YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ బలోపేతం దిశగా అడగులు

బీజేపీ బలోపేతం దిశగా అడగులు

హైదరాబాద్, జూన్ 30,
తెలంగాణలో బీజేపీ దూకుడును మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో తెరాసతో తెగే వరకూ లాగే పరిస్థితి తెచ్చుకోవద్దనీ ఆలోచిస్తోంది.వచ్చే నెల మొదటి వారంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల అనంతరం  తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా అడగులు వేయనున్నది. రాష్ట్రంలోని ప్రతి మూడు నియోజకవర్గాలకూ ఒక కేంద్ర మంత్రిని ఇన్ చార్జిగా నియమించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.  అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకూ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసి ఇప్పటి నుంచే  ఆయా నియోజకవర్గాలలో వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ విజయావకాశాలను పెంచుకోవాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది.  అదే సమయంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే.. ఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు అయ్యే పరిస్థితి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి విస్పష్టమైన సూచన చేసినట్లు కమలం వర్గాలే చెబుతున్నాయి.కర్రా విరగ వద్దు.. పామూ చావవద్దు అన్న సామెతను కొద్దిగా  మార్చుకుని టీఆర్ఎస్ గెలవ కూడదు.. అలాగని ఆ  పార్టీతో పూర్తిగా సంబంధాలు తెగకూడదు అన్న చందంగా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పూ, నిప్పులా పరస్పర విమర్శలతో చెలరేగిపోతున్నా..టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ప్రధానినే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నా..బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పెద్దగా స్పందన కానరావడం లేదు. ఇటీవల టీఆర్ఎస్ విషయంలో బీజేపీ వైఖరి ఒకింత మారిందనడానికి ఇవే సంకేతాలుగా చెప్పవచ్చు. అసలు తొలి నుంచీ కూడా టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య బంధం ఏదో ఉందన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూనే ఉన్నా... హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టగలమన్న నమ్మకం కలగడంతో బీజేపీ దూకుడు పెంచింది. అదే సమయంలో అప్రమత్తమైన టీఆర్ఎస్ అధినేత జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు చేసిన యత్నాలు విఫలం కావడం, ఆ తరువాత తానే జాతీయ పార్టీ పెడతానంటూ ప్రకటించి, ఆ తరువాత మౌనంవహించారు.రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఆయన ఎన్డీయే అభ్యర్థికి కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలూ హాజరయ్యారు. కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గరౌతున్నారన్న వార్తలూ వినిపించాయి. దీంతో బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే.. టీఆర్ఎస్ ను పూర్తిగా దూరం చేసుకోవడం సరికాదన్న అభిప్రాయానికి రావడానికి ఇదే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతున్నా.. మోడీ సర్కార్ తెలంగాణకు చేసింది, ఇచ్చిందీ ఏమీ లేదంటూ తరచూ విమర్శలు గుప్పించే కేటీఆర్ తన హస్తిన పర్యటనల్లో మాత్రం కేంద్ర మంత్రులతో ములాఖత్ అయ్యి రాష్ట్రానికి కావలసిన నిధులు మంజూరు చేయాల్సిందిగా వినతులు ఇస్తున్నారు. కేంద్ర మంత్రులూ సానుకూలంగా స్పందిస్తున్నారు.అన్నిటికీ మించి.. ఖమ్మం జిల్లాలో  గత ఏప్రిల్ లో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో బీజేపీ స్పందించిన తీరుకు..ఇప్పుడు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అధీనంలోని భూములను టీఆర్ఎస్ సర్కార్ స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేసిన సందర్భంలో బీజేపీ వ్యవహరించిన తీరునూ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా మంత్రి పువ్వాడ ఒత్తడితో పోలీసులు తప్పుడు కేసులు బనాయించి, రౌడీ షీట్ తెరచి వేధించడం వల్లే చనిపోయాడంటూ బీజేపీ ఆందోళనలు చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా సాయిగణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.అదే ఈటల విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కాదు కదా రాష్ట్ర నాయకుల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనిని బట్టే రెండు నెలల కిందటికీ, ఇప్పటికీ బీజేపీ వైఖరిలో, తీరులో మార్పు వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచాలంటే.. టీఆర్ఎస్ తో సంబంధాలు పూర్తిగా చెడకుండా చూసుకోవాలని బీజేపీ భావిస్తున్నది.   అదే సమయంలో రాష్ట్రంలో అధికార అందలం అందుకోవడానికి, బలోపేతం కావడానికి ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలని గట్టి పట్టుదలతో ఉందని పరిశీలకులు అంటున్నారు.

Related Posts