YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎవరికి లాభం...ఎవరికి నష్టం

ఎవరికి లాభం...ఎవరికి నష్టం

కడప, ఏప్రిల్ 15,
ఎన్నికలవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడికి ఏదైనా జరిగితే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. పైగా ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ కాబట్టి ఇవి దేనికైనా దారి తీసే ప్రమాదం ఉంది.. అయితే ఈ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వారి లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం లభించకపోయినప్పటికీ.. దీని తర్వాత జరిగే పరిణామాల ఆధారంగానే ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడిని మరొక రాజకీయ నాయకుడు విమర్శిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా ఇప్పుడు రాజకీయాలు ఏకంగా వ్యక్తిగత విషయాలు దాకా వెళ్లాయి. ఏపీలో అయితే మరీ దారుణం. కానీ భౌతిక దాడులను ఎవరూ హర్షించరు. ఎందుకంటే నచ్చినా, నచ్చకున్నా ఒక మనిషిపై ఇంకొక మనిషి భౌతిక దాడి చేయడం అనేది సహేతుకం కాదు.జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో.. దానిని ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా వాడుకుంటే మాత్రం అంతకుమించిన రాజకీయ దారిద్రం మరొకటి ఉండదు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది వైసిపి.. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నది జగన్మోహన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి కి భద్రత కల్పించలేని పోలీసులు.. సామాన్యులకు ఎలా కల్పిస్తారు? ముఖ్యమంత్రి పర్యటన సాగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో కరెంటు ఎందుకు తొలగించారు? ముఖ్యమంత్రి బస చేసిన బస్సు వద్దకు ఎందుకు ఒకసారి జనాన్ని అనుమతించారు? ఇలాంటి ప్రశ్నలకు సహజంగానే సమాధానం లభించాల్సి ఉంటుంది. ఎందుకంటే బస్సు యాత్ర చేస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పైగా ఇప్పుడు ఎన్నికల కాలం.. అలాంటప్పుడు పై ప్రశ్నలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయి.. ఇలాంటి సమయంలో పార్టీ శ్రేణులు సమయమనం పాటించాలి. అన్నింటికీ మించి భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా అధికార పార్టీ నాయకులు నిశ్శబ్దాన్ని అనుసరించాలి.ఇక ఈ దాడి రాజకీయంగా జగన్ కు నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ పై కోడి కత్తి దాడి జరిగింది. ఇంతవరకు ఆ కేసు సంబంధించి విచారణ లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా అదే ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఇప్పుడు సహజంగానే ఈ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి కూతురు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. జగన్ సొంత సోదరి షర్మిల కూడా ఆరోపణలు చేస్తున్నారు. సరే అవి వారి ఇంటి విషయాలు కాబట్టి పక్కన పెట్టినా.. శనివారం రాత్రి విజయవాడలో జరిగిన దాడి ని సానుభూతి అంశంగా జగన్ ఒకవేళ ప్రజల్లోకి తీసుకెళ్తే అది నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ” దాడి జరిగింది నిజమే. జగన్ గాయపడ్డారు. కన్ను రెప్ప పై భాగం కొంచెం వాచింది. దీని వెనుక ఎవరు ఉన్నారు? వారి లక్ష్యం ఏమిటి? అసలు ఎందుకు ఇలా చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే సరిపోతుంది.. ఆ తర్వాత అసలు విషయాలు ప్రజలకు అర్థం అవుతాయి. ఒకవేళ జగన్ బాధిత పక్షం లాగా ప్రజలకు కనిపిస్తే కచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తారు. అదే వేరే విధంగా అనిపిస్తే అప్పుడు వారు అదే ఓటుతో బుద్ధి చెబుతారు.. అప్పటిదాకా సమయమనం అనేది చాలా ముఖ్యం” అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts