YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్...

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్...

హైదరాబాద్, ఫిబ్రవరి 20,
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా కారు పార్టీ దూకుడు పెంచింది. అంశాల వారీగా హస్తం పార్టీని టార్గెట్ చేస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు లక్ష్యంగా గులాబీ పార్టీ ట్విట్టర్ వేదికగా జంగ్ సైరన్ మోగించింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై వరుసగా ట్వీట్లు పెడుతూ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయని ఫైర్ అయింది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో మంత్రి సీతక్క సమావేశంలో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.
వీడియోను పోస్ట్ చేసి కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలకు నిదర్శనమని పేర్కొంది. మరో ట్వీట్‌లో రైతు పాలిట రాబందులా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని మండిపడింది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో సాగునీటి ఎద్దడితో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాగు సగానికి పరిమితమైందని మరో ట్వీట్ చేసింది. 3.5 లక్షల ఎకరాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఇసుక దందాలో మంత్రి పీఏ అని మరో ట్వీట్ చేసింది. దూపదీప నైవేద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని ఫైర్ అయింది.ఆర్టీసీకి సైతం కాంగ్రెస్ మొండి చేయి చూపిందని పెండింగ్ అంశాలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై స్పష్టత ఇవ్వడం లేదని.. బకాయి ఉన్న రెండు వేతన సవరణల జాడ లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని మరో ట్వీట్ పెట్టింది. కాంగ్రెస్ పాలనలో 15 రోజుల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేసింది. అయితే ఎన్నికల తర్వాత ఆరు నెలల వరకు హామీలు నెరవేరుస్తుందా లేదా అనేది వేచిచూస్తామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందే ఇలా దాడి చేయడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ సైతం ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తోంది. మీద మెరుగు.. లోపల మురుగు..!! ఏకంగా స్కూటర్లనే 126 గొర్రెలను తరలించిన ఈ ప్రబుద్ధులు సూట్కేసులల్ల.. ఎన్ని నిధులు తరలించిండ్రో.. అంటూ ఫైర్ అయింది. ఆశతో అధికారం ఇస్తే ఆశల మీద నీళ్లు జల్లి అందిన కాడికి దోస్కొని పాయె దొర..!! నీళ్లు.. నిధులు.. నియామకాలు అంటే ఏమో అనుకున్నాం..!! నీళ్ల పేరుతో ప్రాజెక్టుల్లో నిధుల పేరుతో పథకాలలో.. నియామకాల పేరుతో గ్రూప్ 1 పేపర్ లీకేజీలలో అవినీతికి పాల్పడి, తెలంగాణ సమాజానికి తీరని ద్రోహం చేసిన దొరా.. ఈ పాపం ఊరికే పోదు..!! అంటూ వరుసగా ట్వీట్లు చేస్తోంది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా.. ఆనందాలు డబుల్ చేస్తా అని.. నీ ఆమ్దాని డబుల్ చేసుకుంటివి.. ప్రజల బాధలు డబుల్ చేస్తివి!! అని కేసీఆర్ టార్గెట్‌గా ట్వీట్ వార్ చేస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల ట్వీట్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలపై ఈ సోషల్ మీడియా వార్ ఏ మేరకు ఎఫెక్ట్ చూపుతుందో వేచి చూడాల్సి ఉంది

Related Posts