YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ సీట్లపై కసరత్తు

ఎస్సీ, ఎస్టీ సీట్లపై కసరత్తు

హైదరాబాద్, సెప్టెంబర్ 20, 
తెలంగాణలో ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో మొత్తం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలలో 31 రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. ఇందులో 19 సీట్లు ఎస్సీలకు, 12 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ 16 ఎస్సీ సీట్లను, 6 ఎస్టీ సీట్లను కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి గెలిచిన ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో మొత్తం 18 ఎస్సీ సీట్లు, 10 ఎస్టీ సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి.అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ సీట్లను పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే దళితుల కోసం దళిత బంధును ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం త్వరలో గిరిజన బంధు పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తోంది. సెప్టెంబర్ 3న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో మరో 1500 కుటుంబాలకు దళితబంధు స్కీం అమలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. అటు బంజారాహిల్స్‌లో ఆదివాసీ భవన్, బంజారా భవన్‌లను కూడా ప్రారంభించారు. మరోవైపు ఎస్టీలకు నాలుగు శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూమిలేని ఎస్టీలకు గిరిజన బంధు, గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ నూతన సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెడతామని కేసీఆర్ ప్రకటించారు. మొత్తానికి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తుండటంతో ఆయా సామాజికవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.గత ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌, ఖమ్మం జిల్లాల్లోని సత్తుపల్లి, మధిర ఎస్సీ స్థానాలలో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఎస్టీ రిజర్వ్ స్థానాలైన వైరా, అశ్వారావుపేట, ఇల్లందు, భద్రాచలం, పినపాకలోనూ అధికార పార్టీ ఓటమి చవిచూసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా ములుగు సీటును కూడా కోల్పోయింది. అయితే నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వైరా ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లి, అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుతో పాటు ఇల్లందు, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, రేగాకాంతరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ములుగు, మధిర, భద్రాచలం వంటి రిజర్వుడ్ స్థానాల్లోనే టీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్య లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రత్యేకంగా వ్యూహ రచన చేస్తోంది.

Related Posts