YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మండుతున్న సూరీడు...

మండుతున్న సూరీడు...

హైదరాబాద్, మార్చి 26,
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం చల్లబడిన వాతావరణం ఇప్పుడు రోజురోజుకూ వేడి పెరిగిపోతుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 41 డిగ్రీలు దాటాయి. ఇక రాత్రి పూట పలు ప్రాంతాల్లో 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే నిర్మల్‌ మండలంలోని అక్కాపూర్‌ గ్రామంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం మధ్యాహ్నం వరకు అక్కాపూర్‌లో దాదాపు 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.ఆ తర్వాత 41 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిజామాబాద్‌ మోర్తాడ్‌ రెండో స్థానంలో నిలిచింది. కుమ్రంభీంలోని ఆసిఫాబాద్‌లో 40.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని చాప్రాలాలో 40.8 డిగ్రీలు, సూర్యాపేటలోని రైనిగూడెంలో 40.7 డిగ్రీలు, నిజామాబాద్‌లోని కోరట్‌పల్లిలో 40.7, మహబూబ్‌నగర్‌లోని వడ్డేమాన్‌లో 40.6 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లాలోని దస్తూరాబాద్‌లో 40.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 40.5 డిగ్రీలు, సిరికొండలో 40.5 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) వెల్లడించింది.ఇక మునుముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉదయం సమయంలో చల్లని వాతావరణం దర్శనమిచ్చినా.. మధ్యాహ్నం వేళల్లో మాత్రం ఎండ దంచికొడుతోంది. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు శీతల పానీయాలను సేవిస్తూ.. చల్లని ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. ఇక హైదరాబాద్‌లోనూ వచ్చే ఐదురోజులు ఎండ తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా మార్చి 28, 29, 30 తేదీల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, రాత్రిపూట 25 నుంచి 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే నెల రెండో వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరనుంది. ఏప్రిల్‌, మే నెలల్లో వడగాల్పుల తీవ్రత అధికమవనుంది.

Related Posts