YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సూపర్ సిక్సే ప్రధాన అస్త్రాలు

సూపర్ సిక్సే ప్రధాన అస్త్రాలు

నిజామాబాద్, మే 7,
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించిన విమర్శకుల నోళ్లు మూయిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు దూసుకుపోతోంది. ఇప్పటికే ఆరు హామీలలో 5 హామీలు అమలు చేసి ఆరవ కీలక హామీ అయిన రైతు రుణమాఫీపై తేదీని సైతం నిర్ణయించి ప్రకటించారు. దశాబ్దాల తన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ విపక్ష పార్టీ ప్రతినిధిగా ఉన్న రేవంత్.. నేరుగా సీఎం కావటంతో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో అనే అనుమానాలకు చెక్ పెడుతూ.. ఇచ్చిన 6 హామీల్లో ఐదింటిని నాలుగు నెలల్లోనే అమలు చేసి చూపించారు. సీఎం ధీమా చూసిన కాంగ్రెస్ నేతలు కూడా మిగిలిన ప్రతి హామీనీ ఎన్నికల కోడ్ తర్వాత అమలు చేసి తీరతామని ప్రజలకు చెబుతూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు.ఈ ఎంపీ ఎన్నికల్లో మహాలక్ష్మి ,గృహజ్యోతి వంటి పథకాల అమలు తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి అంశాలు కుల, మతాలకు అతీతంగా మహిళల మనసు గెలిచాయనీ, దీంతో ఈసారి వారి ఓట్లు తమకేననే అంతర్గత సర్వేలూ చెబుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల పంపిణీ స్కాం, హెచ్ఎండీఏ అధికారుల అవినీతి, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టు వంటి వాటి మూలంగా, బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండిపడటం ఖాయమని, అందులో చెప్పుకోదగ్గ మొత్తం తనవైపు మళ్లుతుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. తాము వచ్చిన 3 నెలల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు, నియమాకాలు పూర్తైన ఉద్యోగాలకు సంబంధించిన నియమాక పత్రాలు అందించటంతో ఈసారి నిరుద్యోగుల ఓటూ తమకే మళ్లుతుందని, ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్స్ వంటి కార్యక్రమాలు కూడా తమకు ప్లస్ అవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది.నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి గృహజ్యోతి స్కీమ్ కింద మాఫీ కోసం రూ. 2,418 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం రూ. 22,500 కోట్లు కేటాయించి, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3,500 చొప్పున మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధంచేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి నెలకు సుమారు రూ. 250 కోట్ల ఖర్చు అవుతుండగా, ఏడాదికి దాదాపు రూ. 1,500 కోట్లు అవుతోందని ఆర్టీసీ అంచనావేసింది. ఇందులో ఫిబ్రవరిలో రూ. 374 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి అందజేసింది. మహాలక్ష్మి స్కీమ్‌లోని రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ కోసం మార్చి నెల అడ్వాన్సుగా రూ. 80 కోట్లను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం విడుదల చేసింది. దీనికోసం ఏడాదికి దాదాపు 40 లక్షల మందికి రూ. 3,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రైతు భరోసాకు ఒక సీజన్‌కు రూ. 9,650 కోట్ల చొప్పున రెండు సీజన్‌లకు కలిపి దాదాపు రూ. 19 వేల కోట్లు అవుతుందని అంచనా. వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్‌గా ఒక్కో సీజన్‌కు సగటున కోటి టన్నులకు రూ. 5 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ‘ఆసరా’ పేరుతో ఉన్న పింఛన్లను ‘చేయూత’ పేరుతో రూ. 4,000కు పెంచినందున ఏటా దాదాపు 18 వేల కోట్లు అవసరమని సర్కారు అంచనా వేసింది.ఇప్పటికే అమలవుతున్న హామీలతో ప్రజలు రేవంత్ సర్కార్ పట్ల సుముఖంగా ఉన్నారని సర్వేలు సూచిస్తున్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచి డిసెంబరు 9, 2023 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అదే రోజు అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 27, 2024 నుంచి 200 యూనిట్ల (నెలకు) వరకు ఉచిత విద్యుత్, తెల్ల రేషను కార్డు ఉన్నవారికి రూ.500కే వంట గ్యాస్ పథకం అమలులోకి వచ్చాయి. సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కల్పించే స్కీమ్ మార్చి 11, 2024 నుంచి అమలవుతోంది.ప్రతి నెలా రూ. 2,500 చొప్పున మహాలక్ష్మి ఆర్థిక సాయం, రైతు భరోసా పేరుతో రైతులు, కౌలు రైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ (ఎంఎస్పీకి అదనంగా), ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల చొప్పున ఇంటి స్థలాలు, ప్రస్తుతం ఉన్న రూ. 2,016 పింఛను (ఆసరా)ను ‘చేయూత’ పేరుతో నెలకు రూ. 4,000కు పెంపు, విద్యార్థులకు రూ. 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు వంటి పథకాలను ఈ ఎన్నికల కోడ్ అనంతరం మెదలుపెట్టేందుకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్ సర్కార్.

Related Posts