YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోరాడుతున్న కొడాలి నాని

పోరాడుతున్న కొడాలి నాని

విజయవాడ, మే 7,
ఏపీలో హాట్ నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయినా గుడివాడను కొడాలి నాని అడ్డాగా మార్చుకున్నారు. గత నాలుగు ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారు. ఇప్పుడు ఐదోసారి గెలవాలన్న ప్రయత్నంతో ఉన్నారు. అయితే నాని దూకుడుకు చెక్ చెప్పి రాజకీయంగా సమాధి చేయాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అందుకే ఆర్థిక అంగ బలం ఉన్న ఎన్నారై వెనిగండ్ల రామును రంగంలోకి దించారు.ప్రస్తుతం గుడివాడలో అయితే కొడాలి నాని కి టైట్ ఫైట్ ఉంది. గత నాలుగు ఎన్నికల మాదిరిగా సులువుగా గెలుచుకుంటామంటే కుదిరే పని కాదు. అందుకే నాని సైతం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉండడం లేదు. తన ప్రత్యర్థులంతా ఏకం అవ్వడాన్ని ఆయన గుర్తించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేశారు. 1985 ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పదిసార్లు ఎన్నికలు జరగగా.. ఆ పార్టీ ఏడుసార్లు విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. గత రెండు ఎన్నికల్లోను వైసీపీ తరఫున కొడాలి నాని విజయం సాధించారు. అయితే వరుస ఓటములతో గుణపాఠం నేర్చుకున్న టిడిపి బలమైన అభ్యర్థిని ఈసారి రంగంలోకి దించింది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. కానీ హై కమాండ్ బలమైన హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగారు. వెనిగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.ఒకవైపు ప్రత్యర్థులు ఏకం కావడం, మరోవైపు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో.. నాని స్టైల్ మార్చారు. సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని.. గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాలనుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే నియోజకవర్గంలో అపరిస్కృత సమస్యలు చాలా ఉన్నాయి. రాజకీయంగా దూకుడు కనబరిచే నాని.. అభివృద్ధి విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు విరక్తితో ఉన్నారు. ఇది కొడాలి నాని కి మైనస్ పాయింట్. అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని యోచనలో కొడాలి నాని ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సమీకరించి ప్రచారంలోకి దించారు.అయినా సరే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా సొంత సామాజిక వర్గం నుంచి భారీ వ్యతిరేకత ఉంది. దీంతో ఇక్కడ కొడాలి నాని ఎదురీదక తప్పడం లేదు. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

Related Posts