YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆమంచి ఎఫెక్ట్....ఎంతవరుకో..

ఆమంచి ఎఫెక్ట్....ఎంతవరుకో..

ఒంగోలు, ఏప్రిల్ 20,
ఈ ఎన్నికల్లో ఆమంచి సోదరుల ఎఫెక్ట్ బాగానే పడనుంది. ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను కలసిన ఆమంచి షర్మిలతో రాజకీయ అంశాలపై చర్చించి వచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయడానికి రెడీ అయిపోయారు. వైసీపీ నుంచి టిక్కెట్ ను ఆశించిన ఆయనకు పార్టీ అధినాయకత్వం హ్యాండ్ ఇవ్వడంతో అదే హ్యాండ్ గుర్తుపై పోటీ చేసి వైసీపీకి ఝలక్ ఇవ్వడానికి ఆమంచి కృష్ణమోహన్ సిద్ధమయ్యారు.,బలమైన నేత కావడంతో... ఆమంచి కృష్ణమోహన్ బలమైన సామాజికవర్గం నేతగా చీరాల నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. రెండుసార్లు గెలిచారు. ఒకసారి కాంగ్రెస్ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత ఆయన టీడీపీకి చేరువయ్యారు. అయితే మళ్లీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన వైసీపీ పంచన చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఇక్కడి నుంచి ఓటమి పాలయ్యారు. ఈసారి టిక్కెట్ రాకపోవడంతో పాటు పర్చూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. కొంతకాలం అక్కడ పనిచేసి తనకు చీరాల సీటును ఇవ్వాలని ఆయన అధినాయకత్వాన్ని కోరారు. కానీ వైసీపీ హైకమాండ్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.చీరాల నియోజకవర్గంలో ఆయన వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ ను ఓడించే లక్ష్యంతో ఆయన పోటీకి దిగుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి బలహీనంగా ఉండటంతో తనకు కలసి వస్తుందన్న నమ్మకంతో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. తనకు పట్టున్న నియోజకవర్గంలో తనను కాదని కరణం కుటుంబానికి టిక్కెట్ ఇవ్వడాన్ని ఆమంచి కృష్ణమోహన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా కాంగ్రెస్ లో చేరి పోటీ చేయాలని కొందరు చేసిన సూచనతో ఆయన పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలను కలసి చర్చించారు. అంతా ఒకే అయితే ఆయన చీరాల ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయి.  అదే జరిగితే ఆమంచి కృష్ణమోహన్ కారణంగా వైసీపీ అభ్యర్థికి నష్టం వాటిల్లే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆమంచి కారణంగా ఒక సామాజికవర్గం ఓట్లు చీలిపోతే అది టీడీపీకి కూడా నష‌్టమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కరణం బలరామకృష్ణమూర్తి గెలిచి తర్వాత వైసీపీలో చేరిపోయారు. ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి సాములు కూడా వైసీపీ నుంచి జనసేనలో చేరి గిద్దలూరు టిక్కెట్ ను ఆశించారు. అక్కడ సీటు దక్కకపోవడంతో గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఆమంచి సాములు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆమంచి బ్రదర్స్ పోటీ కారణంగా చీరాలలో వైసీపీకి, గిద్దలూరులో టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. మరి ఆమంచి సోదరుల ఎఫెక్ట్ ఎవరిపై పడుతుందన్నది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలియనుంది.

Related Posts