YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ ప్రసంగాల్లో కనిపించని మార్క్...

కేసీఆర్ ప్రసంగాల్లో కనిపించని మార్క్...

కరీంనగర్, మే 4,
తెలంగాణలో బీజేపీకి అంతర్లీనంగా సపోర్ట్ చేస్తూ పైకి మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారా కేసీఆర్? ఇటీవల కేసీఆర్ ప్రసంగాలలో ఆయన విమర్శలు చూస్తుంటే కాంగ్రెస్ కు దెబ్బకొడుతూ…బీజేపీని పైకి లేపాలని చూస్తున్నట్లుగా ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు. గతంలోనూ కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేయడానికి కంకణం కట్టుకుని ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కాంగ్రెస్ నేతలను అక్కున చేర్చుకున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ను బలహీనపరుద్దామనుకున్నారో అప్పటినుంచీ బీజేపీకి బలం చేకూరుస్తూ వస్తున్నారు కేసీఆర్. ఇక ప్రాంతీయ సెంటిమెంట్ ను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీని పెట్టిన కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి తన ప్రాంతీయతకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అది కూడా తెలంగాణలో బీజేపీకి లేని బలం క్రియేట్ చేసినట్లయిందని విమర్శకులు భావిస్తున్నారు.అసలు తెలంగాణ బీజేపీ పరిస్థితి చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది బీజేపీ. అలాంటిది 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా నాలుగు సీట్లు సాధించుకుంది బీజేపీ. ఇందుకు కారణం కేసీఆర్ అని చెప్పక తప్పదంటున్నారు విమర్శకులు. హిందూ గాళ్లు..బొంద గాళ్లు అంటూ కేసీఆర్ అహంకారపు మాటలు మాట్లాడారు ఆ ఎన్నికలలో. ఇది ఒక రకంగా బీజేపీకి మేలు చేసింది. సరిగ్గా ఇప్పుడు కూడా కేసీఆర్ మళ్లీ బీజేపీకి విజయావకాశాలు కలిగేలా తన ప్రసంగాలు ఉంటున్నాయి. ఎంతో ఆర్భాటంగా హోమాలు, జపాలు నిర్వహించే కేసీఆర్ తనకి తానుగా ఓ సెక్యులర్ నేతగా అనిపించుకుంటూ మరో పక్క బీజేపీ ఓ సెక్యులర్ పార్టీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఎక్కువ శాతం ఉన్న హిందూ ఓటర్ల మనోభావాలు దెబ్బ తినేలా అక్షింతలు, పులిహోరలు ప్రజల కడుపులు నింపవు కదా అంటూ వ్యాఖ్యలు చేశారు ఇటీవల. ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా బీజేపీకి ఊతం అందించినట్లయింది అంటున్నారు విమర్శకులు. కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీలో కింది స్థాయి నుంచి అగ్రనేతల వరకు తెలంగాణలో డబుల్ డిజిట్ ఖచ్చితంగా వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. నాడు హిందు గాళ్లు బొందు గాళ్లు అంటే నాలుగు స్థానాల్లో విజయం పొందిన బీజేపీకి… నేడు కేసీఆర్ రాముడు, అక్షింతలు, పులిహోర అంటూ వ్యాఖ్యలు చేస్తుండటం చూస్తుంటే, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకీ చేయూతనిచ్చేలాగా ఉపయోగపడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు మేధావులు, మరో వైపు అల్లా ఆశీర్వాదంతోనే తెలంగాణ ఏర్పడిందంటూ ప్రసంగం ముగిస్తున్నారు. అంటే తెలంగాణ ఏర్పాటులో హిందూ దేవుళ్ళ పాత్ర లేదా అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు?అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కవిత అరెస్ట్ అయ్యుంటే బీజేపీ 20 నుండి 30 సీట్లు సునాయాసంగా గెలిచేదని చేజేతులారా వచ్చిన అవకాశం కోల్పోయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీజేపీతో ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగంగానే రాష్ట్రం కేసీఆర్ కు కేంద్రం మోదీకి అనే పరస్పర ఒప్పందం ప్రకారంగానే అదంతా జరిగిందనే ప్రచారం సాగింది. తెలంగాణలో కేసీఆర్ అధికారానికి దూరమై నప్పటికీ బీజేపీపైనే ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలో మెజారిటీ తో సంబంధం లేకుండా తాను చక్రం తిప్పాలని భావిస్తూ… బిడ్డను బయటకు తీసుకుని రావడం ప్రధాన కర్తవ్యంగా పావులు కడుపుతున్నారు. తాను అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదు బీజేపీని మాత్రం కేంద్రంలో నిలబెట్టాలని చూస్తున్న కేసీఆర్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీని రోజురోజుకూ పైకి లేపుతున్నట్లే కనిపిస్తోందని విమర్శకులు భావిస్తున్నారు. ఇదంతా రేపు కాంగ్రెస్ తన ఫ్యామిలీపై పెట్టే కేసులనుంచి తప్పించుకోవడానికి బీజేపీ కి పరోక్ష సహకారం అందించడం తప్ప గత్యంతరం లేదని కేసీఆర్ భావించడమే నని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts