YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజాస్వామ్య దేశంలో 14 సంవత్సరాలకు కూడా దక్కని న్యాయం

ప్రజాస్వామ్య దేశంలో 14 సంవత్సరాలకు కూడా దక్కని న్యాయం

విజయవాడ డిసెంబర్ 27
మా కూతురు అయేషా మీరాను హాస్టల్ లో అత్యాచారం చేసి, దారుణంగా చంపి, హాస్టల్ బాత్రూంలో కట్టిపడేసిన కేసుకు అతిగతిలేక నేటికి 14 సంవత్సరాలు అయింది. హాస్టల్ నిర్వహకులు, పోలీసులు, కుమ్మకై సాక్ష్యాలను తారుమారు చేసేశారు. ఫలింగా అసలు హంతకులు  ఈ రోజుకు చట్టం నుండి తప్పించుకొని తిరుగుతున్నారు. న్యాయం కోసం 14 సంవత్సరాల  నుంచి అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్న మాకు ఇంకా వనవాసం పూర్తి కాలేదు. విచారణ సంస్థల మీద, వ్యవస్థల మీద నమ్మకం పోయినా హక్కుల కోసం నిబద్దతో పరితపిస్తున్న మీరు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నందున మీకు ఈ బహిరంగ లేఖ వ్రాస్తున్నాము. మేము ఈ లేఖ 'ద్వారా మాకు న్యాయం చేయమని అడగటం లేదు. బాధితులు భయపడకుండా, డబ్బుకు లొంగకుండా నిర్భయంగా నిలబడితే ఎన్ని సంవత్సరాల కైనా ఈ పవిత్ర భారత దేశంలో న్యాయం జరుగుతుంది అని మీరు అబలలకు, అభాగ్యులకు ఉత్తేజకరమైన సందేశం ఇచ్చి మమ్మల్ని ఒక నమూనాగా చూపిస్తారని చిన్న ఆశతో ఈ లేఖ మీకు పంపిస్తున్నాను.*
డిసెంబర్ 27, 2007 అర్ధ రాత్రి విజయవాడలో 19 సంవత్సరాల బి.ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మరణం ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం. 2012 డిసెంబర్ 16వ తారీఖున డిల్లీలో అర్ధ రాత్రి బస్సులో జరిగిన నిర్భయ సంఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. 2019 హైదరాబాద్ లో అర్ధరాత్రి హైదరాబాద్ హై వే మీద జరిగిన దిశ సంఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది. నిర్భయ సంఘటన పార్లమెంటులో ఆడ పిల్లలపై లైంగిక దాడులకు, అత్యాచారాల నివారణకు చర్చకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ వర్మ సుప్రసిద్ధ న్యాయ కోవీదులతో, లాకమిషన్ సభ్యులతో, ప్రొఫెస్సర్లతో, మహిళా సంఘాలతో చర్చించి, ఆహ్వానించి, ప్రస్తుత మహిళల హింసపై అత్యాచార నివారణకు ఉన్న చట్టాలను క్రోడీకరించి ఒక సమగ్ర రిపోర్ట్ ప్రభుత్వం ముందు ఉంచింది. నిర్భయ హంతకులపై జిల్లా కోర్టు సమగ్ర కేసు విచారణ సమగ్రంగా త్వరిత గతిన చేసి, ఉరి శిక్ష విధించింది. పై కోర్టులు కూడా మరణ శిక్షను సమర్ధించినాయి. దిశ హంతకులను కాల్చి చంపామని మా రాష్ట్రంలో సత్వర న్యాయం చేశామని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంది. పార్లమెంటులో చాలా మంది సభ్యులు ఆవేశంగా ఎన్ కౌంటర్ చేయడమే ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగకుండా నివారించడానికి పరిష్కారం అని చెప్పారు. పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంకొద్దిగా తీవ్రంగా స్పందించి రాత్రికి రాత్రి దిశ చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇటువంటి సంఘటనలు జరిగితే ఎంతటి వారికైనా 21 రోజులలో న్యాయ స్థానంలో కఠిన శిక్షలు పడేటట్లు చట్టంలో పొందు పరిచామని చెప్పారు.*
ఇప్పుడు మా ప్రశ్న. నిర్భయకు, దిశకు ఏదో విధంగా న్యాయం జరిగితే ఆయేషాకు ఎందుకు న్యాయం జరగడం లేదు. తల్లి తండ్రులం కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతా న్యాయం కోసం తిరిగాము. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా మీడియా వారు ఈ కేసులో జరుగుతున్న లోటు పాట్లు, దర్యాప్తు సంస్థల వైఫల్యాలు, కోర్టు తీర్పులపై నిరంతరం చర్చ పెడుతూ, ప్రశ్నలు సంధిస్తూ 'ఆయేషా' ను ఈ రోజుకు సజీవంగానే ఉంచారు. కానీ అసలు హంతకులు కూడా స్వేచ్చగానే తిరుగుతున్నారు. జరిగిన సంఘటనకు నష్ట పరిహారం ఇస్తామని అసెంబ్లీలో అన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన వారిని కాపాడటానికి పోలీసు యంత్రాంగం అమాయకులను కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాము. చివరగా పేద దళిత కుటుంబానికి చెందిన సత్యంబాబుపై కేసును బనాయిస్తే, కోర్టులో హంతకుల పేర్లు సాక్ష్యంలో చెప్పి సత్యంబాబు నిర్దోషి అని చెప్పాము. న్యాయస్థానం అదే దృవీకరించినది.*
