YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వాచ్ అండ్ వార్డ్ పధకంతో రైతులకు ఆదాయం

వాచ్ అండ్ వార్డ్ పధకంతో రైతులకు ఆదాయం

మెదక్, జూన్ 28,
రైతులతో పాటు ఇతరులకూ హరితహారం మొక్కలు కాసులు కురిపిస్తున్నాయి. మొక్కలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వాచ్‌ అండ్‌ వార్డు కింద రైతులకు లబ్ధి చేకూర్చేందుకు, పరోక్షంగా ఆదాయాన్ని అందించే ప్రక్రియను గత ఏడాది చేపట్టింది. నిబంధనల మేరకు నాటిన మొక్కల్లో 60 శాతం సంరక్షించిన వారికి ఆయా మొక్కను బట్టి రూ.1 నుంచి రూ.15  వరకు ప్రోత్సాహకం అందిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం కింద జిల్లా వ్యాప్తంగా ప్రతి విడతలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను కాపాడే ప్రయత్నంతో పాటు సంబంధిత మొక్కను 60 శాతం బతికించే రైతులకు, ఇతర వ్యక్తులకు పరోక్షంగా ఆదాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లా యంత్రాంగం వాచ్‌ అండ్‌ వార్డు పథకం కింద ప్రతి మొక్కను నిబంధనల మేరకు బతికించినందుకు ప్రోత్సహకంగా కొంత నగదు ప్రకటించింది. ఈక్రమంలోనే యూకలిప్టస్‌(నీలగిరి) చెట్టుకు రూ.1, ఈతతో పాటు ఇతరత్ర మొక్కలకు రూ.5, గ్రామ పొలిమేరుల్లో ఇరువైపులా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రూ.12.34, ఉద్యాన మొక్కలకు రూ.15 చొప్పున ప్రోత్సాహకాన్ని కేటాయించింది.ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల్లో సంబంధిత మొక్కలను 60 శాతం వరకు నాటిన 75,43,946 మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించింది. ఈ లెక్కన ఆయా మొక్కలను కాపాడిన వారికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.3,44,20,291 కేటాయించింది. మొక్కలతో అత్యధిక ఆదాయం పొందుతున్న మండలాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఇదే స్ఫూర్తిని మిగతా మండలాలు తీసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోని గ్రామాలకు ప్రభుత్వం వాచ్‌ అండ్‌ వార్డు కింద ప్రోత్సాహక నిధులు కేటాయించింది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి సంబంధిత గ్రామీణ శాఖ రికార్డుల ప్రకారం 60 శాతం బతికిన మొక్కలకు ఇప్పటి వరకు సుమారు రూ.3.44 కోట్లు చెల్లించినట్టు సమాచారం.ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా వాచ్‌ అండ్‌ వార్డు కింద 75.43 లక్షల మొక్కలను గుర్తించిన అధికారులు.. వాటిని కేటగిరి ఆధారంగా రైతులకు, సంబంధిత వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాన్ని అందించారు. సంబంధిత శాఖ రికార్డులను పరిశీలిస్తే చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట, దౌల్తాబాద్, దుబ్బాక, గజ్వేల్, ములుగు, కొండపాక, చేర్యాల మండలాల్లో అత్యధికంగా మొక్కలను పరిరక్షించిన వారు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందుకున్నారు.ముఖ్యంగా సిద్దిపేట మండల పరిధిలో 4,80,785, ములుగు మండలంలో 6,03,044, దౌల్తాబాద్‌లో లక్ష, చేర్యాలలో 50 వేల మొక్కలను వాచ్‌ అండ్‌ వార్డు పథకం కింద గుర్తించడంతో పాటు ప్రోత్సాహకం అందించారు. ఇదిలా ఉండగా, హరితహారం కింద గ్రామాల్లో మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన వాచ్‌ అండ్‌ వార్డు పథకం సత్ఫలితాలు ఇస్తోంది. పెంచిన మొక్కల్లో 60 శాతం సంరక్షించిన వారికి రెండేళ్ల పాటు ఈ సహాయాన్ని అందిస్తోంది.  

Related Posts