YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రిమాండ్ కు పత్తిపాటి పుల్లారావు కుమారుడు

రిమాండ్ కు పత్తిపాటి పుల్లారావు కుమారుడు

గుంటూరు,  మార్చి 1
మాజీ మంత్రి టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయాన్నే అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్థరాత్రి ఆయన్ని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో తిప్పుతూనే ఉన్నారు. ఉదయం అరెస్టు చేసిన సాయంత్రం వరకు అసలు ఎవరు అరెస్టు చేశారు ఎందుకు అరెస్టు చేశారో కూడా కుటుంబ సభ్యులకు తెలియలేదు. సాయంత్రానికి అందరికీ తెలియడంతో మరింత ఆందోళన మొదలైంది.
జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధులు మళ్లించారన్న ఆరోపణలతో ప్రత్తిపాటి శరత్‌ను అరెస్టు చేశారు. రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు శరత్‌తోపాటు ప్రత్తిపాటి పుల్లారావు భార్య, బావమరిది మరో ఏడుగురిని సహ నిందితులుగా చేర్చారు. వీరిపై విజయవాడలోని మాచవరం పీఎస్‌లో కేసు నమోదు అయింది. ప్రత్తిపాటి పుల్లారావు కుమారు అండ్ ఫ్యామిలీ భాగస్వాములుగా ఉన్న అవెక్సా కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని దీనిపై 16 కోట్ల రూపాయలు ఫైన్‌ ఎందుకు వేయకూడదని సెంట్రల్ గవర్నమెంట్‌ ఏజెన్సీ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్ నోటీసులు ఇచ్చింది. 2022 ఆగస్టులో ఈ నోటీసులు ఇచ్చింది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజయవాడ పోలీసులు ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడలో కాపు కాసి శరత్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 420,409,467,471,477(ఏ), 120(బి) రెడ్‌విత్‌ 34 కింద కేసులు రిజిస్టర్ చేశారు. హైడ్రామా మధ్య అర్థరాత్రి ఆయన్ని విజయవాడలోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అర్ధరాత్రి న్యాయమూర్తి నివాసంలో శరత్‌ను హాజరుపరిచారు పోలీసులు. ఆయన్ని రిమాండ్‌కు తరలించాలని పోలీసుసు వాదించారు. వద్దని శరత్ తరఫున వాదనలు సాగాయి. సుమారు రెండు గంటల పాటు ఈ వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌కు 14 రోజుల‌పాటు  రిమాండ్‌ విధించారు. 14 రోజుల రిమాండ్ విధించినందున ఆయన్ని విజయవాడ సబ్ జైల్‌కు తరలించారు.
హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న అవెక్సా కార్పొరేషన్‌కు నెల్లూరు, విజయనగరంలో కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన కుమారుడు శరత్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి వాటిని పూర్తి చేయకుండానే బోగస్ ఇన్వాయిస్‌లతో బిల్లులు డ్రా చేసుకుందని ఇందులో జీఎస్టీ ఎగ్గొట్టిందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థ చేపట్టిన పనుల్లో సీఆర్డీఏ పరిధిలో రోడ్లు, కాల్వల నిర్మాణం, సివరేజ్‌ పనులు కూడా ఉన్నాయి. ఇలా వివిధ పనుల్లో ఆ కంపెనీ 66,03,89,574 రూపాయల ప్రజాధనాన్ని కొల్లగట్టిందని పోలీసులు కేసు రిజిస్టర్ చేసింది. దీనిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. అవెక్సా కార్పొరేషన్‌కు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు కేవలం 66 రోజులే అదనపు డైరెక్టర్‌గా ఉన్నారని టీడీపీ వాదిస్తోంది. ఆయన 2019 డిసెంబర్‌ 9 నుంచి 2020 ఫిబ్రవరి 14 వరకు మాత్రమే ఆ పదవిలో ఉన్నారని ఆ సమయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి జోగేశ్వరరావు డైరెక్టర్‌గా, నాగమణి అదనపు డైరెక్టర్‌గా ఉన్నారని చెబుతున్నారు. నిందితుల జాబితాలో ఉన్న వారిలో ఎవరికీ సంస్థతో సంబంధం లేదని అంటున్నారు. కుమారుడి అరెస్టు విషయం తెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు ఎమోషన్ అయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన సహచర నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కక్ష సాధింపులు గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం అరెస్టు చేసిన పోలీసులు రాత్రికి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బోగస్ బిల్లులు సృష్టించి అక్రమాలకు పాల్పడినందుకు అరెస్టు చేశామని అందులో పేర్కొన్నారు. చివరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే టైంలో శరత్‌తో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ధైర్యం చెప్పారు.

Related Posts