YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ లో కాంగ్రెస్ ఫ్రెండ్లీ కంటెస్ట్....

హైదరాబాద్ లో కాంగ్రెస్ ఫ్రెండ్లీ కంటెస్ట్....

హైదరాబాద్, ఏప్రిల్ 13,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోయారు. ఇందులో కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. నిజానికి హైదరాబాద్ కు అభ్యర్థిని ఖరారు చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ స్థానంపై అసలు ఏ పార్టీ కూడా ఆశలు పెట్టుకోలేదు. కానీ అభ్యర్థుల కసరత్తు ప్రారంభమైన మొదట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు హడావుడి  చేశారు. సానియా మీర్జాను నిలబెట్టి ఓవైసీకి చెక్ పెడతామన్నట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. ఆమె కాకపోతే ఓవైసీలపై అలుపెరగకుండా పోరాటం చేస్తున్న  నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ ను అభ్యర్థిగా ఖరారు చేస్తామన్నారు. ఇక అజహరుద్దీన్ ఉండనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ బీసీ  హిందూ నేతను ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం మజ్లిస్ అధినేత ఓవైసీని గట్టున పడేయడానికేనన్న విశ్లేషణ ప్రారంభమయింది. హైదరాబాద్ స్థానాన్ని బీజేపీ ఈ సారి చాలా సీరియస్ గా తీసుకుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కొంపెల్ల మాధవీలత అనే నేతకు టిక్కెట్ ఇచ్చారు. ఆమె పాతబస్తీలో పుట్టి పెరిగారు. తర్వాత వృత్తి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లినా మళ్లీ తిరిగి వచ్చి  పాతబస్తీ కేంద్రంగానే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె హిందూ ఓటర్లను ఏకం చేసే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి హైదరాబాద్‌లో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించితే.. ఓవైసీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న అభిప్రాయం గట్టిగా వినపిిస్తోంది. హిందూ ఓట్లు చీలి పోవడం వల్లనే మజ్లిస్ ఏకపక్ష విజయాలను నమోదు చేస్తూ వస్తోంది.  ఇలాంటి సమయంలో గట్టి ముస్లిం అభ్యర్థిని పెడతారన్న ప్రచారంతో ఓవైసీ అప్రమత్తమై... కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందానికి వచ్చారన్న అభిప్రాయం వినపిిస్తోంది. అందుకే ఇప్పుడు హిందూ ఓట్లను చీల్చేలా.. హిందూ అభ్యర్థిని నిలబెట్టేలా కాంగ్రెస్ చూస్తోందని అంటున్నారు. అలా కాకపోతే..  బలహీనమైన ముస్లిం అభ్యర్థిని ఖరారు చేస్తారని చెబుతున్నారు. బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ బిసి అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ముస్లిం నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినా వాటిని పక్కనబెట్టి బిసి అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎలాగూ హైదరాబాద్ సీటులో కాంగ్రెస్ గెలవదు.. ఇతర చోట్ల మజ్లిస్ మద్దతు ఇస్తే పధ్నాలుగు సీట్లలో గెలవడానికి అవకాశం ఉంటుందన్న సమీకరణాలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ప్రభుత్వం స్థిరంగా ఉందని అనిపించుకోవడానికైనా మజ్లిస్ సపోర్ట్ అవసరం అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని అనుకోవచ్చు. హైదరాబాద్‌  పాతబస్తీలో పాతుకుపోయిన మజ్లిస్ ఇటీవల బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో   కంచు కోటల్లాంటి నియోజకవర్గాల్లో మజ్లిస్   గట్టి పోటీ ఎదుర్కొంది. ఎవరూ పోటీ లేకపోయినా.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. తమకు పోటీగా మరో పార్టీ వస్తే.. మజ్లిస్ కు వచ్చే ఫలితాల గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే మజ్లిస్ పై ఓటర్లకు మొహం మెత్తుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో యాకత్పురా, మలక్ పేట, నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చారు. యాకత్పురా స్థానంలో ఎనిమిది వందల ఓట్ల తేడాతోనే మజ్లిస్ అభ్యర్థి  బయటపడ్డారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర హిందూ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతోనే అది సాధ్యమయింది.  నాంపల్లి గురించి చెప్పాల్సిన పని లేదు. ఫిరోజ్ ఖాన్ మజ్లిస్ దాడులను ఎదుర్కొని రాజకీయం చేస్తున్నారు.   ఓ దశలో మజ్లిస్ కూడా ఆశలు వదిలేసుకుంది. మలక్ పేటలో ఎప్పుడూ గట్టి పోటీ ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం యూకత్పురాలో మజ్లిస్ బచావో తెహరీక్.. ఎంబీటీ గట్టి పోటీ ఇవ్వడం.. నాంపల్లి, మలక్ పేటలో కాంగ్రెస్ పుంజుకోవడం. మజ్లిస్‌కు డేంజర్ గా మారింది. కాలం మజ్లిస్ విజయరహస్యం పాతబస్తీలోకి తమ పార్టీకి పోటీగా మరో పార్టీ రాకుండా చూసుకోవడం. ఇందు కోసం మజ్లిస్ చాలా ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది.. అందులో ఒకటి అధికార పార్టీతో సన్నిహితంగా ఉండటం. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉండి.. పాతబస్తీలోకి మీరు రావొద్దు.. బయట అంతా మా పార్టీ మీకు మద్దతు ఇస్తుందని ఒప్పందాలు చేసుకుంటారు.  పాతబస్తీలో  హిందూ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు చీల్చి మేలు చేసుకుంటారు.  వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అదే వ్యూహం పాటించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే పాటించారు. ఇప్పుడు రేవంత్ తోనూ అలాంటి ఒప్పందమే చేసుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా.. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఓవైసీ ప్రచారం చేశారు. అలాంటి పార్టీని... బలహీనపరిచే అవకాశం వచ్చినా వదులుకుంటూ..  ఆ పార్టీతో లోపాయికారీ ఒప్పందాలకే తెలంగాణ కాంగ్రెస్ మొగ్గు చూపుుంది.  పాతబస్తీలో ఎంబీటీకి అధికార పార్టీ మద్దతు ఇస్తే..  పాతబస్తీలో మజ్లిస్ కు పోటీగా ఎదుగుతుంది.  కానీ  ఎంబీటీని ప్రోత్సహించడం ఆపేసి.. తాము బలపడటం మానేసి..  ఫిరోజ్ ఖాన్ లాంటి నేతల పోరాటాలను  తక్కువ చేసి..  మజ్లిస్ తో లోపాయికారీ పొత్తులకు వెళ్తోంది కాంగ్రెస్. ఇది   రక్షణాత్మక రాజకీయమే.   ఎందుకటే మజ్లిస్ మద్దతు లేకపోయినా  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ సాయం కాంగ్రెస్ కోరుకుంటోంది.

Related Posts