YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిర్మాతకు టోకరా నిందితుడికోసం గాలింపు

నిర్మాతకు టోకరా నిందితుడికోసం గాలింపు

హైదరాబాద్
సినిమాలో ఒక్క చాన్స్’.. అంటూ వచ్చిన ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో నివాసముంటున్న టంగుటూరి ఎల్లలుబాబు భావేశ్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ నడిపిస్తున్నాడు. గతేడాది సాయికుమార్ ప్రధాన పాత్రధారిగా ‘నాతో నేను’ అనే సినిమా తీశారు. ఇటీవల కొత్త సినిమాలో నటీనటుల కోసం చూస్తున్నారు. కాగా, శ్రీకాంత్ అనే యువకుడు ఇటీవల నిర్మాత ఎల్లలు బాబు వద్దకు వచ్చి.. సినిమాల్లో చాన్స్ ఇప్పించాలని కోరాడు. రెండుమూడు సార్లు ఆఫీసుకు రావడంతో త్వరలోనే ఆడిషన్స్ పెట్టిస్తానంటూ చెప్పారు. ఇదే క్రమంలో ఈ నెల 1న ఆడిషన్స్ కోసం రావాలంటూ చెప్పడంతో నిర్మాత బాబు వద్దకు వచ్చిన శ్రీకాంత్ రెండు గంటల పాటు తనలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించాడు. తనకు ఒక్క చాన్స్ ఇస్తే మంచి నటుడిగా ఎదుగుతానంటూ నిర్మాతను మాటల్లో పెట్టాడు.
మధ్యాహ్నం దాటడంతో పక్కనే ఉన్న రెస్టారెంట్కు వెళ్లి భోజనం తీసుకురావాలంటూ నిర్మాత బాబుకు సూచించాడు. శ్రీకాంత్ బయటకు వెళ్లి భోజనంతో పాటు మద్యం తీసుకువచ్చాడు. అభిమానంతో మద్యం తీసుకువచ్చానంటూ మాటల్లో పెట్టి విపరీతంగా తాగించాడు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న ఎల్లలు బాబు మెడలో ఉన్న 10 తులాల బంగారు గొలుసు, 3 ఉంగరాలు, ఖరీదైన రాడో వాచీతో పాటు సొరుగులో ఉన్న రూ.50వేల నగదును తస్కరించి ఆఫీసు బయట గడియ పెట్టి ఉడాయించాడు. రాత్రయ్యాక నిద్రలోంచి లేచి చూసుకోగా.. తన బంగారంతో పాటు ఇతర వస్తువులు చోరీ అయినట్లు గుర్తించిన నిర్మాత బాబు తన కుమారుడికి ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. శుక్రవారం నిర్మాత బాబు కుమారుడు టంగుటూరి ప్రవీణ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 420, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Related Posts