YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉద్యోగుల రిటైర్మెంట్ లో మార్పులు

ఉద్యోగుల రిటైర్మెంట్ లో మార్పులు

హైదరాబాద్, ఏప్రిల్ 13
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వయో పరిమితి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అధికారులు ప్రాథమికంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసింది. దీంతో మూడేళ్లపాటు రిటైర్మెంట్లు నిలిచిపోయాయి. గత మార్చి 30 నుంచే మళ్లీ ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు తీవ్ర నిరసన తెలిపారు. అయినా కేసీఆర్‌ సర్కార్‌ తన నిర్ణయాన్ని కొనసాగించింది. ఇక రేవంత్‌ సర్కార్‌ ఉద్యోగుల వయోపరిమితి విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయాన్ని కొనసాగిస్తూనే ఉద్యోగ ఖాళీలు పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగుల వయో పరిమితి 61 ఏళ్లు లేదా 33 ఏళ్లుగా ఉండేలా కసరత్తు చేస్తోంది. ఏది ముందు అయితే దానిని పరిగణనలోకి తీసుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చిన్న వయసులో ఉద్యోగాలు సాధించినవారు 61 ఏళ్ల నిబంధన కారణంగా 33 ఏళ్లకుపైగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఖాళీలు ఏర్పడడం లేదు. దీంతో రేవంత్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈమేరకు అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించింది. ఈ పోస్టులను రేవంత్‌ సర్కార్‌ తన ఖాతాలోనే వేసుకుంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రచారం చేసుకుంటోంది. గ్రూప్‌–1, 2, 3, 4 నోటిఫికేషన్ల ద్వారా మరో 15 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా 60 వేల పోస్టులు మాత్రమే భర్తీ కానున్నాయి. ఇంకా 1.40 లక్షల పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించడంతోపాటు, రిటైర్మెంట్లు పెంచే విధంగా నిబంధనలు సవరించాలని భావిస్తోంది.ఉద్యోగుల రిటైర్మెంట్‌ నిబంధనలపై త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతుందని సమాచారం. ఈమేరకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

Related Posts