YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం, సీఎస్, డీజీపీ... అందరూ కడపే

సీఎం, సీఎస్, డీజీపీ... అందరూ కడపే

కడప, డిసెంబర్ 1, 
కడప పేరు ఇప్పుడు ఏపీలో మార్మోగిపోతుంది. వెనకబడిన ప్రాంతంగా భావించే కడప ఇప్పుడు ఏపీలో అన్నింటా ముందుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పాలన మొత్తం కడప వారి చేతుల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేని పరిస్థితి కనపడుతుంది. పరిపాలనలో ముఖ్యులు ముగ్గురు కడప జిల్లాకు చెందిన వారే. ముగ్గురు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. గతంలో ఎన్నడూ ఇలా చోటు చేసుకోలేదు. నిర్ణయాధికారం, అమలు అంతా కడపకు చెందిన వారే కావడం గమనార్హం.. తాజాగా చీఫ్ సెక్రటరీ నియామకంతో ముగ్గురు కీలక వ్యక్తులు కడపకు చెందిన వారుగా భావించవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసిందే. ఆయన కడప జిల్లాకు చెందిన వారు. తొలి సారి ముఖ్యమంత్రి అయినా సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. యువకుడే అయినా ఆయన అనుభవమున్న రాజకీయ నేతగా మారిపోయారు. జైలు జీవితం, పాదయాత్ర వంటి వాటివి ఆయనకు పాఠాలు నేర్పి ఉండవచ్చు. అందుకే జగన్ చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించి విభజన ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తున్నారు... ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించే అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర నాధ్ రెడ్డి. ఆయన కూడా కడప జిల్లాకు చెందిన వారే. 1992 బ్యాచ్ కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక పోస్టులను నిర్వహించారు. కడప జిల్లాలోని రాజుపాలెం మండలం వర్లపాడు గ్రామానికి చెందిన రాజేంద్ర నాధ్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ డీజీపీగా నియమించారు. 1960లో జన్మించిన రాజేంద్ర నాధ్ రెడ్డికి అనేక విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు మంచి పేరు కూడా ఉంది. దీంతో జగన్ ఆయనను డీజీపీగా నియమించారు.కేఎస్ జవహర్ తాజాగా చీఫ్ సెక్రటరీ గా నియమితులైన కేఎస్ జవహర్ రెడ్డిది కూడా కడప జిల్లానే. 1990 బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అనేక శాఖల్లో పనిచేసి సమర్థమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా కూడా ఆయన పనిచేశారు. సీనియర్లున్నా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తమకు అండగా ఉండాలని జగన్ జవహర్ రెడ్డిని ఎంచుకున్నారు. ఆయన కడప జిల్లా కొండాపురంకు చెందిన వ్యక్తి. దీంతో ఏపీలో ముగ్గురు కీలకమైన పదవుల్లో ఉన్నవారు కడప జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్న విషయం. అయితే ఇందులో ఎవరినీ తప్పు పట్టడానికి లేదు. ముగ్గురు కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. ముగ్గురు పనితీరు ఆధారంగానే పదవులు దక్కాయన్న వాదన లేకపోలేదు.

Related Posts