YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ రేసులోకి వచ్చిన గులాబీ

వరంగల్ రేసులోకి వచ్చిన గులాబీ

వరంగల్, మే 4
తెలంగాణలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌లో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. కేసీఆర్‌ బస్సు యాత్ర తర్వాత బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు ఓరుగల్లు పోరు ద్విముఖమే అనే భావన ఉండగా.. ఇప్పుడు అది కాస్త ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. కాగా పోటీలో ఉన్న ముగ్గురూ మొదటిసారి లోక్ సభ బరిలో నిలవగా, పార్లమెంట్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఎవరికి దక్కుతుందోననే చర్చ జరుగుతోంది.పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరంగల్ రాజకీయాలు వేగంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తరువాత మూడు రోజులకే కమలం పార్టీ అరూరి రమేశ్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తరువాత వారం, పదిరోజులకు అప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారైన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరి లోక్ సభ టికెట్ దక్కించుకున్నారు.వరుస పరిణామాలతో బీఆర్ఎస్ కుదేలవగా.. ఆ పార్టీ సుధీర్ఘ ఆలోచన చేసి హనుమకొండ జడ్పీ చైర్మన్ గా ఉన్న డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించింది. సరైన క్యాడర్ లేకపోవడం, జనాల్లో పెద్దగా పేరున్న నేత కూడా కాకపోవడంతో ఆయనను నామమాత్రపు క్యాండిడేట్ గానే అందరూ భావించారు.పార్టీ క్యాడర్ లోనూ నిరుత్సాహమే కనిపించింది. దీంతో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన తరువాత బీఆర్ఎస్ ఊహించనంత పుంజుకుంది. కేసీఆర్ బస్సుయాత్రకు ఓరుగల్లు ప్రజలు బ్రహ్మరథం పట్టగా.. ఆయన తన దైన స్టైల్ లో కార్యకర్తల్లో జోష్ నింపారు.దీంతో బీఆర్ఎస్ క్యాండిడేట్ విషయంలో లైట్ తీసుకున్న నేతలు కూడా యాక్టీవ్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు కార్యకర్తలకు కూడా తగిన సూచనలు ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్యే ఉంటుందనుకున్న పోటీ ట్రయాంగిల్ వార్ తో రసవత్తరంగా మారింది
బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలిచిన డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ కు తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుండగా.. ఆయన ఎంపీటీసీ నుంచి హనుమకొండ జడ్పీ చైర్మన్ వరకు ఎదిగారు. కాగా బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొదటిసారి ఆయన లోక్ సభ బరిలో నిలిచారు.ఇక కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. ఆమె స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కాగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. కడియం శ్రీహరికి కొడుకులు లేకపోవడంతో, కావ్యను తన రాజకీయ వారసురాలిగా ప్రకటించుకుని, పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయించారు. దీంతో ఆమె కూడా మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.మరో వైపు బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి స్టేషన్ ఘన్ పూర్ లో పోటీ చేసి ఓటమి చవి చూసిన ఆయన 2014, 2018 ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎలాగైనా పొలిటికల్ పవర్ జర్నీ కొనసాగించాలనుకున్న అరూరి రమేశ్ బీజేపీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకుని, మొదటిసారి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు మొదటి సారి లోక్ సభ బరిలో నిలవగా.. వరంగల్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.సరైన పేరు, క్యాడర్ లేకపోవడం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్‌కు మైనస్ కాగా.. కేసీఆర్ ఎంట్రీ తరువాత కొంత పుంజుకున్నట్టు కనిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో సీనియన్, జూనియర్ పంచాయతీ నడుస్తోంది. కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ హస్తం పార్టీలో చేరడం కొందరు ఆ పార్టీ నాయకులకు పెద్దగా ఇష్టం లేదు.దీంతోనే తరచూ మీటింగుల సందర్భంగా వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ కొద్దిరోజుల కిందటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేయగా.. ఆయనపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఓరుగల్లు ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారోననే చర్చ జరుగుతోంది.వరంగల్ లోక్ సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ పోరు నడుస్తుండగా.. పోటీలో గెలిచిన వ్యక్తికి మొదటిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టే అవకాశం దక్కనుంది. మరి ఓరుగల్లు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో.. మొదటిసారి పార్లమెంట్ లో అధ్యక్షా అని గళం విప్పే అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

Related Posts