YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెట్రో కారిడార్ లో స్కై వాక్..

మెట్రో కారిడార్ లో స్కై వాక్..

హైదరాబాద్, ఏప్రిల్ 29
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. హైదరాబాద్ నగరానికి కంఠాభరణం గా ఉన్న మెట్రో రైల్ మరింత విస్తరించేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలను మాత్రమే కలుపుతోంది. అయితే దీనిని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. పాతబస్తీ ప్రాంతానికి కూడా మెట్రో సౌకర్యం కల్పించేందుకు ఇటీవల పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి చాంద్రాయణ గుట్ట మీదుగా మెట్రో స్టేషన్లు, రైల్వే లైన్ నిర్మిస్తారు. సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఈ మార్గం ఉంటుంది. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. మెట్రో స్టేషన్ నిర్మాణానికి సంబంధించి మూసీ నది వద్ద ఎదురయ్యే సవాళ్లను అధికారులు పరిశీలించారు. ఎల్బీనగర్, బైరామల్ గూడ వద్ద వంతెనలు నిర్మించనున్నారు.నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే మార్గంలో నిర్మించే మెట్రో స్టేషన్ ను ఎల్బీనగర్ వైపు నిర్మిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం నాగోల్, ఎల్బీనగర్ స్టేషన్లో కలుపుతూ స్కై వాక్ నిర్మిస్తారు. నాగోల్ స్టేషన్ అనంతరం మూసీ నదిపై నిర్మించే వంతెన పై ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద తాగునీటి పైపులు, భూగర్భంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు ఉన్న నేపథ్యంలో.. అలైన్మెంట్ మరో పది మీటర్లు ఎడమవైపుకు జరుపుతారు.. మూసి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొడవైన స్పాన్లతో పెద్దపెద్ద వంతెనలు నిర్మిస్తారు. కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రోడ్డుకు అనుసంధానంగా చుట్టుపక్కల ఉన్న ప్రజల అవసరాల దృష్ట్యా అదనపు స్టేషన్ ను నిర్మిస్తారు. నాగోల్ ఆర్టీవో స్టేషన్, అల్కాపురి జంక్షన్ మధ్యలో విశాలమైన స్కైవాక్ నిర్మిస్తారు. కామినేని ఆసుపత్రి స్టేషన్ తర్వాత, ఎల్బీనగర్ జంక్షన్ కు దగ్గర్లో అండర్ పాస్, రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణాలలో అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్ కుడివైపున ఉండే కొత్త స్టేషన్ ను మెట్రో కారిడార్ -1 లోని పాత స్టేషన్ ను స్కై వాక్ తో అనుసంధానిస్తారు. బైరామల్ గూడ, సాగర్ రోడ్డు పై భారీ ఫ్లై ఓవర్ ఉన్న నేపథ్యంలో.. విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ ఎత్తను మరింత పెంచనున్నారు.మరోవైపు బైరామల్ గూడ, సాగర్ రోడ్డు జంక్షన్ మెట్రో స్టేషన్ ఎత్తు తగ్గించేందుకు, మెట్రో అలైన్మెంట్ ఫ్లైఓవర్లను ప్రభుత్వం కుడివైపు నిర్మించనుంది. అలా అలైన్మెంట్ మార్చిన తర్వాత ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో మెట్రో స్టేషన్ నిర్మిస్తారు. మైత్రి నగర్, కర్మాన్ ఘాట్, చంపాపేట జంక్షన్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, హఫీజ్ బాబా నగర్ వంటి ప్రాంతాలలో మెట్రో స్టేషన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవే కాకుండా చాంద్రాయణగుట్టలో ఫ్లై ఓవర్ నిర్మించనుంది. అక్కడ ఇంటర్ చేంజ్ విధానంలో మెట్రో స్టేషన్ నిర్మించనుంది. నాగోల్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు అనేక ఫ్లై ఓవర్లున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారి కూడా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్తులను సేకరించి, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related Posts