YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సానుభూతి మంత్రం...ఎంత వరకు.

సానుభూతి మంత్రం...ఎంత వరకు.

విజయవాడ, ఏప్రిల్ 15
ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకర్ పై నడుస్తుండగా కింద పడ్డారు. నుదుటికి గాయమైంది.. అలా కారుతున్న రక్తంతోనే ఆమె ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు.. ఆ ఘటనకు కారణమేంటి అనేది ఇంతవరకూ బయటకు రాలేదు.. ఒక ముఖ్యమంత్రి స్థాయి మహిళ అలా గాయపడటం.. రక్తం కారుతుంటే అలా తీసుకురావడం అనేది ఈ సోషల్ మీడియా కాలంలో ఒకింత “నటన”లాగే కనిపించిందని ఆరోపణలు వినిపించాయి. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాలికి కట్టుకట్టుకొని ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలిచారు..ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో ఓ యువకుడు దాడి చేశాడు. అప్పట్లో రాజకీయంగా అది సంచలనం సృష్టించింది. ఏపీ పోలీసుల మీద, అక్కడి వ్యవస్థ మీద నమ్మకం లేక జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందారు. జగన్ పై జరిగిన దాడిని రాజకీయ కోణంలో టాకిల్ చేయలేక టిడిపి బోర్లా పడింది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అయితే ఇంతవరకు ఆ కేసు కు సంబంధించి ఎటువంటి పురోగతీ లేదు. ఈ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ ఆ కేసు లో అతీగతీ తేలకపోవడం గమనార్హం.ఇక అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో అలిపిరి బాంబు బ్లాస్ట్ జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు ప్రయాణించారు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది. వరుసగా కరువు, ప్రభుత్వపరంగా అంతంతమాత్రంగానే చర్యలు ఉండటంతో ప్రజలు కసితో కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఏకంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని రెండుసార్లు గెలిపించారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాస్తవానికి రాజకీయాల్లో సానుభూతి అనే అంశం ఇవాల్టిది కాదు. నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు తరఫున ఉన్న ఎమ్మెల్యేలు చెప్పులతో దాడి చేశారు. అప్పట్లో ఆయన బాధిత పక్షంగా ఉన్నారు. ఇవాల్టికి సీనియర్ ఎన్టీఆర్ మీద సానుభూతి వ్యక్తం అవుతుందంటే దానికి కారణం ఆ దాడే. మన సమాజంలో సానుభూతిని మించిన ఆయుధం మరొకటి లేదు. ఎన్నికల సమయంలో దానిని దొరకబుచ్చుకునేందుకు రాజకీయ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ప్రయత్నాలలో కొంతమంది మాత్రమే విజయవంతమవుతారు.
అలిపిరి బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు దానిని సానుభూతిగా వాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి . కానీ ఆ ఎన్నికల్లో ఆ సానుభూతి మంత్రం పనిచేయలేదు. అంతిమంగా “చంద్రబాబు మాకేం చేశారు” అనే కోణంలోనే ప్రజలు ఆలోచించారు. అందువల్లే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లో మమతా బెనర్జీ కాలుకు కట్టు కట్టుకొని ప్రచారం చేశారు. అప్పట్లో జనం దానిని నమ్మారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆమె అదే ట్రిక్ ప్లే చేసేందుకు ప్రయత్నాలు చేశారనే విమర్శలున్నాయి. అయితే అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి అన్నది మరి కొద్ది రోజుల్లో చూడాలి.ఇక ఏపీ విషయానికొస్తే శనివారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనపై కోడి కత్తి దాడి కూడా జరిగింది. అప్పట్లో ఆ ఎన్నికల్లో ఆయన 151 సీట్లతో గెలుపొందారు. యాదృచ్ఛికంగా ప్రస్తుత ఎన్నికల ముందూ ఆయన పై దాడి జరిగింది. అయితే ఈ దాడిని ప్రతిపక్ష నాయకులు, ఓ వర్గం నాయకులు సానుభూతి పెంపొందించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. “నాడు కోడి కత్తి దాడి జరిగినప్పుడు ఇక్కడి పోలీసుల మీద, ఇక్కడి వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదన్నారు. వెళ్లి హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన చేతిలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయనపై దాడి జరిగింది. మరి ఇప్పుడు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవాలి కదా.. అంటే ఈ దాడిని కూడా ఎన్నికల్లో సానుభూతి అంశంగా వాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు” అంటూ టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.ఇక వైసిపి నాయకులు చెబుతున్న కోణం మరో విధంగా ఉంది. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి.. సీట్ల పంపకాలు చేసుకున్నప్పటికీ గెలిచే పరిస్థితి లేదని.. అందువల్లే జగన్మోహన్ రెడ్డి పై దాడికి ప్లాన్ చేశారని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదని.. కచ్చితంగా అంతకుమించి సమాధానం మేము చెబుతామని వారు అంటున్నారు.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. ఈ రాజకీయ నాయకుడైనా ఎన్నికల ముందు చేసిన పని చెప్పుకోవాలి. ప్రజలకు ఏం చేస్తామో కూడా చెప్పగలగాలి. అలాకాకుండా సానుభూతిని నమ్ముకుంటే అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. రాజకీయాల్లో అలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయి. అయితే ఇందులో కొంతమంది మాత్రమే విజయవంతమయ్యారు. చాలామంది ప్రజల చేత తిరస్కారానికి గురయ్యారు. సానుభూతి అనేది ఆ క్షణం వరకు పనిచేస్తుందేమో గాని.. దీర్ఘకాలం రక్షణ ఇవ్వలేదు. ఎందుకంటే చేసిన పనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతేతప్ప సానుభూతి కాదు. కానే కాదు.

Related Posts