YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాక రేపుతున్న రాజకీయం

కాక రేపుతున్న రాజకీయం

మహబూబ్ నగర్, మార్చి 26,
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీకి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నారు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ ప్రచారాన్ని ప్రారంభిచారు. తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు సైతం ఖరారు కావడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. కందనూలులో పార్లమెంట్ ఎన్నికల హడవిడి హోరెత్తనుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల ముఖచిత్రం సరికొత్తగా రూపుదిద్దుకుంది. బీజేపీ నుంచి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయా పార్టీల్లో టికెట్ కోసం ఫైట్ జరగగా ఇప్పుడు అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో పోరు తారాస్థాయికి చేరింది. అందరికంటే ముందుగానే కమలం పార్టీ నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మల్లు రవి చివరిసారిగా బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే ఇదే స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా విజయం సాధించిన చరిత్ర ఆయనకు ఉంది. ఇక ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం తొలిసారి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.రిజర్వ్డ్ స్థానం కావడంతో ప్రధాన పార్టీలు అచితూచి అడుగులు వేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలనే అభ్యర్థులుగా బరిలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉండడం, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 5చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలం, అలాగే మల్లు రవికి నియోజకవర్గంతో ఉన్న అనుంబంధాన్ని విశ్వసిస్తూ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా ఎన్నికల అంశాలు నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. తండ్రి అడుగుజాడలో తొలిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్దమయ్యారు. అటూ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్‎కు ఈ ఎన్నిక కీలకం కానుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చివరిసారి బరిలో ఉంటానని చెబుతున్న మల్లు రవి సైతం విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పులు నాగర్ కర్నూల్‎లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రిజర్వ్డ్ స్థానం కావడంతో ఆ వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు పార్టీలు ప్రత్యేక కార్యచరణ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Related Posts