YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖమ్మం జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు

ఖమ్మం జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు

ఖమ్మం, ఏప్రిల్ 13
ఫోన్ ట్యాపింగ్.ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. మన ఫోన్ నుంచి మనం వేరొక వ్యక్తితో మాట్లాడిన మాటలు బహిర్గతమైతే! అమ్మో వినడానికే భయమేస్తోంది. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెలగబెట్టిన నీచపు వ్యవహారం ఇది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సంచలనం రేకెత్తిస్తున్న ఈ విశృంఖల చర్య ఖమ్మం జిల్లాపైనా పడగ విప్పింది. అవును ఇది నిజం. కొందరు బీఆర్ఎస్ జిల్లా నేతలను తమ అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకు జిల్లాకు చెందిన ఓ కీలక నేత సైతం ఈ అస్త్రాన్ని వినియోగించారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత గులాబీ పార్టీ అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోగుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అధికార, ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న బర్నింగ్ ఇష్యూ ఇది. ఇందులో రాష్ట్రంలోని కీలక ఉన్నతాధికారుల పాత్ర ప్రముఖంగా తెరపైకి కనిపిస్తుండగా ఆ వెనుక రాజకీయ పెద్దల హస్తం ఎలాగు ఉందనే ఉంది. అయితే సంచలనం కలిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయట పడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి బీఆర్ఎస్ కీలక నేత ఒక పోలీస్ బాస్ ను అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి తెర లేపినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంగా పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తించిన బోస్ సహాయ సహకారాలతో జిల్లాలోని కొందరు కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుప్పుమంటోంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంగా ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సదరు పోలీస్ అధికారి అమాత్యునితో తుదికంటా అంటగాగి చివరికి అధికారం కోల్పోయే క్రమంలో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. ఆ అధికారి సాంకేతిక అండదండలతో అమాత్యుడు ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడినట్లు తెలుస్తోంది.జిల్లాలో కీలక నేతలుగా వ్యవహరిస్తూ అజేయుడిగా చెప్పుకునే నేతకు కొరగాని కొయ్యల్లా మారిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాడు బీఆర్ఎస్ లో కొనసాగిన పొంగులేటి, తుమ్మల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీలో అసమ్మతి రాజేశారు. ఈక్రమంలోనే ఈ నేతల ప్రతి కదలికను ఒడిసి పట్టేందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. పార్టీలో అసమ్మతి రాజేస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు గులాబీ బాస్ కు చేరవేసేందుకు ఈ అస్త్రాన్ని ఖమ్మం కీలక నేత భేషుగ్గా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వివాద రహితుడుగా, సున్నిత మనస్కుడిగా చెప్పుకునే ఎంపీ వద్దిరాజు వ్యవరాలపైన కూడా ఆ నేత కన్నేసినట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఎన్నికలకు ముందు ప్లేటు ఫిరాయిస్తారన్న అనుమానం ఉన్న నాయకులపైన కూడా ట్యాపింగ్ వల విసిరి వారిని బెదిరించి మరీ పార్టీ వీడకుండా అడ్డు తగిలినట్లు స్పష్టం అవుతోంది. ఫోన్ సంభాషణలను అడ్డు పెట్టుకుని వారు పార్టీలో కొనసాగేలా కట్టడి చేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద రాష్ట్రంలో రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి చెందిన విచారణ ఖమ్మం జిల్లాలో ఎవరిని దోషులుగా తేలుస్తుందో వేచి చూడాలి.

Related Posts