హైకోర్టు ది.31.03.2017న ఇచ్చిన తీర్పులో అసలు నేరస్తులను కాపాడటానికి సత్యంబాబును బలి పశువును చేశారని, నేరం చేసి సాక్ష్యాలను తారుమారు చేసిన సంబంధిత పోలీసు ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని హోం డిపార్ట్ మెంటును కోర్టు ఆదేశించినా నిమ్మకు నీరేత్తినట్లు ప్రభుత్వం పట్టకుండా ఉండిపోయింది. ఈ సంఘటన పై తీవ్రంగా స్పందించిన మహిళా సంఘాల నాయకులు, మేము కలిసి తిరిగి విచారణ చేయాలని అడగగా హై కోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) ను ఏర్పాటు చేయమని తీర్పు ఇచ్చింది. మళ్ళీ మమ్మల్ని విచారించడం మొదలుపెట్టారు. సంవత్సరం తరువాత మేము ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను కనుక్కోలేము, హాస్టల్ వార్డెన్, ఆయేషా మీరా రూమ్ మేటకు నార్కో ఎనాలిసిస్ పరీక్ష చేస్తే వాళ్ళ నిజం చెపితేనే మేము నేరస్తులను పట్టుకోగలమని చెప్పారు. SIT దర్యాప్తు పరిశీలించిన హైకోర్టు వారు ఆ దర్యాప్తు పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2018వ సంవత్సరములో సి.బి.ఐ దర్యాప్తుకు ఆదేశించారు. సి. బి.ఐ వారు మళ్ళీ మమ్మల్ని విచారించడం మొదలు పెట్టారు. సంఘటన స్థలంలో, ఫోరెన్సిక్ లేలో, సాక్షాలను ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేసి కోర్టు లోని రికార్డులను కాల్చి పారేశారు. కావున ఆయేషా సమాధిని తవ్వి మళ్ళీ డి.ఎన్.ఎ.కు పంపిస్తే నిజాలు వెల్లడవుతాయి అని అన్నారు. మత పెద్దలు అది మతాచారానికి విరుద్ధమని అడ్డు పడినా న్యాయం కోసం అంగీకరించాం. పరీక్ష కోసం సమాధి నుంచి తీసిన నమూనాలను వెంటనే తిరిగి ఇస్తామని సి.బి.ఐ అధికారులు చెప్పి సంవత్సరం అయింది. రిపోర్ట్ గురించి అడిగితే సమాధానం చెప్పారు. మా పాప అవశేషాలు ఇవ్వమంటే ఇవ్వరు. దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది అంటే సమాధానం చెప్పారు. ఇదీ సి.బి.ఐ వారి దర్యాప్తు.*
ఈ మధ్య ప్రధాన న్యాయమూర్తిగా దేశంలో అనేక కేసులలో సి.బి.ఐ దర్యాప్తు నత్తి నడక నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తే దానిని సమాధాన పరచుకోవడానికి హడావిడిగా క్రింద కోర్టులో మరలా హాస్టల్ వార్డెన్ కు, తోటి విద్యార్థినులకు నార్కో ఎనాల్సిస్ పరీక్ష జరిపి వాళ్ళు నోరు విప్పితేనే నిజాలు బయటకు వస్తాయని చెప్పి పిటిషన్ వేశారు. యధాతధంగా కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్క‌రించింది. సి.బి.ఐ విచారణ ముగిసి కధ మళ్ళీ మొదలుకొచ్చింది.*
ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు ప్రపంచంలో అత్యంత బలంగా ఉన్న ప్రజా స్వామ్య దేశంలో న్యాయ స్థానాల ఆదేశాలు అమలు కావడం లేదు. ఒక విద్యార్ధిని తాను చదువుకుంటున్న హాస్టల్ లో దారుణంగా చంపబడితే నేరస్తులు ఎవరో తెలిసి కూడా పట్టుకోలేని దర్యాప్తు సంస్థలు, నిస్సహాయంగా కళ్ళకు గంతలు కట్టుకొని ఆవేదన చెందుతున్న న్యాయ స్థానాలు వున్నాయి. ఈ ఆయేషా తల్లి తండ్రులమైన మేము ఇద్దరము ఉపాద్యాయులం. ఆడపిల్లకు బురఖా తొడిగి ఇంటిలో కూర్చో బెట్టకుండా చదువు, నాగరికత అని వూరు దాటించి డిసెంబర్ 26వ తారీఖున నా కూతురు ఆయేషాను సజీవంగా అప్పగిస్తే మరుసటి రోజుకు రక్తం మడుగులో ఉన్న నా కూతురు శవాన్ని మాకు అప్పగించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 14 సంవత్సరాలు వ్యవస్థల మీద నమ్మకంతో రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నాం. దోషులైన “వాళ్ళు స్వేచ్చగా తిరుగుతున్నారు”. మేము ఇంకా బిక్కు బిక్కుమని భయంగానే బ్రతుకుతున్నాము. నా రెండవ కూతురు న్యాయానికి తావులేని చోట ఉండనని వెళ్ళిపోయింది. ఇంకా పోరాడే శక్తి లేదు. ధుఖం ఆపుకొనే పరిస్థితి లేదు. మేము చివరగా కోరుకొనేది ఈ వ్యవస్థలో మీకు న్యాయం జరుగదు అని మీరు ఆమోద ముద్ర వేస్తే న్యాయం కోసం పిచ్చి వాళ్ళుగా ఎదురు చూడకుండా మూగ జీవాలుగా మిగిలిపోతాము.*

Related Posts