YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఓ కంప్యూటర్ ఆపరేటర్ అష్టకష్టాలు

ఓ కంప్యూటర్ ఆపరేటర్ అష్టకష్టాలు

 

‘హలో’ హీరోయిన్ వల్ల నరకం చూశా’

అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కల్యాణి వల్ల గురుగ్రామ్‌కు చెందిన ఓ కంప్యూటర్ ఆపరేటర్ అష్టకష్టాలు పడ్డాడు. అయితే ఆమె అతనికి ఏం ద్రోహం చేసిందోనని సందేహపడకండి. అతనికీ, ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ‘హలో’ సినిమాలో కల్యాణి వాడిన ఫోన్ నంబర్ అతనిని చిక్కుల్లోకి నెట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... గురుగ్రామ్‌కు చెందిన వికాస్ ప్రజాపతి కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 22 తర్వాత నుంచి అతనికి ఊహించని కష్టమొచ్చింది. ‘‘హాయ్ మనం మాట్లాడుకుందామా? నేను మీ ఫ్యాన్‌ని.. ఎలా ఉన్నారు?’’ అని పదేపదే వికాస్‌ నంబర్‌కు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అతని గొంతు వినగానే ఫోన్ కట్ చేస్తున్నారు. ఎవరు ఫోన్ చేస్తున్నారో.. ఎందుకు ఫోన్ చేస్తున్నారో అర్థం కాక తలపట్టుకోవడం వికాస్ వంతైంది.

రోజురోజుకూ ఫోన్ కాల్స్ బెడద మరింత పెరిగింది. ఫోన్ కాల్స్ ఎంతలా వస్తున్నాయంటే.. అతని యజమాని కూడా విసుక్కునేంతలా. ఆఫీస్‌లోనే కాదు అతనికి ఇంట్లో కూడా ప్రశాంతత కరువైంది. ఈ ఫోన్‌కాల్స్ దెబ్బకి భార్యతో కొన్ని వారాలుగా మాట్లాడటం కూడా మానేశాడు. ఫోన్ స్విచ్ఛాప్ చేద్దామంటే.. తనవాళ్లు చేస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన. ఇక లాభం లేదనుకున్నాడు. ఓ హీరోయిన్‌ నంబర్ అనుకుని తనకు ఫోన్ చేస్తున్నారని మొత్తానికి వికాస్‌కు అర్థమైంది. గూగుల్‌లో ఆ హీరోయిన్‌కు, ఫోన్ నంబర్‌కు ఉన్న సంబంధమేంటో సెర్చ్ చేశాడు. సినిమా స్టోరీ మొత్తం తన 100నోటుపై రాసి ఉన్న నంబర్ చుట్టూనే తిరుగుతుందని, ఆ నోటుపై ఉన్న నంబర్ తనదేనని తెలుసుకున్నాడు.

హీరోయిన్ చాలా అందంగా ఉంటుందని.. కానీ తన వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదని ప్రజాపతి వాపోయాడు. నంబర్‌ను సినిమాలో వాడటం వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తానెంతో మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదేళ్లుగా ఈ నంబర్‌ను వాడుతున్నానని, తన సన్నిహితులందరి దగ్గర ఈ నంబరే ఉందని.. అందుకే మార్చలేదని వికాస్ చెప్పాడు. ఓ న్యాయవాదిని సంప్రదించిన వికాస్ చిత్ర నిర్మాతలకు జనవరి 19న లీగల్ నోటీసులు పంపాడు. 50లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఆ నోటీసులో డిమాండ్ చేశాడు. చిత్ర నిర్మాతలు కూడా ఈ వివాదంపై స్పందించారు. ఆ మొబైల్ నంబర్‌ను సినిమాలో వినియోగించుకునేందుకు టెలికాం కంపెనీ అనుమతి తీసుకున్నామని చెబుతున్నారు. అయితే తమ నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని సదరు టెలికాం కంపెనీ చెప్పడం కొసమెరుపు. మొత్తం మీద అఖిల్ ‘హలో’ సినిమాలో ఫోన్ నంబర్‌‌కు కాల్ చేసి హీరోయిన్‌ను కలిస్తే... అదే నంబర్‌కు ఫోన్ చేసిన కల్యాణి ఫ్యాన్స్ మాత్రం వికాస్‌ను క్షోభను మిగిల్చారు.

Related Posts