YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

25 నుంచి తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు

 25 నుంచి తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు

హైదరాబాద్,,ఏప్రిల్ 22
తెలంగాణలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణలోని కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర అగ్ర నాయకులు కూడా తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. ముఖ్య నాయకుల ప్రచారంతో జోరు పెంచేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నెల 25న నామినేషన్ల దాఖలు గడవు ముగియనున్ననేపథ్యంలో పలువురు జాతీయ నేతలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రచారానికి వస్తున్నారు. ఈ నెల 25న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌తోపాటు మరో మూడు చోట్ల ఆయన ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాల పరిధిలో పార్టీ పరంగా నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరవయ్యేందుకు అమలు చేస్తున్న కార్యాచరణ, పోలింగ్‌ బూత్‌ స్థాయిల్లో జరుగుతున్న కృషి, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను ఆయన రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన సమీక్షించనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. అమిత్‌ షాతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ కూడా ఆది, సోమవారాల్లో వివిధ సమావేశాల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. పార్టీ ఎన్నిలకు సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రచారంపై ఆయన సమీక్షించనున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని పలు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రధాని మోదీ కూడా రానున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. ఈ నెలాఖరులో గానీ, మే మొదటి వారంలోగానీ పర్యటనకు రానున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటికే ఒకసారి ప్రచారానికి వచ్చారు. మలి విడత ప్రచారానికి రానున్న ప్రధాని మోదీ మూడు నాలుగు సభలతోపాటు రోడ్‌ షోల్లో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రధాని పాల్గొననున్న సభలు, రోడ్‌ షోలకు సంబంధించిన వివరాలను పార్టీ నాయకత్వం ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరు లేదా మే పదో తేదీలోగా రాష్ట్రానికి వస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లో పది నుంచి 12 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారు. ఈ మేరకు ఆయా స్థానాలు గెలిచేందుకు ఉన్న అవకాశాలు, అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపైనా రాష్ట్ర నాయకులకు పార్టీ అగ్రనాయకత్వం దిశా, నిర్ధేశం చేసింది. క్షేత్రస్థాయిలో తమకు సానుకూలంగా ఉన్న అంశాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు ముఖ్య నేతల ప్రచారం కూడా తోడైతే విజయం సాధించడం సులభమవుతుందన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ అగ్ర నేతలు రాష్ట్ర పర్యటనకు క్యూ కడుతున్నారు. పార్టీ ప్రచారానికే కాకుండా ముఖ్య నేతలు నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి కూడా కొందరు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ  వర్గాలు చెబుతున్నాయి

Related Posts