు. ఇక చంద్రబాబు సైతం పట్టించుకోలేదు. కానీ విభజన ఏపీలో మాత్రం జగన్ ఇలా గద్దెనెక్కగానే అలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఆర్టీసీ అన్నది సేవా సంస్థ. వారు జనాలలో ఉండాల్సిన వారు. నేరుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారు. ఆర్టీసీ బస్సు బయట తిరిగి లాభాలు తెస్తేనే సంస్థ నడిచేది. నష్టాలు వస్తే ఆ కష్టాలు ఏంటో కార్మికులు నేరుగా రుచి చూసిన అనుభవాలు ఉన్నాయి. అందుకోసం వారు తమ బస్సులు ఎపుడూ జనాలతో కిటకిటలాడాలని, నాలుగు డబ్బులు సంస్థకు రావాలని తెగ ఆరాటపడేవారు. అలా వారు నాడు బాధ్యతగా విధులు నిర్వహించేవారు. అందువల్ల ఆర్టీసీ సంస్థ కూడా పూర్తిగా నష్టాల పాలు కాలేదు. కానీ ఇపుడు వారు సర్కార్ ఉద్యోగులు అయిపోయారు. సంస్థ నష్టాలతో పనిలేదు. దాంతో కార్మికుల తీరే మారిపోయింది అంటున్నారు జనాలు. ఇక ఇపుడు అసలైన బాధలు అన్నీ జనాలకే వచ్చి పడ్డాయి. ఇపుడు ఆర్టీసీ బస్సుల తీరు ఎలా ఉంది అంటే ఏదో చార్ట్ ప్రకారం ఇన్ని ట్రిప్పులు తిప్పామా లేదా అంటూ మొక్కుబడిగానే పోతున్నారు. బస్సులో జనాలు ఎక్కినా మానినా వారికి అసలు సంబంధం లేదు. బస్టాండ్ నుంచి రెండడుగుల దూరంలో ప్రయాణీకుడు ఉన్నా, బస్సు అపమన్నా కూడా ఆపకుండా ముందుకు పోతున్నారు. ఇదంతా వారికి వచ్చిన అతి భరోసాతోనే అంటున్నారు జనాలు. గతంలోనే బాగుండేది, ఆర్టీసీ వారికి తమ బతుకు భయం గుర్తుకువచ్చి జనాలను పట్టించుకునేవారు అని కూడా వాపోతున్నారు. దీని వల్ల ఖజనాకు రూపాయి రాకపోవడం వల్ల ప్రభుత్వం కూడా మరో వైపు నష్టపోతోంది అని కూడా అంటున్నారు.ఇక జగన్ అద్భుతమైన నిర్ణయమే తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చుకుని వారి ఉద్యమానికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. కానీ దీని మీద వామ‌పక్షాలు అయినా సంతోషించాయా. జగన్ చేసిన పని భేష్ అని ఎపుడైనా అన్నాయా అంటే లేనే లేదు. మరో వైపు చూస్తే వామపక్షాలు తెలుగుదేశంతోనే కలసి ఉంటున్నాయి. అదే విధంగా జగన్ సర్కార్ ని ప్రతీ దానికీ తూర్పారా పడుతూనే ఉన్నాయి. పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రం తెలంగాణాను తీసుకుంటే కార్మికులు ఎన్ని రోజులు ఆందోళన చేసినా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడానికి కేసీయార్ ససేమిరా అనేశారు. ఆయనకు తెలుసు. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని. అందుకే ఆయన సంస్థకు వేరే విధంగా సాయం అందిస్తాం తప్ప ప్రభుత్వంలో విలీనం లేదని చెప్పేశారు. మొత్తానికి జగన్ నిర్ణయం వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి ఉపయోగం లేదు, మరో వైపు ప్రయాణీకులకు కూడా ఏ విధంగానూ మేలు కలగలేదు అని రెండేళ్ల ఆచరణలో తేలిపోయింది. దాంతో ప్రజలే ఇది తప్పున్నర నిర్ణయం అని విమర్శిస్తున్నారు.

Related Posts