YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జహీరాబాద్ లో గెలుపు తంత్రం...

జహీరాబాద్ లో  గెలుపు తంత్రం...

మెదక్, మే 8,
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక సరిహద్దులోని జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం వేగంగా మారుతోంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీఆర్ఎస్ తరపున గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలో జుక్కల్(ఎస్సీ), బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణ్ ఖేడ్, ఆందోల్ (ఎస్సీ), జహీరాబాద్(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్, ఎల్లారెడ్డి, నారాయణ్ ఖేడ్, ఆందోల్ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా, బాన్స్‌వాడ, జహీరాబాద్ స్థానాలు గులాబీ పార్టీ గెలుచుకుంది. కామారెడ్డి మాత్రం కమలనాథులకు దక్కింది.2008 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన ఈ స్థానంలో మొత్తం 16,31,996 ఓటర్లుండగా, వీరిలో 7,98,220మంది పురుషులు, 8,33,718 మంది మహిళలు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ విజయభేరి మోగించగా, 2014, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపొందింది. 2019లో ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి మదనమోహన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కేవలం 6 వేల ఓట్లతో గెలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. 7 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కు 5,49,143, బీఆర్ఎస్‌కు 5,30,499, బీజేపీకి 1,72,166 ఓట్లు వచ్చాయి.ఇక అభ్యర్థుల విషయానికి వస్తే.. 2014,2019లో బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఆ పార్టీ సీటు సాధించారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా ఏనాడూ ప్రజలకు అందుబాటులో లేరనీ, ఇక్కడి సమస్యలనూ పూర్తిగా నిర్లక్ష్యం చేసి, సొంత వ్యాపారాల కోసమే సమయం కేటాయించారనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరి టికెట్ సాధించటంతో ముందునుంచీ బీజేపీకి పనిచేస్తున్న నేతలు ఆయనకు సహాయ నిరాకరణ చేశారు. కానీ, పార్టీ హైకమాండ్ ఆదేశాలతో వారు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మోదీ చరిష్మా, సొంత సామాజిక వర్గమైన లింగాయత్‌లతో బాటు తెలుగు కన్నడిగుల మద్దతు ఈయనకు కలిసొచ్చే అంశాలు కాగా, తెలుగు మాట్లాడలేకపోవటం, పదేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్కపనీ చేయలేని పూర్ రికార్డు ఈయనకు పెద్ద మైనస్‌గా ఉంది.ఇక కాంగ్రెస్ ఈసారి ఇదే స్థానంలో 2009లో గెలిచిన సురేష్ షెట్కార్‌ను బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే ప్రచారం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, పథకాల ప్రభావంతో బాటు షెట్కార్‌కు మృదు స్వభావిగా, వివాద రహితుడిగా పేరుండటం, అనేక ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేయడం, అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు, లింగాయత్ ఓటర్లలో సానుకూల ఇమేజ్ ఉన్న సురేష్‌కు ఈ ఎంపీ సీటు పరిధిలోని ఏడు సీట్లలో నాలుగు సీట్లు కాంగ్రెస్ చేతిలోనే ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది. అయితే, ఈయన గెలిస్తే అందుబాటులో ఉండరనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కవిత అరెస్టు నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్‌కు ఓటువేసిన మైనారిటీలు, లింగాయత్ ఓటర్లలో మెజారిటి ఈసారి ఈయనకు మద్దతుగా నిలుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గాలి అనిల్ కుమార్‌ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పోల్చితే అంగబలం, అర్థబలం లేని అభ్యర్థి. అయితే ఈయన మున్నూరు కాపు వర్గానికి చెందిన వ్యక్తి కావటం, ఈ నియోజకవర్గంలో రెండున్నర లక్షల మున్నూరుకాపు ఓటర్లుండటం కలిసొచ్చే అంశం. అయితే.. పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన ఈయనను నాన్ లోకల్ అంటూ మిగిలిన అభ్యర్థులంతా ప్రచారం చేయటం, ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు పరిణామాలు ఈయనకు ప్రతికూలంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కోసం సీటు త్యాగం చేసిన మున్నూరు కాపు నేత బాజిరెడ్డి గోవర్థన్, మూడు సార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా గెలిచిన హన్మంత్ షిండే, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్లను కాదని గాలి అనిల్ కుమార్‌కు సీటు ఇవ్వటం ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ,బీఆర్ఎస్ మధ్య కుదిరిన అవగాహనలో భాగంగానే ఈ సీటులో బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థిని రంగంలోకి దించిందనే వాదనా వినిపిస్తోంది.ఎగువ ప్రాంతంలో మంజీరానది పారుతున్నా తాగు, సాగునీటికి ఈ ప్రాంతం పూర్తిగా నోచుకోలేకపోవటం, నేటికీ చాలా ప్రాంతాల్లో తాగునీటి కోసం చెలమలు, వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొనటం, మద్దతు ధర లేక చెరుకు రైతులు ఇబ్బందిపడటం, పరిశ్రమలు లేక స్థానికంగా ఉపాధి అవకాశాల్లేక యువతలో ఉన్న అసంతృప్తి, ఇక్కడి వందల గిరిజన తండాల వాసులు ఏడాదిలో ఐదు నెలలు పనుల కోసం వలస పోవాల్సి రావటం, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోని గల్ఫ్ బాధితుల సమస్యలు, బీడీ కార్మికుల సమస్యలు వంటివి ఇక్కడ కీలక ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి.

Related Posts