YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

3 వేల మందే గన్ డిపాజిట్...

3 వేల మందే గన్ డిపాజిట్...

హైదరాబాద్, ఏప్రిల్ 23 
పార్లమెంట్ ఎన్నికల కోడ్‎లో భాగంగా గన్ లైసెన్స్ ఉన్న హోల్డర్లు ఆయుధాలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సందర్భంగా డిపాజిట్ చేయాల్సిన గన్స్ ఇంకా చాలామంది డిపాజిట్ చేయలేదన్నారు పోలీసులు. హైదరాబాదులో మొత్తం 8 వేల మందికి పైగా గన్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 3000 మంది మాత్రమే తమ గన్స్‎ను డిపాజిట్ చేశారు. గన్స్‎ను డిపాజిట్ చేయని వారిలో ఎక్కువ శాతం సెలబ్రిటీలు, వీఐపీలే ఉన్నట్లు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్ లైసెన్సులు కలిగిన 4600 మంది ఆయుధాలను డిపాజిట్ చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ సంఖ్య మరింత తక్కువకు చేరింది. ఇప్పటివరకు కేవలం 3000 మంది మాత్రమే తమ ఆయుధాలను డిపాజిట్ చేశారు. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండే గన్ లైసెన్సుల కోసం కమిషనరేట్ పరిధిలోని అధికారి ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. గన్ లైసెన్స్ కలిగిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆయుధాలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చాలా తక్కువ సంఖ్యలో లైసెన్స్ హోల్డర్లు డిపాజిట్ చేస్తున్నారు. డిపాజిట్ చేయనివారిలో చాలామంది కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పోలీసుల నుండి అనుమతి తీసుకొని గన్స్‎ను సబ్మిట్ చేయకుండా ఉండవచ్చు. అయితే దీనికోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ కలిగిన వారు తమకు ప్రాణహాని ఉందని భావిస్తే సంబంధిత ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకొని గన్‎ను తమ దగ్గరే పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయని చాలామంది కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. నిబంధనలకి విరుద్ధంగా తమ దగ్గరే ఆయుధాలను పెట్టుకుంటున్నారు.తెలంగాణలో అత్యధికంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ గన్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 894 గన్ లైసెన్సీలు ఉన్నాయి. మరోవైపు బ్యాంకు సిబ్బంది కూడా గన్స్‎ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులకు దీని నుండి మినహాయింపు ఇచ్చారు పోలీసులు. క్యాష్ తరలింపుకు ఆయుధాలు అవసరం కాబట్టి బ్యాంక్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారికి మినహాయింపు ఇచ్చారు. వీరితో పాటు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యులకు సైతం పోలీసులు మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంకా ఆయుధాలను డిపాజిట్ చేయని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రాణహాని ఉందని భావిస్తే సంబంధిత అధికారుల నుండి అనుమతి తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related Posts