YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ రెండు చోట్ల టిడిపి అభ్యర్థులను మార్చుతారా?

ఆ రెండు చోట్ల టిడిపి అభ్యర్థులను మార్చుతారా?

శ్రీకాకుళం, ఏప్రిల్ 16,
చంద్రబాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ఏడుపదుల వయసులో కూడా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అటు భాగస్వామ్య పక్షాల నేతలతో కలిసి భారీ బహిరంగ సభలకు హాజరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలో జరిగే ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో రెండు సీట్ల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించనున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వర్గాన్ని బిజెపికి కేటాయించారు. పాలకొండను జనసేనకు ఇచ్చారు. అయితే ఆ రెండు చోట్ల ఇబ్బంది లేకున్నా.. శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ సీట్లలో కొత్త అభ్యర్థులను ప్రకటించారు. అక్కడ ఇన్చార్జిలను కాదని కొత్త నేతలను బరిలో దించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇన్చార్జులు ఎదురు తిరుగుతున్నారు. దీంతో అక్కడ అభ్యర్థులను మార్చుతారన్న ప్రచారం సాగుతోంది.ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దానికి రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. పలాసలో ప్రజా గళం పూర్తయిన తర్వాత.. రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు. జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. ఒకవేళ ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను మార్చుతామనుకుంటే మాత్రం ఆరోజు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులను కొనసాగించాలనుకుంటే.. అసంతృప్తులను సముదాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగుతూ వస్తోంది. అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య లక్ష్మీదేవి ఇప్పటివరకు టిడిపి అభ్యర్థులుగా పోటీ చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ఆ కుటుంబానికి టికెట్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా గొండు శంకర్ అనే యువకుడికి టికెట్ ఇచ్చారు. దీంతో గుండ కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఎమ్మెల్యే అభ్యర్థిగాను, మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ ఎంపీ అభ్యర్థిగాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో హై కమాండ్ దూత వచ్చి వారితో చర్చలు జరిపారు. మెజారిటీ టిడిపి క్యాడర్ వారి వెంటే ఉండడంతో.. ఇక్కడ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు టిడిపిలో ప్రచారం జరుగుతోంది.మరోవైపు పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తిని కాదని.. మామిడి గోవిందరావు అనే కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. అయితే గత నాలుగు దశాబ్దాలుగా కలమట కుటుంబం ఇక్కడ సేవలందిస్తోంది. సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగుతోంది. వెంకటరమణమూర్తి తండ్రి కలమట మోహన్ రావు ఐదుసార్లు పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వెంకటరమణమూర్తికి కాదని మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చినా.. మెజారిటీ క్యాడర్ మాత్రం కలమట వెంటే ఉంది. ఈ విషయం టిడిపి హై కమాండ్ సైతం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చంద్రబాబు వస్తుండడంతో.. ఈ రెండు సీట్లలో అభ్యర్థుల మార్పు ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
10 రోజులే కీలకం
ఏపీలో ప్రచార పర్వాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కూటమి పక్షాలు నిర్ణయించాయి. 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి విశాఖ వరకు వరుసగా భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు పవన్ వేదికలు పంచుకున్నారు. అప్పట్లో ఎన్డీఏకు ఒక ఊపు రావడానికి ఈ సభలు దోహదపడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా అదే ఊపు తేవాలని చంద్రబాబు భావించారు. కానీ చిలకలూరిపేట సభ తర్వాత ప్రధాని మోదీ కనిపించలేదు. బిజెపి అగ్ర నాయకత్వం కూడా ఏపీ పై దృష్టి పెట్టలేదు. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో.. మొదటి మూడు విడతల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలపైనే బిజెపి అగ్ర నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు నాలుగో విడత పోలింగ్ జరగనున్న తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఓ పది రోజులపాటు భారీ బహిరంగ సభలతో ఎలక్షన్ ఫీవర్ తెప్పించి.. ఎన్డీఏకు ఒక ఊపు తేవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ 15 రోజులపాటు ఎవరికి వారే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో మాత్రం ఉమ్మడి ప్రచార సభలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. మే 1 నుంచి 11 వరకు మాత్రం ఉమ్మడి ప్రచార సభలతో హోరెత్తించాలని చూస్తున్నారు. ఈ విషయంలో స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రజాగళం యాత్ర చేపడుతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అటు పవన్ సైతంజనసేన పార్టీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రకారం చేస్తున్నారు.మధ్యలో చంద్రబాబుతో పాటు వేదికలు పంచుకుంటున్నారు. వీరితో పురందేశ్వరి జత కలుస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఉభయగోదావరి జిల్లాలో జరుగుతున్న ఉమ్మడి ప్రచార సభలకు ప్రజాస్పందన వస్తోంది. అందుకే దానిని కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.మే 13న పోలింగ్ జరగనుంది. 11తో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో మే రెండు నుంచి మూడు పార్టీలు ఉమ్మడిగానే సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి వారి సభలకు మూడు పార్టీల నాయకులు హాజరుకావాలని నిర్ణయించారు. తద్వారా ఎన్డీఏకు ఒక ఊపు తేవాలని వ్యూహరచన చేస్తున్నారు. పది రోజులు పాటు ఉమ్మడి ప్రచారం అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజీని మార్చేది ఆ పది రోజులే నన్న నిర్ణయానికి వచ్చారు. అటు క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఉదయం పూట ఆన్లైన్, మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉమ్మడి ప్రచారం చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తానికైతే మేలో ఆ పది రోజులు కీలకంగా భావిస్తున్నారు.

Related Posts