YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వేగంగా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు

వేగంగా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు

హైదరాబాద్, మే 2,
రాష్ట్రంలో పెను సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటిదాకా కేవలం పోలీస్ బాసులు, ఉన్నతాధికారులపైనే ఫోకస్ చేసిన స్పెషల్ టీమ్ త్వరలోనే మరో బాంబు పేల్చబోతోంది. పార్లమెంట్ ఎన్నికలు అవగానే స్పెషల్ టీమ్ రాజకీయ నేతలపై ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే పలువురు అధికారులు నాడు రాజకీయ నాయకులు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ చాలా తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ట్యాపింగ్ చేయడం అనేది పోలీసు వ్యవస్థలో భాగమేనని, అందులో ఏ మాత్రం రాజకీయ జోక్యం ఉండదని చెబుతున్నారు. అయితే, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాలలో డబ్బులు తరలించామని అరెస్టయిన అధికారి వాంగ్మూలం చుట్టూ ఇకపై పోలీసులు ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.ఇప్పటిదాకా ఆచితూచి సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు, ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఊపందుకునే అవకాశం ఉంది. మొదటి దశ దర్యాప్తు పూర్తయ్యేసరికి రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికల సందడి మొదలైంది. పోలీసులు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. అయితే, ఎన్నికలయ్యాక జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకుల చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. అందుకే, ప్రస్తుతానికి ఈ దర్యాప్తునకు కొంత విరామం ఇచ్చి, ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి మొదలుపెట్టాలనేది అధికారుల ఆలోచనగా తెలిసింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్‌ చేశారన్నది ప్రధాన అభియోగం కాగా ఎవరి కోసం చేశారన్నది తేల్చకపోతే కేసు నిలబడే అవకాశం లేదు. అందుకే, ఇప్పటి వరకూ క్షేత్రస్థాయిలో ఆధారాల సేకరణపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు ఇక మీదట పైస్థాయిలో జరిగిన తతంగాన్ని నిగ్గు తేల్చనున్నారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధమున్న రాజకీయ నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీమ్ రెడీ అవుతోంది. ఆ లీడర్లు ఎవరనేది అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేతలను కొద్దిమంది పోలీసులు ‘లక్కీ సిక్స్‌’ అని పిల్చుకుంటున్నారు. గతంలో ‘కీ రోల్’ పోషించిన ఇద్దరు మాజీ మంత్రులు, పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉన్న ఓ ఎమ్మెల్సీ, టాప్-ఫైవ్‌లో ఉన్న మరో నేత‌తో పాటు మాజీ ఐఏఎస్‌ను కూడా పోలీసులు పేర్కొంటున్న ‘లక్కీ జాబితాలో ఉన్నట్టు సమాచారం. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వీరి పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నా నోటీసులు అందుకున్న తర్వాతనే ఆ నేతలు ఎవరనే క్లారిటీ రానున్నది.గతంలో ఎస్ఐబీలో అధికారులుగా పనిచేసినవారిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇప్పుడు వారందరి కస్టడీ పీరియడ్ ముగిసిపోవడంతో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. తదుపరి దర్యాప్తు ఏ దిశగా సాగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. వారి స్టేట్‌మెంట్లలో రికార్డు చేసిన అంశాల్లో పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఉందని తేలడంతో వారికి కూడా నోటీసులిచ్చి ప్రశ్నించాలన్నది పోలీసుల ఆలోచన. ఫోన్ ట్యాపింగ్‌లో వారి ప్రమేయమేంటి? ప్రతిపక్ష పార్టీల నేతల సంభాషణలపై ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది? వారిని కట్టడి చేయాలని ఆర్డర్ ఇచ్చినవారెవరు? ఇలాంటివాటిని ఇప్పుడు పోలీసులు రాబట్టాలనుకుంటున్నారు.

Related Posts