YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఒక్క విజయం కోసం పరితపన...

ఒక్క విజయం కోసం పరితపన...

హైదరాబాద్, మార్చి 28,
 తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయనకు అన్ని దారులు మూసుకుపోయాయన్న అభిప్రాయం ఉంది.  కానీ రాజకీయాల్లో ఒకే ఒక్క విజయంతో అన్ని దారులూ తెరుచుకుంటాయి.  ఒక్క  విజయంతో  అన్నీ ప్లస్ అవుతాయి. కేసీఆర్ కు కూడా ఇప్పుడు అలాంటి అవకాశం పార్లమెంట్ ఎన్నికల ద్వారా వచ్చింది.  ఈ ఎన్నికల్లో ఆయన స్వీప్ చేయాల్సిన పని లేదు. నాలుగైదు సీట్లు తెచ్చుకుని గట్టి ప్రభావం చూపించగలగితే చాలు.. పరిస్థితులన్నీ మళ్లీ సానుకూలంగా మారుతాయి. ఇప్పుడు అలాంటి ప్రభావం చూపించేందుకు కేసీఆర్ కు ఎన్నో  సవాళ్లు ఉన్నాయి.  కేసీఆర్ పోరాటం చేస్తున్నారు.  17 ఎంపీ స్థానాలకుగానూ ముగ్గురు సిట్టింగులకు బీఆరెస్‌ అధినేత అవకాశం కల్పించారు. ఖమ్మం, మహబూబాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ స్థానాలు సిట్టింగ్‌లకు ఇచ్చారు. కరీంనగర్ సీటు గత ఎన్నికల్లో పోటీచేసిన బీ వినోద్‌కుమార్‌కు అభ్యర్థికి కేటాయించారు. ఇక మిగిలిన 13 స్థానాలు కొత్తవారిని బరిలో దింపారు.   ఎంపీ టికెట్ కోసం పార్టీలో కనీస పోటీ లేదని పార్టీ వర్గాల్లోనే చర్చించుకోవడం గమనార్హం. ఓడిపోయే స్థానానికి పోటీ ఎందుకనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నారన్న చర్చలూ నడిచాయి. వలసలను నివారించేందుకు బుజ్జగింపులు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. చేవెళ్ళ టికెట్ రంజిత్ రెడ్డికి బీఆరెస్‌ ముందుగా డిక్లేర్ చేసినప్పటికీ ఆ పార్టీని కాదంటూ అధికార కాంగ్రెస్‌లో చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పార్టీ మారుతున్నారని తెలిసి ఆయనను బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి బుజ్జగించినా.. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి  అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నది. ప‌దేండ్లు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంతో పాలించిన కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోకముందే లోక్‌సభ ఎన్నికలు పార్టీ మనుగడకే సవాల్‌ విసురుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో గణనీయ ఫలితాలు సాధించని పక్షంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   దశాబ్దంన్నర పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేయడంలో కేసీఆర్‌, నాటి టీఆరెస్‌ పాత్ర తక్కువేమీ కాదు. రాష్ట్రం సిద్ధించిన‌ అనంతరం అప్రతిహతంగా రెండు ప‌ర్యాయాలు అధికారంలో ఉన్నది. మూడోసారి అనూహ్యంగా పరాజయం పాలయ్యారు.  తీవ్రమైన ఓటమి నుంచి ఆ పార్టీ కోలుకోకముందే నాలుగు నెలల స్వల్పకాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకురావడం స‌వాల్‌గా మారింది. నిజానికి ఇలా రావడం గతంలో ఆయన వ్యూహమే. అప్పట్లో ప్లస్ అయిందేమో కానీ ఇప్పుడు మైనస్‌గా మారుతోంది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఇరుక్కోవడం ఎన్నికల ముందు ఎజెండా కాగా, ఎన్నికల తర్వాత రాద్ధాంతంగా మారింది. తాజాగా కవిత అరెస్టు, జైలు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకుచుట్టుకుంటోంది.  ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొననగా గోరుచుట్టుపై రోకటిపోటులా పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు వలసపోవడం ఇబ్బందిగా మారింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీలకు పెద్ద సంఖ్యలో సాగుతున్న వలసలు గులాబీ నాయకత్వానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.  ఎన్నికల ఫలితాలు వెలువడగానే బీఆరెస్‌ ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ మంత్రి కడియం, ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందని జోస్యాలు చెప్పడం ప్రారంభించారు.  ఇప్పుడు ఆ మాటలే బీఆరెస్‌కు ఇబ్బందిగా మారాయి. నైతికత అంశాన్ని పక్కకుపెడితే తమ ప్రభుత్వ రక్షణకు ఫిరాయింపులను ప్రోత్సహించక తప్పలేదంటూ గేట్లు ఎత్తుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. తాజాగా నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ కలవరానికి దారితీసింది. పలువురు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. . మెజార్టీ సిట్టింగ్ ఎంపీలు రెండు పార్టీల్లోకి జంప్ అయ్యారు. కేసీఆర్ ఇలాంటి పరిస్థితులను గతంలోనూ ఎదుర్కొన్నారు.  మళ్లీ ఎదిగారు. ఈ సారి ఆయనకు లోక్ సభ ఎన్నికలు ఆ చాన్స్ ఇస్తున్నాయి. తనకు ప్రజాభిమానం ఇంకా మెండుగా ఉందని నిరూపిస్తే.. ఆయనపై దూసుకొస్తున్న ఆయుధాలన్నీ స్లో  అయ్యే అవకాశం ఉంది.  ఇప్పుడు మళ్లీ  వెలిగిపోయే అయ్యే అవకాశం కేసీఆర్ చేతుల్లో ఉన్నట్లే అనుకోవచ్చు. కానీ అదంతా తేలిక కాదు.. కానీ అసాధ్యం కాదు. కేసీఆర్ అలసిపోలేదని నిరూపించుకునే అవకాశం అని కూడా అనుకోవచ్చు.

Related Posts