YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఐదు రోజులు వానలే..వానలు

ఐదు రోజులు వానలే..వానలు

హైదరాబాద్, మే 7,
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండవేడిమి, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఓ వైపు ఎండలతో అల్లాడిపోతుంటే మరో వైపు వడగాల్పులు బెంబేలెత్తిస్తున్నాయి. వడగాల్పుల తీవ్రతకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈక్రమంలో మండుటెండల్లో వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురును అందించింది. తెలంగాణ రాష్ట్రంలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎండలతో సతమతవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాగల ఐదురోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నేడు (ఆదివారం) కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల రాకతో ప్రజలకు మండే ఎండల నుంచి రిలీఫ్ కలుగనున్నది.

Related Posts