YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఇంట అసమ్మతి సెగలు

జగన్ ఇంట అసమ్మతి సెగలు

విజయవాడ, మే 16
ఫ్యామిలీలో   అసమ్మతి సెగలు  ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి.  తాజాగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందులలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కుటుంబంలో జగన్ దాదాపు ఒంటరి అయిపోయారని అంటున్నారు.  ఇటీవల సీఎం జగన్ సమీప బంధువు.. పులివెందుల నియోజకవర్గం  చక్రాయపేట మండల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ కొండరెడ్డిని పోలీసు అరెస్ట్ చేశారు. ఇది వైఎస్ కుటుంబంలో   ప్రకంపనలు సృష్టిస్తోందని సమాచారం. రహదారి పనులు చేయాలంటే అయిదు కోట్ల రూపాయిలు ఇవ్వాలంటూ..  కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్ కొండా రెడ్డి తాజాగా బెయిల్‌పై విడుదలైయ్యారు. అయితే ఆయన్ని జిల్లా నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైఎస్ ఫ్యామిలీలోని ఓ వర్గం.. ఆగ్రహంతో రగిలిపోతోందట. పార్టీ అధికారంలో ఉండి కూడా కుటుంబ సభ్యులను అరెస్టు ఆపలేని దుస్థితి దాపురించిందని గరం గరం అయిపోతోందట.  ఫ్యామిలీ ఆగ్రహం తాడేపల్లి ఫ్యాలెస్‌ను సైతం తాకడంతో, జగన్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారట.  ఆ క్రమంలోనే బెయిల్‌పై రాయచోటి జైలు నుంచి వైయస్ కొండారెడ్డి విడుదలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గంటకే ఆయనపై బహిష్కరణ వేటు పడింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సమీప బంధువు వైఎస్ కొండారెడ్డిపై   జిల్లా ఎస్పీ ఇంత తీవ్ర చర్య ఎందుకు తీసుకున్నారనే ఓ చర్చ  ఉమ్మడి కడప జిల్లాలో హాట్ హాట్‌గా నడుస్తోంది. అయితే వైఎస్ కొండా రెడ్డి అరెస్ట్ కావడంతో.. ఆయన ఫ్యామిలీ  జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే   కొండారెడ్డిని జైలు నుంచి బెయిల్‌పై విడుదల చేయించి.. జిల్లా నుంచి బహిష్కించేలా  సర్కారులోని పెద్దలు స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ కొండారెడ్డి జైలులో ఉంటే.. ఆయన ఫ్యామిలి నుంచి విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ఆ క్రమంలో కొండారెడ్డిని జైలు నుంచి బెయిల్‌పై విడుదల చేస్తే.. ఆయనపై ఫిర్యాదు చేసిన పెద్దలు మళ్లీ తనకు తలంటే.. అక్షింతలు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని..  ఆ క్రమంలోనే కర్ర  విరగా కూడదు, పాము చావా కూడదు అన్న టైప్‌లో తాడేపల్లి ఫ్యాలెస్‌  పెద్దలు చక్రం తిప్పారని తెలుస్తోంది.మరోవైపు ఇప్పటికే  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయనకు  తల్లి   విజయమ్మ,   సోదరి  షర్మిలతో గ్యాప్ పెరిగింది. ఈ నేపథ్యంలో వారిద్దరు.. తాడేపల్లి ప్యాలెస్ వీడి.. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ చేరుకున్నారు. అంతేకాదు   షర్మిల.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి..  తెలంగాణలో చురుకుగా పని చేస్తున్నారు. దీంతో  జగన్‌కు వైయస్ విజయమ్మ, షర్మిలలు దూరమైయ్యారనే టాక్ అయితే గతం నుంచే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.. అవుతోంది కూడా. ఇంకోవైపు సోదరుడు   జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా...తన తండ్రి హత్య కేసు ఏ విధంగా సాగుతుంతో వివేకా కుమార్తె  డాక్టర్ సునీతతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు బాగా అర్థమైందీ. దీంతో వారు తన తండ్రి హత్య కేసు సీబీఐకి అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ  హైకోర్టు మెట్లెక్కి సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసు సీబీఐ చేపట్టడం.. ఆ తర్వాత విచారణలో  వివేకా  మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులతోపాటు ఈ హత్యకు ఫిక్స్ చేసిన సుపారీ ఎంతో  సైతం   వెల్లడించారు. దీంతో వివేకా హత్య జరిగిన తీరు.. అందుకు దారి తీసిన పరిస్థితులు .. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చూసి ప్రపంచంలోని తెలుగువారంతా నివ్వెరపోయారు. అలాంటి పరిస్థితుల్లో వైయస్ జగన్ ఫ్యామిలీకి  సునీత కుటుంబం కూడా బాగా దూరంగా జరిగింది. ఇక ఈ ఏడాది  వివేకా వర్థంతి సందర్బంగా ఆయన సమాధిని ఆమె కుటుంబం మాత్రమే సందర్శించి నివాళులర్పించింది. మిగతా   ఫ్యామిలీ ఎక్కడ అనే చర్చ కూడా సోషల్ మీడియా సాక్షిగా నడించింది. అదీకాక..   జగన్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో వైయస్ ఫ్యామిలీలోని చాలా మంది సభ్యులు.. ప్యాన్ పార్టీ అధినేత ఫ్యామిలీకి దూరం అయ్యారు.  ఇలా ప్రజల నుంచీ, పార్టీలోనూ, కుటుంబంలోనూ రోజు రోజుకూ పెరుగుతున్న అసమ్మతితో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో జగన్ ఉన్నారని ఆయన సన్నిహితులే ఆఫ్ ది రికార్డ్ అంటూ   మిత్రులతో చెబుతున్నారు

Related Posts