YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉద్యోగ సంఘాలంటే రెండేనా

ఉద్యోగ సంఘాలంటే  రెండేనా

హైదరాబాద్, డిసెంబర్ 11,
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యోగ సంఘాలు చురుకుగా పనిచేశాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా ఉన్నాయి. కానీ.. ఆ రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై.. మిగతావాళ్లు కత్తులు నూరుతున్నారట. ఉద్యమంలో పాల్గొన్నవారిపై ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్నలా తమ పరిస్థితి మారిందని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొన్ని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం అన్ని సంఘాలను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసలు రాష్ట్రంలో ఇన్ని సంఘాలు అవసరమా అని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలలో ఒకటి రెండింటికి మాత్రమే ప్రాధాన్యం దక్కుతోంది.పీఆర్సీపై వివిధ ఉద్యోగ సంఘాలను పిలిచి అభిప్రాయాలు తీసుకున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అప్పుడే కొన్ని సంఘాలను పిలవకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సీఎస్‌తో సమావేశాలకు వెళ్లిన మరికొన్ని సంఘాలు వ్యతిరేకంగా మాట్లాడాయి. దీంతో ఉద్యోగ సంఘాల తీరుపై నాడు చర్చ జరిగింది. ఉద్యోగ అంశాలపై టీజీవో, టీఎన్జీవో నేతలను.. టీచర్ల సమస్యలపై PRTU నేతలను మాత్రమే పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ వైఖరిపై ఇతర సంఘాలు మండిపడుతున్నాయి.తాజాగా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఉద్యోగ విభజన గైడ్‌లైన్స్‌ ఫైనల్‌ చేసే విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవలం రెండు ఉద్యోగ సంఘాలనే పిలిచి చర్చించారు. ఉద్యోగ కేటాయింపు సందర్భంగా ఏదైనా సమస్యలు వస్తే టీజీవో, టీఎన్జీవోలతోపాటు గుర్తింపు పొందిన యూనియన్లతో చర్చించాలని గైడ్‌లైన్స్‌లో ప్రస్తావించింది ప్రభుత్వం. ఈ వైఖరి మిగతా సంఘాలకు పుండుమీద కారం చల్లినట్టు అయిందట. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రెండు సంఘాలే పాల్గొన్నాయా? అని ప్రశ్నిస్తున్నాయి. పైగా తెలంగాణ వచ్చాక ఒక్క సంఘానికి కూడా గుర్తింపు ఇవ్వలేదని.. అసలు ఆ ప్రక్రియే చేపట్టకుండా గుర్తింపు సంఘాలు అని ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు ఉన్న సంఘాలకు తెలంగాణలో కూడా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌ పెండింగ్‌లో ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇదే అంశంపై ఒక సంఘం.. సీఎస్‌కు లేఖ కూడా రాసింది.ఉద్యోగ సంఘాలపట్ల వివక్ష వెనక కుట్ర ఉండొచ్చన్నది కొందరి అనుమానం. రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇస్తే.. మిగతా యూనియన్లు క్రమంగా ఉనికి కోల్పోయి.. నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపైనే ఆయా సంఘాల మధ్య గ్యాప్‌ వస్తున్నట్టు సమాచారం. ఒకరినొకరు సందేహించుకునే పరిస్థితి వస్తోందట.

Related Posts