YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం

 డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం

హైదరాబాద్, ఏప్రిల్ 16,
రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా కొన్ని చోట్ల గంజాయి వినియోగం బయటపడుతూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ అండ్ డ్రైవ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాగిన మత్తులో ప్రమాదాల నివారణ, మద్యం తాగే వారిలో పరివర్తన తీసుకురావడం కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు, అదే తరహాలో 'డ్రగ్స్ అండ్ డ్రైవ్' పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ముఖ్యంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం 'ఎబోన్ యూరిన్ కప్' యంత్రంతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ పరీక్షల కిట్ సమకూర్చింది. వీటిని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపగా.. ఇప్పటికే కొన్ని స్టేషన్లలో తనిఖీలు కూడా మొదలయ్యాయి. ఈ కిట్ ద్వారా గంజాయి తాగే వారిని ఎలా నిర్ధారించాలో కూడా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ ఉపేంద్రరావు, ఎస్సై సంతోష్ రావు సోమవారం డోర్నకల్ లో డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు  నిర్వహించారు. గార్ల ఎస్సై జీనత్ కుమార్ రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులకు పరీక్షలు చేశారు. 'గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాలు వినియోగించారనే అనుమానం వచ్చిన వారిపై ఈ కిట్ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహిస్తాం. పరికరంలో రెండు ఎర్ర గీతలు కనిపిస్తే నెగిటివ్ గా, ఒకటే గీత కనిపిస్తే పాజిటివ్ గా పరిగణిస్తాం. పాజిటివ్ అని తేలితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అవసరమైతే తదుపరి పరీక్షలు నిర్వహిస్తాం.' అని డోర్నకల్ సీఐ ఉపేంద్రరావు తెలిపారు.

Related Posts