YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అందని ద్రాక్షగా సంచార కులాల అభివృద్ధి

అందని ద్రాక్షగా సంచార కులాల అభివృద్ధి

హైదరాబాద్, మార్చి 8,
సుదీర్ఘ పోరాటాల తరువాత గుర్తింపు పొందిన సంచార కులాల ఆర్థికాభివృద్ధి అందని ద్రాక్షగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినప్పటికీ.. విద్య, ఉపాధి, ఆర్థిక సంక్షేమంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా గుర్తింపు వచ్చినా అభివృద్ధిలో అడుగుముందుకు పడటం లేదు. ఈసారి బడ్జెట్‌లో సంచార కులాలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని కోరుతున్నారు. అప్పుడే ఇతర కులాల మాదిరిగా అన్ని రంగాల్లో ముందడుగు పడుతుందన్నది వారి ఆశ. హైదరాబాద్‌ నగరంలో ఇతర కులాలకు కట్టిస్తున్నట్టుగా 'ఆత్మగౌరవ' భవనాల వలే తమకూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం ఈ కులాలను డీనోటిఫైడ్‌ ట్రైబ్‌ జాబితాలో చేర్చి సంక్షేమ పథకాలకు అర్హులను చేయాలని కోరుతున్నారు.
దేశంలో గుర్తింపు లేక విద్య, ఉపాధి, ఆర్థిక సంక్షేమంతోపాటు సామాజిక న్యాయానికి దూరంగా ఉన్న 17 కులాలను బీసీ కమిషన్‌ ద్వారా సర్వే జరిపి 2020, సెప్టెంబర్‌ 9వ తేదీన ప్రత్యేక జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇందులో 13 సంచార కులాలు ఉన్నాయి. ఓడ్‌, అద్దపువారు, బాగోతుల, బైలు కమ్మర, ఏనూటీ, గంజి కూటి వారు, కాకి పడగల, పటంవారు, సన్నాయిల, శ్రీక్షత్రియ రామజోగి, తెర చీరాల, తోలుబొమ్మలాట వారిని బిసి-ఎ జాబితాలో సర్కారు చేర్చింది. మిగిలిన గౌళీ, అహిర్‌ యాదవ్‌, కుల్ల కడిగి, సారోళ్లు కులాలను బీసీ-డి జాబితాలో చేర్చింది. సర్కారు గుర్తించినప్పటికీ.. ఇన్నేండ్లుగా వెనుకబడిన ఈ కులాల అభివృద్ధిపై దృష్టిసారించలేదు. పైగా విద్య, ఉపాధి సంక్షేమ పథకాలు ఈ కులాల దరి చేరడం లేదు. దీంతో ఈ కులాలకు చెందిన యువత తీవ్ర నిరాశ, నిస్పృహాలో ఉన్నారు. అల్ప సంఖ్యాకులైన ఈ కులాలు ఇతర సామాజిక తరగతులతో పోటీ పడలేని పరిస్థితి ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఈ కులాల ప్రతినిధులు కోరుతున్నారు. రానున్న బడ్జెట్‌లో ఈ సంచార కులాలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని విన్నవిస్తున్నారు. ఈ సంచార కులాలను ఎంబీసీ, ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నారు. సంచార కులాల అభివృద్ధికి కేంద్ర సర్కారు ఇటీవల 'సీడ్‌' పథకాన్ని ఆవిష్కరించింది. విద్య, ఆరోగ్యం, ఉపాధి అలాగే నివాసం లాంటి సంక్షేమ పథకాల కల్పన ముఖ్య ఉద్దేశంతో సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28న ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి ఈ కులాలను డి నోటిఫైడ్‌ ట్రైబ్‌ జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను చేయాలని వేడుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు దశాబ్దాల కలను నెరవేర్చి సమానత్వాన్ని అందించింది. ఈ సంచార కులాలకు సమానత్వంతో పాటు విద్య, ఉపాధి, ఆర్థిక అభివద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం డీఎన్‌టీ జాబితాను ప్రకటించి అందులో ఈ కులాలను చేర్చాలని కోరుతున్నారు

Related Posts